పంచాయతీల్లోనూ టీఎస్ బీపాస్

పంచాయతీల్లోనూ టీఎస్ బీపాస్

మంచిర్యాల, వెలుగు: మున్సిపాలిటీల్లో లెక్కనే గ్రామ పంచాయతీల్లోనూ టీఎస్ బీపాస్(తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ అసెస్మెంట్ సర్టిఫికెషన్) అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్​మెంట్ డిపార్ట్​మెంట్ జీవో నంబర్ 52 విడుదల చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీల్లోనూ కామన్ బిల్డింగ్ రూల్స్ అమలవుతాయని పేర్కొంది. తద్వారా గ్రామాల్లో అక్రమ నిర్మాణాలకు బ్రేక్ పడుతుందని స్పష్టం చేసింది. వచ్చే నెల నుంచే ఈ కొత్త విధానాన్ని అమలు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.

300 గజాల వరకు జీపీల్లోనే

ప్రస్తుతం గ్రామపంచాయతీల్లో ఈ–పంచాయతీ ద్వారా బిల్డింగ్ పర్మిషన్లు ఇస్తున్నారు. సంబంధిత డాక్యుమెంట్లతో పంచాయతీ సెక్రటరీలకు అప్లై చేసుకుంటే వారు పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తున్నారు. 300 గజాల వరకు పంచాయతీ పరిధిలోనే పర్మిషన్లు ఇస్తున్నారు. అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మాణాలు చేపడితే జిల్లా టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) ద్వారా మంజూరు చేస్తున్నారు. గ్రామాల్లో చాలావరకు 300 గజాలలోపే నిర్మాణాలు జరుగుతున్నాయి.

21రోజుల్లో తేల్చకపోతే పర్మిషన్ ఇచ్చినట్టే

ప్రస్తుతం అన్ని మున్సిపాలిటీల్లో టీఎస్ బీపాస్ ద్వారా బిల్డింగ్ పర్మిషన్లు జారీ చేస్తున్నారు. బిల్డింగ్ ప్లాన్​తో పాటు సంబంధిత డాక్యుమెంట్లు జతచేసి మీసేవలో అప్లై చేసుకోవాలి. రెవెన్యూ, మున్సిపల్ ఆఫీసర్లు వాటిని పరిశీలించి అన్నీ సక్రమంగా ఉంటే పర్మిషన్లు ఇస్తున్నారు. 21 రోజుల్లోగా పర్మిషన్ ఇవ్వకపోతే.. అనుమతిచ్చినట్టే భావించి బిల్డింగ్ కట్టుకోవచ్చు. ఇకపై ఈ సిస్టమ్ గ్రామ పంచాయతీల్లోనూ అమలు కానుంది. దీనికి అనుగుణంగా సాఫ్ట్​వేర్ తయారు చేస్తున్నారు.

ఆఫీసర్లు పరిశీలించాలి

టీఎస్ బీపాస్​లో వచ్చే అప్లికేషన్లను వివిధ శాఖల ఆఫీసర్లు పరిశీలించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మండలానికి ఒకరిద్దరు ఆర్ఐలు మాత్రమే ఉన్నారు. ఇప్పటికే వారు పనిభారంతో పరేషాన్ అవుతున్నారు. ఇతర డిపార్ట్​మెంట్లలోనూ అదే పరిస్థితి. సదరు ఆఫీసర్లు టీఎస్ బీపాస్ అప్లికేషన్లను సకాలంలో పరిశీలించడం అనుమానమే. రిజిస్ట్రేషన్లు, టీఎస్ బీపాస్ చార్జీల రూపంలో వేలల్లో భారం పడనుంది. ఇప్పటికే మున్సిపాలిటీల్లో పలు రకాల డాక్యుమెంట్లు లేవని అప్లికేషన్లను తిరస్కరిస్తున్నారు. చార్జీలను కూడా వాపస్ ఇవ్వడం లేదు. దీంతో గ్రామాల్లో టీఎస్ బీపాస్ అమలు వల్ల పలు ఇబ్బందులు తలెత్తుతాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

రిజిస్ట్రేషన్ లేకుంటే ఇబ్బందే

గ్రామ పంచాయతీల్లో టీఎస్ బీపాస్ అమలుతో ప్రజలకు ఇబ్బందులు తప్పేలా లేవు.మున్సిపాలిటీల్లో అయితే ల్యాండ్ రిజిస్ర్టేషన్, బిల్డింగ్ ప్లాన్ డాక్యుమెంట్లు, ఫైర్, ఇరిగేషన్, ఆర్అండ్​బీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్​మెంట్ల నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్​వోసీ) తప్పనిసరి. ఇకమీదట పంచాయతీల్లో ఇండ్లు కట్టుకోవాలన్నా ఈ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. గ్రామాల్లో చాలావరకు ల్యాండ్ రిజిస్ట్రేషన్లు చేసుకోరు. నేటికీ సాదాబైనామాలపైనే భూముల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. తాతలు తండ్రుల కాలంలో కొన్న భూములకు ఎలాంటి డాక్యుమెంట్లు లేవు. వారసత్వంగా వచ్చిన భూములకు సైతం పట్టాలు, రిజిస్ట్రేషన్లు లేవు. ఇప్పుడు వాటికి రిజిస్ట్రేషన్లు చేసుకోవాలంటే ఇబ్బందులు తలెత్తున్నాయి.