
హైదరాబాద్, వెలుగు: అవిభక్త కవలలు వీణా వాణిలకు ఆపరేషన్ చేసి విడదీయడం సాధ్యం కాదని, అలా చేస్తే వాళ్ల ప్రాణాలకే ముప్పు అని రాష్ట్ర సర్కారు హైకోర్టుకు నివేదించింది. విదేశాల నుంచి కూడా డాక్టర్లను తీసుకువచ్చి మెడికల్ పరీక్షలు చేయించామని, ఆపరేషన్‌కు పరిస్థితులు సరిగా లేవని వారు చెప్పినట్లు తెలిపింది. అందుకే వీణా వాణిలను తల్లిదండ్రులకు అప్పగించినట్లు పేర్కొంది. తొమ్మిదేండ్లు వారు నీలోఫర్‌లో ఉన్నారని, టెన్త్ పాసయ్యారని, ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నారని ప్రభుత్వ లాయర్ ఎ.సంజీవ్‌కుమార్ హైకోర్టుకు వెల్లడించారు. ఈ వివరాలను చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిల డివిజన్ బెంచ్ శుక్రవారం రికార్డుల్లో నమోదు చేసింది. భవిష్యత్‌లో వారికి అవసరమైన వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. వీణా వాణిలకు ఆపరేషన్ చేయాలని, హైదరాబాద్ లేదా వరంగల్‌లో ఇల్లు ఇచ్చేలా ఆదేశాలివ్వాలని హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ 2016లో పిల్ వేసింది. పిటిషనర్ తరఫు లాయర్ వాదిస్తూ, వీణా, వాణిల కుటుంబానికి నెలకు రూ.15 వేల చొప్పున సాయం చేస్తామని, అందుకు అనుమతి ఇవ్వాలని కోరగా, హైకోర్టు ఓకే చెప్పింది.