
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కాలేజీల షిఫ్టింగ్‌లో సర్కారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. నాన్ లోకల్ కాలేజీల షిఫ్టింగ్‌కు పర్మిషన్ లేదని బయటకు చెప్తూనే, పలుకుపడి ఉన్నోళ్లు సిఫార్సులు చేస్తే మాత్రం అనుమతిస్తున్నారు. కానీ, తరలింపు కోసం నిబంధనల ప్రకారం ఫీజు కట్టి అప్లై చేసుకున్న కాలేజీల దరఖాస్తులను పక్కన పడేశారు. దీనిపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో విద్యాశాఖ మంత్రి సిఫార్సు మేరకే నాన్‌లోకల్ షిఫ్టింగ్‌కు దరఖాస్తు చేసుకునేవారు. 2022–23 సంవత్సరంలో ఇంటర్మీడియట్లో నాన్‌లోకల్ షిఫ్టింగ్ కు అవకాశం లేదని ఇంటర్ బోర్డు అఫిలియేషన్ నోటిఫికేషన్లో పేర్కొంది. దీంతో చాలా కాలేజీలు దరఖాస్తు చేసుకోలేదు. కానీ, కొన్ని కార్పొరేట్, ప్రైవేటు కాలేజీలు మాత్రం మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పైరవీలు చేసి విద్యాశాఖ ద్వారా కాలేజీల షిఫ్టింగ్ చేయించుకుంటున్నాయి.
ఇందులో భాగంగా ఇటీవల దాదాపు 30 ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల షిఫ్టింగ్‌కు విద్యాశాఖ మంత్రి నుంచి సిఫార్సులు వచ్చినట్టు సమాచారం. వీటిలో సగం కాలేజీల తరలింపునకు ప్రతిపాదనలు పంపించాలని ఇంటర్ బోర్డుకు సర్కారు నుంచి ఆదేశాలు అందాయి. ఆ మేరకు బోర్డు అధికారులు లిస్టులను రెడీ చేశారు. దీంట్లో కొన్ని కాలేజీల తరలింపునకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ మంత్రి, నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో మంత్రి, పాతబస్తీకి చెందిన ఓ ఎమ్మెల్యే, నల్లొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సిఫార్సు చేస్తూ లెటర్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో వీటి షిఫ్టింగ్‌కు పర్మిషన్ కోసం మరోసారి ఇంటర్ బోర్డు అధికారికంగా సర్కారుకు లేఖ పంపించింది. త్వరలోనే వీటికి పర్మిషన్ వచ్చే అవకాశమున్నట్టు ఇంటర్ బోర్డు వర్గాలు చెప్తున్నాయి.
సిఫార్సులకే ప్రయారిటీ..
రోడ్డు వెడల్పులో కూలిన కాలేజీని వేరే చోటుకు తరలించేందుకు ససేమిరా అంటూ, గతేడాది లక్షల్లో ఫీజు కట్టి అప్లై చేసుకున్న కాలేజీల అప్లికేషన్లను పక్కనపెట్టి ప్రజాప్రతినిధులు సిఫార్సులకే మొగ్గుచూపడంపై విమర్శలు వస్తున్నాయి. 3 నెలల కింద కూడా ఇంటర్ బోర్డుతో సంబంధం లేకుండానే సంగారెడ్డి జిల్లా నుంచి మహబూబ్ నగర్‌కు కాలేజీలను మిక్స్ డ్ ఆక్యుపెన్సీ బిల్డింగ్‌లోకి మారుస్తూ ఏకంగా ప్రభుత్వమే జీవో ఇచ్చింది. దీనికి ఇంటర్ బోర్డు ఇంకా గుర్తింపు ఇవ్వలేదు.