దిక్కుతోచని స్థితిలో కళాకారులు

దిక్కుతోచని స్థితిలో కళాకారులు

సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు:వారంతా తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కళాకారులు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత కొలువులు ఇవ్వడంతో సంబరపడ్డారు. కానీ సర్కారు ఏడేండ్లుగా జీతం ఒక్క పైసా పెంచలేదు. ఇప్పుడు వారిని పొమ్మనలేక పొగ పెడుతోంది. వారంతట వారే ఉద్యోగాలు మానేసేలా ఆంక్షలు విధిస్తూ వేధిస్తోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం కళాకారులకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ సాంస్కృతిక సారథి  ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని 550 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చింది. సాంస్కృతిక సారథి షరతులను వ్యతిరేకిస్తూ మొదట్లోనే 50 మంది వరకు రిజైన్ చేశారు. ప్రస్తుతం 500 మంది వివిధ జిల్లాల్లో పని చేస్తున్నారు. వీరికి సర్కారు రూ. 24,500 వేతనం చెల్లిస్తోంది. ఏడేండ్లు గడుస్తున్నా వేతనం ఒక్క పైసా కూడా పెరగలేదు. మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న ధరల కారణంగా జీతం సరిపోక కళాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైనా కళాకారుడు చనిపోతే రాష్ట్రంవ్యాప్తంగా ఉన్న కళాకారులందరి వేతనాల్లో కొంత మొత్తాన్ని కట్ చేసి బాధిత కుటుంబానికి రూ. ఐదు లక్షలు ఇస్తున్నారు. కళాకారుడు మరణిస్తే నేరుగా ప్రభుత్వం సాయం చేయాల్సిందిపోయి అందరి జీతాల్లో కోత విధిస్తున్నారు. ఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతుండగా ప్రస్తుతం వీరికి కొత్త కష్టం వచ్చిపడింది. ఇప్పటివరకు సొంత జిల్లాలో ఉన్న కళాకారులను సర్కారు ఇతర జిల్లాలకు బదిలీ చేస్తోంది. తక్కువ జీతమైనా ఇన్నాళ్లు సొంత జిల్లా కావడంతో సర్దుకుపోయామని, ఇప్పుడు అదే జీతంతో వేరే జిల్లాలో ఎలా పని చేయగలమని కళాకారులు వాపోతున్నారు. పిల్లల చదువులు మధ్యలోనే వదిలేసి కుటుంబాన్ని ఇతర జిల్లాలకు తరలించడానికి వెనకడుగు వేస్తున్నారు.

అడ్డగోలు ఆంక్షలు

కళాకారులను ఇతర జిల్లాలకు బదిలీ చేసిన సర్కారు మరోవైపు వారిపై అడ్డగోలు ఆంక్షలు విధించింది. ఉద్యోగాన్ని ఎప్పుడైనా తీసివేసే అధికారం టీఎస్ఎస్(తెలంగాణ సాంస్కృతిక సారథి)కి ఉందని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొనడంతో కళాకారులు ఆందోళనకు గురవుతున్నారు. కనీసం మూడేళ్లు పని చేయకుంటే అప్పటివరకు పొందిన వేతనం సాంస్కృతిక సారథి సంస్థకు జమ చేయాలని కండీషన్ పెట్టారు. నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ పై అగ్రిమెంట్ రాసివ్వాలని షరతులు విధించారు. ప్రభుత్వ పథకాలపై గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో  తిరుగుతూ కళా ప్రదర్శనలు ఇస్తున్న కళాకారులు ప్రైవేటు కార్యక్రమాల్లో పాటలు పాడొద్దని, సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో కళా ప్రదర్శనలు చేయరాదని ఆంక్షలు పెట్టారు. 

సగం మందికి బదిలీ ఉత్తర్వులు

రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది కళాకారుల్లో దాదాపు సగం మందిని  ఇతర జిల్లాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో పది శాతం మంది ఇంకా జాయినింగ్ రిప్టోర్ట్ ఇవ్వలేదు. ఉత్తర్వులు తీసుకున్న వారంలోగా కలెక్టరేట్లలో ఉన్న డీపీఆర్వోలకు రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 18 మంది ఉండగా ఆరుగురిని ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. పెద్దపల్లి జిల్లాలో మొత్తం 17 మంది ఉండగా 11 మందిని, కరీంనగర్ నుంచి ఇద్దరిని పెద్దపల్లికి ట్రాన్స్​ఫర్ చేశారు. జగిత్యాల జిల్లాలో కేవలం ఏడుగురు పని చేస్తుండగా ఇప్పుడు కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి నుంచి మొత్తం 11 మందిని బదిలీపై పంపారు. ప్రస్తుతం జగిత్యాలలో 18 మంది ఉన్నారు. కరీంనగర్ లో 38 మంది కళాకారులు ఉండగా దాదాపు సగం మందిని ఇతర జిల్లాలకు పంపారు. కళాకారులను ఇతర జిల్లాలకు బదిలీ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. శాలరీలు మిగుల్చుకునేందుకే పొమ్మనలేక పొగ పెడుతున్నారని, తాత్కాలిక ఉత్తర్వుల పేరిట ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం దయ చూపాలే

రాష్ట్ర సాధనలో గజ్జె కట్టి గొంతెత్తాం. ఉద్యోగాలు కల్పించి మమ్మల్ని ఆదరించడం ఆనందంగా ఉంది. కానీ కళాకారుల బదిలీ విషయంలో ప్రభుత్వం దయ చూపాలే. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేస్తే ఫ్యామిలీతో సహా ఇతర జిల్లాలకు మారటం ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం మరోసారి ఆలోచించి సొంత జిల్లాలోనే పని చేసే అవకాశం కల్పించాలి.
- తేలు విజయ, సీనియర్ గాయకురాలు