జీవో ఇచ్చి నాలుగేండ్లైనా ట్రాన్స్​ఫర్స్ కాలే

జీవో ఇచ్చి నాలుగేండ్లైనా ట్రాన్స్​ఫర్స్ కాలే
  • అంతర్ జిల్లా స్పౌజ్ బదిలీల్లేక టీచర్ల అవస్థలు

హైదరాబాద్, వెలుగుసర్కారు ఏదైనా పనిచేసే ముందు ఎంత ఖర్చవుతుందనే అంచనాతో అది చేయాలా వద్దా అని నిర్ణయం తీసుకుంటుంది. కానీ పైసా ఖర్చు లేని టీచర్ల అంతర్ జిల్లా స్పౌజ్ బదిలీలపై మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. 8 ఏండ్లుగా అంతర్ జిల్లా బదిలీలే జరగలేదు. స్పౌజ్ బదిలీలకు అనుమతిస్తూ 2016లో సర్కారు ఉత్తర్వులిచ్చినా, ఇప్పటికీ విద్యాశాఖలో అమలు జరగట్లేదు. సీఎం కేసీఆర్ నోట పలుమార్లు ఈ బదిలీలకు అనుకూలంగా ప్రకటనలు వచ్చినా.. ఫలితం మాత్రం కన్పించడం లేదు. దీంతో కుటుంబాలకు, పిల్లలకు వందల కిలోమీటర్ల దూరంలో టీచర్లు డ్యూటీ చేయాల్సి వస్తోంది.

2012 తర్వాత బదిలీల్లేవ్..

రాష్ట్రంలో 1.10 లక్షల మంది సర్కారు టీచర్లున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి మూడేండ్లకోసారి ట్రాన్స్​ఫర్స్​జరుగుతాయి. ఈ క్రమంలోనే అంతర్ జిల్లా స్పౌజ్ ట్రాన్స్​ఫర్స్​ కూడా చేయాలి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా టీచర్లకు అంతర్ జిల్లా స్పౌజ్ బదిలీలు నిర్వహించలేదు. చివరగా 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో ట్రాన్స్ ఫర్స్ జరిగాయి. తెలంగాణ వచ్చిన తర్వాత  ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని ప్రకటించడంతో, బదిలీలు రెగ్యులర్​గా జరుగుతాయని అందరూ భావించారు. దీనికితోడు సీఎం కేసీఆర్​పలు సమావేశాల్లో స్పౌజ్ బదిలీలను నిర్వహించాలని, జీరో కేసులుండాలని అధికారులను ఆదేశించారు. కానీ ఇప్పటి వరకూ ఆ బదిలీల నిర్వహణకు కార్యాచరణ లేకపోవడంతో టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 జీవో ఇచ్చినా అమలు కాలే...

అంతర్ జిల్లా స్పౌజ్ బదిలీల కోసం ప్రభుత్వం 2016లో జీవో నంబర్ 182ను రిలీజ్ చేసింది. ఈ జీవో పలు శాఖల్లో అమలు జరిగినా.. ఎడ్యుకేషన్​డిపార్ట్ మెంట్ లో మాత్రం అమలుకు నోచుకోలేదు. ఈ విషయాన్ని బాధిత టీచర్లు, యూనియన్లు మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకుపోయినా ఫలితం లేకుండా పోయింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 2018లో ఎంప్లాయీస్, టీచర్ల సమస్యల పరిష్కారానికి అప్పటి ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ చైర్మన్ గా కేబినేట్ సబ్ కమిటీ వేశారు. మొదటగా ఉమ్మడి జిల్లాల వారిగా స్పౌజ్ బదిలీలు నిర్వహించాలని నిర్ణయించారు. అయినా  అమల్లోకి రాలేదు. సీఎం కేసీఆర్​ కూడా పలు మార్లు స్పౌజ్ కేసుల సమస్య పరిష్కరించాలని ఆదేశించినా.. విద్యాశాఖ మాత్రం షెడ్యూల్ ప్రకటించలేదు.

టీచర్ల అవస్థలు…

వెనుకబడిన జిల్లా అంటూ ఆదిలాబాద్ నుంచి.. నాన్​ లోకల్ కోటా పెరిగిందని హైదరాబాద్​కు బదిలీలు చేయడం లేదు. ఇక్కడ పరస్పర బదిలీలు చేసుకునే అవకాశముందని టీచర్స్ యూనియన్ లీడర్లు చెప్తున్నారు. కనీసం వేరే జిల్లాల్లోనైనా బదిలీలు చేయాలంటున్నా పట్టించుకోవడం లేదు. దీంతో కుటుంబాలకు, పిల్లలకు, తల్లిదండ్రులకు వందల కిలోమీటర్ల దూరంగా ఉంటూ డ్యూటీలు చేస్తున్నారు.  అనారోగ్యంతో ఉన్న సందర్భంలో అవస్థలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పిల్లల బాధ చూడలేకపోతున్న

నేను ఖమ్మం జిల్లా మునుగూరు గర్ల్స్​ హైస్కూల్​లో టీచర్ గా పనిచేస్తున్న. మా ఆయన మహబూబ్​నగర్​ జిల్లాలో చేస్తున్నా రు. మాకు ఇద్దరు పిల్లలు. చెరొకరి వద్ద ఒక్కొ క్కరం టున్నారు. పిల్లల బాధ చూడలేకపో తున్నం. వెంటనే బదిలీలు చేపట్టాలె.

– జ్యోతి, టీచర్

ప్రభుత్వం ఆలోచించాలె

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్​లో టీచర్​గా 2012 నుంచి పనిచేస్తున్న. మా ఆయన సత్తుపల్లిలో ఆర్టీసీ కండక్టర్. మాకు ఇద్దరు పిల్లలు. రెగ్యులర్​గా గంటల తరబడి జర్నీ చేస్తుండ టంతో మెడ నొప్పి, ఇతర సమస్యలొస్తున్నా యి. మా సమస్యపై సర్కారు ఆలోచించాలి.

– ప్రశాంతి, టీచర్

ఎన్నిరోజులు వేచిచూడాలె

నేను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో పనిచేస్తున్న. నా భార్య మెదక్ జిల్లా టెక్​మల్​లో టీచర్. మాకు ఇద్దరు ఆడపిల్లలు. సీఎం  బదిలీలు చేస్తామని ప్రకటిస్తే సంతోషించాం. కానీ ఆ మాటలు అమల్లోకి రావడానికి ఎన్నిరోజులు వేచి చూడాలి.

– మల్లేశం, టీచర్