ఇంటివద్దే డయాలసిస్

ఇంటివద్దే డయాలసిస్
  •  అంబులెన్స్‌‌‌‌లోనే మెషిన్ల సెటప్
  • నడవలేని వాళ్ల కోసం ఆరోగ్యశాఖ ప్రతిపాదన
  • కేంద్రం ఇచ్చే నిధులు వాడుకునే యోచన

హైదరాబాద్, వెలుగు: వివిధ రోగాలతో బాధపడుతూ ఇంటికే పరిమితమైన వ్యక్తుల కోసం పాలియేటివ్ కేర్ సేవలను మరింత విస్తృతం చేయాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. ఇందులో భాగంగా కిడ్నీ జబ్బుతో ఇబ్బంది పడుతూ, నడవలేని స్థితిలో ఉన్నోళ్లకు ఇంటివద్దే డయాలసిస్ సేవలను అందించాలని యోచిస్తోంది. అంబులెన్స్‌‌‌‌లో డయాలసిస్‌‌‌‌ మెషిన్లను అమర్చి పేషెంట్ల ఇంటి వద్దకే వెళ్లి డయాలసిస్ చేయించేందుకు అయ్యే ఖర్చు, ఇతర వివరాలతో హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మొదటి దశలో పది అంబులెన్స్‌‌‌‌లతో సేవలను ప్రారంభించాలని నిర్ణయించారు. దీనికోసం పాలియేటివ్ కేర్ ప్రోగ్రామ్ కింద కేంద్రం ఇచ్చే నిధులను వాడుకోవాలని భావిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ర్టవ్యాప్తంగా సుమారు 12 వేల మంది డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు. ఏటా 2 వేల మంది మరణిస్తుండగా, అంతే మొత్తంలో కొత్తవాళ్లు యాడ్ అవుతున్నారు. డయాలసిస్ రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా చేయించుకోకపోవడం వల్లే ఎక్కువ మరణాలు నమోదవుతున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. కొంతమంది వారానికి 2 నుంచి 3 సార్లు కూడా డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వాళ్లు సెంటర్ల చుట్టూ తిరగలేక, డయాలసిస్‌‌‌‌ స్కిప్‌‌‌‌ చేస్తున్నారు. ఇంకొంత మంది ఇంటి దగ్గర్నుంచి సెంటర్ల వద్దకు రావడానికి కష్టమవడం, నడవలేని స్థితిలో ఉండడం, సెంటర్ల వద్ద ఎక్కువసేపు వెయిటింగ్‌‌‌‌లో ఉండలేకపోవడం వంటి సమస్యలతో డయాలసిస్‌‌‌‌ చేయించుకోవడం లేదు. ఇలాంటి వాళ్లు ఏయే జిల్లాల్లో ఎంత మంది ఉన్నారనే లెక్కలను ఆరోగ్యశాఖ సేకరించినట్టు సమాచారం. ప్రస్తుతం రాష్ర్టవ్యాప్తంగా 43 ప్రభుత్వ డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. వీటి సంఖ్యను పెంచాలని ఎమ్మెల్యేలంతా కోరుతున్నారు. గతేడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లోనే డయాలసిస్‌‌‌‌ రోగుల ఇబ్బందులను గుర్తు చేస్తూ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అసెంబ్లీలో కంటతడి పెట్టారు. అయినా ప్రభుత్వం ఇంతవరకూ ఒక్క సెంటర్‌‌‌‌‌‌‌‌ ను కూడా కొత్తగా ఏర్పాటు చేయలేదు. ఈ నేపథ్యంలో హోమ్ డయాలసిస్ సేవలు ప్రారంభించాలని నిర్ణయించారు.