- ‘వస్తున్నా.. తోలు తీస్తా’ అంటూ కేసీఆర్ కామెంట్
- ‘చింతమడకలోనే చీరి చింతకు కడ్తం’
- అంటూ సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్
- ‘ఎడమకాలి చెప్పుతో కొడ్తా’ అని కేటీఆర్ వ్యాఖ్య
- అగ్ర నేతలకు తోడుగా తిట్ల దండకం అందుకున్న లీడర్లు
- కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తారాస్థాయికి మాటల మంటలు
- ‘నోటి గబ్బు తప్ప.. ఇంకేం లేదు’ అని బండి సంజయ్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ తిట్ల వరద మొదలైంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్నాళ్లూ.. ప్రతిపక్షాలను కేసీఆర్ తిట్టేవారు. నాడు సీఎం హోదా కూడా మరిచిపోయి ‘దద్దమ్మలు, రండలు’ అంటూ మాట్లాడేవారు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. రాష్ట్ర రాజకీయాల్లో తిట్లు కాస్త తగ్గాయి. అప్పుడప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య కొంచెం ఘాటు విమర్శలు వచ్చినా.. తిట్లు మాత్రం లేవు. అయితే ఇటీవల కేసీఆర్ తన ఫాంహౌస్‌ను వీడి రీఎంట్రీ ఇవ్వడంతో మళ్లీ పాత కథ రిపీట్ అయింది. వచ్చీరాగానే ‘తోలు తీస్తా’ అని కేసీఆర్ స్టార్ట్ చేస్తే.. ‘చీరి చింతకు కడ్తం’ అంటూ సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. ఇది ఇక్కడితో ఆగలేదు. వీరిద్దరి మధ్యలోకి కేటీఆర్ ఎంటరై.. ‘ఎడమకాలి చెప్పుతో కొడ్తా’ అంటూ పీక్స్‌కు తీసుకెళ్లారు. ఇలా రెండు పార్టీల్లోని పెద్ద లీడర్లు విమర్శలు గుప్పించుకోవడంతో.. ఇతర నేతలూ తామేం తక్కువ తినలేదన్నట్టు అదే దారిలో నడుస్తున్నారు.
బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్‌గౌడ్, మర్రి జనార్దన్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య తీవ్ర వ్యాఖ్యలు చేస్తే.. కాంగ్రెస్ నుంచి ఎంపీ చామల, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే మేడిపల్లి, ఎమ్మెల్సీ వెంకట్అదే స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కల్పించుకుని రెండు పార్టీలపై ఫైర్ అయ్యారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి.
కేసీఆర్ వర్సెస్ రేవంత్
దాదాపు పది నెలల తర్వాత గత ఆదివారం ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్.. తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై మూడున్నర గంటల పాటు చర్చించారు. అనంతరం ప్రెస్‌మీట్‌పెట్టి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ‘ఇక వస్తున్నా.. తోలుతీస్తా.. ఇప్పటి దాకా ఒక కథ.. ఇక నుంచి ఇంకో కథ’ అంటూ స్ట్రాంగ్వార్నింగ్ఇచ్చారు. ‘ఇంత దద్దమ్మ.. చేతగాని ప్రభుత్వంతో పనులవుతాయా? ఇదో సర్వభ్రష్ట ప్రభుత్వం..’, ‘ఏంది ఈ ఫ్యూచర్ సిటీ.. తొక్కల సిటీ? అన్నీ దిక్కుమాలిన పాలసీలు..’ అంటూ కేసీఆర్ తిట్టిపోశారు. దీనికి కౌంటర్‌గా సీఎం రేవంత్ రెడ్డి కూడా గట్టిగానే అర్సుకున్నారు. ‘కేసీఆర్‌ను మా సర్పంచులు చీరి చింతకు కడ్తరు. మస్తాన్మటన్ కొట్టులో యాటల తోలు తీసే పని ఆయనకు అప్పగిస్తాను” అని వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ను ‘పేడమూతి.. బోడి లింగం’ అంటూ కామెంట్ చేశారు. ఇక ఇందులోకి కేటీఆర్ ఎంటరై.. తనకు రేవంత్ దొరికితే ఎడమకాలి చెప్పుతో కొడతానంటూ తీవ్ర స్థాయిలో మాట్లాడారు. రోడ్డు మీద పెయింటింగులేసుకుని బతికినోడంటూ దుయ్యబట్టారు.
ఇరువైపులాఅందుకున్నరు..
ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ అగ్ర నేతల మధ్య తిట్ల రాజకీయాలతో.. ఆ రెండు పార్టీల్లోని ఇతర నేతలూ తమ నోటికి పని చెప్తున్నారు. కేటీఆర్‌కు సిరిసిల్లలో చెప్పుల దండేసి ఊరేగిస్తామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతి ఎన్నికలోనూ ప్రజలు చెప్పులతో కొడ్తున్నా బీఆర్ఎస్ నేతలు సిగ్గూశరం లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా సీఎం రేవంత్‌పై కామెంట్లతో రెచ్చిపోతున్నారు. దీంతో చిన్న విషయం కాస్తా.. పెనుదుమారమైపోతున్నది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య తిట్ల యుద్ధంతో ఆ రెండు పార్టీల లీడర్ల తీరుపై కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ‘‘తెలంగాణ ప్రజలు మళ్లీ తిట్లు వినాల్సి వస్తున్నది. కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్ల నోటి నుంచి గబ్బు మాటలు తప్ప.. అభివృద్ధి గురించిన చర్చ మాత్రం లేకుండా పోయింది” అంటూ చురకలు అంటించారు.
