- మహిళలకు 33% కోటా కేటాయింపు
- ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కారు
- హర్షం వ్యక్తం చేసిన డీజేఎఫ్టీ, హెచ్‌యూజే
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని జర్నలిస్టులందరికి అక్రెడిటేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. డెస్క్ జర్నలిస్టులకు మీడియా కార్డులు ఇవ్వాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకుంది. గత నెలలో అక్రెడిటేషన్లపై ఇచ్చిన 252 జీవోకు పలు సవరణలు చేస్తూ సోమవారం సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక జీవో నం:103ను జారీ చేశారు.
మీడియా అక్రెడిటేషన్ రూల్స్-2025లో కీలక సవరణలు చేశారు. మీడియా సంస్థల్లో పని చేసే డెస్క్ జర్నలిస్టుల్లో కచ్చితంగా 33 శాతం కోటా మహిళలకు కేటాయించాలని జీవోలో పేర్కొన్నారు. పెద్ద దినపత్రిక నుంచి స్టేట్ అక్రెడిటేషన్ కమిటీలో డెస్క్ జర్నలిస్టుల నుంచి ఒక ప్రతినిధి, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నుంచి ఒక ప్రతినిధి ఉంటారని జీవోలో ప్రభుత్వం పేర్కొన్నది.
క్షేత్రస్థాయిలో, స్పెషల్ బీట్లలో పనిచేసే వారికి న్యాయం చేసేలా అక్రెడిటేషన్ పరిధిని ప్రభుత్వం విస్తరించింది. 2.5 లక్షల పైన సర్క్యులేషన్ ఉన్న పెద్ద డైలీలకు.. 1.50 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న మండలాల్లో అదనంగా మరో అక్రెడిటేషన్ కార్డును మంజూరు చేయనుంది. అలాగే స్పెషల్ బీట్లను కవర్ చేసే సినిమా, స్పోర్ట్స్, కల్చర్ జర్నలిస్టులకూ ఇకపై అక్రెడిటేషన్లు అందనున్నాయి.
రాష్ట్ర స్థాయిలో 2.5 లక్షల పైన సర్క్యులేషన్ ఉన్న పేపర్లకు ఈ మూడు విభాగాలకు వేర్వేరుగా ఒక్కో కార్డును, మీడియం పేపర్లకు (75 వేల–2.5 లక్షలు) ఈ మూడింటిలో ఏదో ఒక దానికి ఒక కార్డును కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం సవరణ జీవో 103ను విడుదల చేయటంపై డెస్క్జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ (డీజేఎఫ్టీ) హర్షం వ్యక్తం చేసింది.
డెస్క్‌జర్నలిస్టుల వినతిపై సానుకూలంగా స్పందించి డెస్క్ జర్నలిస్టులకు కూడా మీడియా కార్డులకు బదులు అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చేందుకు అంగీకరించిన సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి డీజేఎఫ్టీ, అధ్యక్ష కార్యదర్శులు బాదిని ఉపేందర్, మస్తాన్ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ సవరణ జీవోను హెచ్‌యూజే (టీడబ్ల్యూ జేఎఫ్) స్వాగతించింది. అదేవిధంగా డెస్క్ జర్నలిస్టులకు న్యాయం చేసిన మంత్రి, కమిషనర్‌కు హెచ్ యూజే అధ్యక్ష, కార్యదర్శులు అరుణ్ కుమార్, జగదీశ్వర్, ట్రెజరర్ రాజశేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గండ్ర నవీన్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కమిషనర్ ప్రియాంకకు డీజేఎఫ్టీ, హెచ్‌యూజే ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.
