హైదరాబాద్, వెలుగు: కొండనాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఉడిందన్న చందంగా మారింది టెన్త్ క్వశ్చన్ పేపర్ల పరిస్థితి. ఈ ఏడాది నుంచి 11 పేపర్లను ఆరుకు ప్రభుత్వం తగ్గించింది. కొత్త పేపర్లలో క్వశ్చన్లు ఎక్కువగా ఉన్నాయని వాటిని తగ్గించి, చాయిస్ పెంచాలని టీచర్ల సంఘాల నుంచి సర్కారుకు విజ్ఞప్తులు అందాయి. దీంతో క్వశ్చన్ పేపర్ లో మార్పులు చేస్తూ బుధవారం రాత్రి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. తొమ్మిదో తరగతితో పాటు టెన్త్ స్టూడెంట్లకు ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది ఈ విధానం ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే దీంట్లో క్వశ్చన్లు తగ్గించిన అధికారులు.. చాయిస్ మాత్రం పెంచలేదు. దీంతో పెద్దగా ఉపయోగం లేదని టీచర్లు చెబుతున్నారు. దీనిపై పేరెంట్స్ కూడా ఆందోళన చెందుతున్నారు. మరోపక్క రోజువారీగా పరీక్ష నిర్వహించాలని, బయోలజీ, ఫిజిక్స్ పేపర్లను వేర్వేరు రోజుల్లో నిర్వహించాలన్న డిమాండ్లనూ సర్కారు పట్టించుకోలేదు.
ఇవీ మార్పులు..
గతంలో ఎస్సే క్వశ్చన్లలో ఒక్కో విభాగంలో రెండు ప్రశ్నలు ఇచ్చి వాటిలో ఒకటి రాయాలని అడిగారు. మొత్తం ఆరు విభాగాల నుంచి ఆరు ప్రశ్నలు రాయాల్సి ఉండేది. ఇప్పుడు ఆరు ప్రశ్నలు ఇస్తే.. నాలుగు రాయాల్సి ఉంటుంది. ఒక్కో క్వశ్చన్‌కు గతంలో ఐదు మార్కులు ఉండగా, ఇప్పుడు ఆరు మార్కులకు పెంచారు. ఇక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు, వెరీషాట్ ఆన్సర్ క్వశ్చన్లలో చాయిస్ పెంచలేదు. కానీ మూడు మార్కుల ప్రశ్నలను నాలుగు మార్కులుగా మార్చారు.

