మాజీ సైనికుడికి శిఖం భూమి ఇచ్చి.. పదేళ్లుగా తిప్పుకుంటారా?

మాజీ సైనికుడికి శిఖం భూమి ఇచ్చి.. పదేళ్లుగా తిప్పుకుంటారా?
  • పైగా మీరే కోర్టులో న్యాయ పోరాటం చేస్తరా?
  • ఇదేనా సర్కార్ సైనికులకు ఇచ్చే గౌరవం
  • రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఫైర్
  • ఇప్పటికైనా సరైన భూమి ఇవ్వాలని ఆదేశం
  • రెండు వారాల్లో అఫిడవిట్ ఫైల్ చేయాలని ఆర్డర్

హైదరాబాద్, వెలుగు: ‘‘దేశం కోసం బారర్ లో గస్తీ  కాసిన మాజీ సైనికుడికి శిఖం భూమి ఎట్ల కేటాయిస్తరు? పైగా ఆ భూమి కోసం ఎక్స్ సర్వీస్ మెన్ ను పదేండ్లుగా మీ చుట్టూ తిప్పుకుంటరా? మనందరి రక్షణ కోసం కుటుంబాన్ని వదిలి బార్డర్ లో డ్యూటీ చేసిన మాజీ సైనికుడికి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా?’’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఇన్నేండ్లు తిప్పించుకున్నది చాలు.. మాజీ సైనికుడికి ఇకనైనా సరైన భూమిని కేటాయించాలని చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌ రెడ్డిల డివిజన్‌ బెంచ్‌ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. మాజీ సైనికుడు పి.లక్ష్మీనారాయణరెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం 2010లో వికారాబాద్‌ జిల్లాథరూర్‌ మండలం కమ్మరపల్లిలోని 55వ సర్వే నెంబర్‌లో 4 ఎకరాల భూమి కేటాయించింది. దీనికి పట్టాదారు పాస్‌ బుక్ కూడా ఇచ్చిన సర్కార్.. భూమిని మాత్రం అప్పగించలేదు. భూమి కోసం లక్ష్మీనారాయణరెడ్డి ఆఫీసుల చుట్టూ తిరగగా, వరుసగా మూడేండ్లు భూమిని సాగు చేయలేదనే కారణంతో పట్టాను రద్దు చేశామని అధికారులు సమాధానం ఇచ్చారు. దీంతో ఆయన హైకోర్టులో రిట్‌ ఫైల్ చేయగా, వెంటనే భూమిని అప్పగించాలని సింగిల్‌ జడ్జి జస్టిస్‌ ఎమ్మెస్‌ రామచందర్‌రావు 2017లో ఇచ్చిన తీర్పులో ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ తీర్పుపై సర్కార్ ఫైల్ చేసిన అప్పీల్ పిటిషన్ ను చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ గురువారం విచారించింది.

శిఖం భూమి అని తెలియదా?

పిటిషనర్‌కు కేటాయించినది శిఖం భూమి అని, వాటిని ఎవరికీ కేటాయించకూడదని సర్కార్ చెప్పడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘భూమి ఇచ్చి పదేండ్లు అయింది. శిఖం భూమి ఇవ్వడం అధికారుల తప్పు. ఆ భూమి ఇవ్వడమే కాకుండా, దానికి పట్టా కూడా ఇచ్చిన రెవెన్యూ అధికారులకు.. అది శిఖం భూమి అని తెలియదా? పైగా జరిగిన తప్పును సరిదిద్దుకోకపోగా, కోర్టులో న్యాయం పోరాటం చేస్తున్నారు. ఒక మాజీ సైనికుడికి ప్రభుత్వం చేకూర్చే ప్రయోజనాలు ఇలానే ఉంటాయా?” అని హైకోర్టు రాష్ట్ర సర్కార్ పై ఫైర్ అయింది. చట్టప్రకారం శిఖం భూములు ఇవ్వడానికి వీల్లేకపోతే ప్రత్యామ్నాయ భూమిని పిటిషనర్‌కు ఇవ్వాలని, దీనిపై ఏం చర్యలు తీసుకున్నారన్న దానిపై రెండు వారాల్లోగా అఫిడవిట్‌ ఫైల్ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.