నత్తనడకన సాగుతోన్న హెల్త్ సర్వే

నత్తనడకన సాగుతోన్న హెల్త్ సర్వే

ములుగు / సిరిసిల్ల, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హెల్త్​ ప్రొఫైల్​ సర్వే.. పైలట్​ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో మెల్లగా సాగుతోంది. ఈ నెల 5న సర్వే స్టార్ట్​ చేయగా, పూర్తిస్థాయిలో హెల్త్​ టీమ్స్​ రంగంలోకి దిగలేదు. ములుగు జిల్లాలో 153 టీంలకు కేవలం 30 మాత్రమే పనిచేస్తుండగా, సిరిసిల్లలో 230 టీంలకు 50 బృందాలే ఫీల్డ్​కు వెళ్తున్నాయి. ములుగులో123 , సిరిసిల్లలో 180 టీంలు ఇంకా డ్యూటీలో చేరలేదు. సర్వేలో పాల్గొంటున్న హెల్త్​స్టాఫ్​కు పూర్తిస్థాయిలో ట్రైనింగ్ ​ఇవ్వకపోవడం, మరికొన్ని టీం‌లకు సర్వే మెటీరియల్ సప్లై చేయకపోవడం వల్లే లేట్​అవుతోందని తెలుస్తోంది. మరోవైపు జీపీ, రెవెన్యూ సిబ్బంది నుంచి తమకు సహకారం అందకపోవడంతో ఇంటింటికీ వెళ్లి బ్లడ్‌‌ శాంపిల్స్‌‌ తీసుకోలేకపోతున్నామంటున్నారు. ఆశాల సాయంతో ప్రజలనే సబ్‌‌ సెంటర్ల దగ్గరికి పిలిపిస్తుండడంతో  ఆలస్యమవుతోందంటున్నారు. ములుగు జిల్లాలో 40 రోజుల్లో, సిరిసిల్ల జిల్లాలో 60 రోజుల్లో సర్వే కంప్లీట్​ చేస్తామని మంత్రులు హరీశ్​రావు, కేటీఆర్​ చెప్పినప్పటికీ, ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం ఈ రెండు జిల్లాల్లో పూర్తయ్యేందుకే 6 నెలల నుంచి ఏడాది పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక రాష్ట్ర ప్రజలందరి హెల్త్​ ప్రొఫైల్స్​ రెడీ చేయాలంటే ఏండ్లకు ఏండ్లే పట్టవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ములుగు జిల్లాలో 30 టీంలే.. 

ములుగు జిల్లాలో హెల్త్‌‌ ప్రొఫైల్​ కార్యక్రమాన్ని ఈ నెల 5న మినిస్టర్​ హరీశ్‌‌ రావు ప్రారంభించారు. జిల్లాలో18 ఏండ్లు నిండిన వాళ్లు 2.90 లక్షల మంది ఉన్నారని, 153 టీం‌లతో  కేవలం 40 రోజుల్లో సర్వే కంప్లీట్‌‌ చేసి హెల్త్‌‌ ప్రొఫైల్‌‌ కార్డులు అందజేస్తామని ప్రకటించారు. ఫీల్డ్ ​లెవెల్​లో పరిశీలిస్తే  జిల్లాలోని 15 పీహెచ్​సీల పరిధిలో కేవలం 30 టీంలు మాత్రమే బ్లడ్‌‌ శాంపిల్స్‌‌ తీసుకుంటున్నాయి. ప్రతీ పీహెచ్​సీ పరిధిలో కేవలం రెండు టీంలు మాత్రమే తిరుగుతున్నాయి. రోజుకు సగటున 607 మంది  బ్లడ్‌‌ శాంపిల్స్‌‌ తీసుకొని ఆన్‌‌లైన్‌‌లో ఎంటర్​చేస్తున్నాయి. గడిచిన ఆరు రోజుల్లో కేవలం 3,638 బ్లడ్ శాంపిల్స్ మాత్రమే సేకరించగలిగారంటే హెల్త్​ ప్రొఫైల్ ​సర్వే ఎలా నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 5వ తేదీ నుంచి 10 వరకు మొత్తం 932 ఇండ్లల్లో 18 ఏండ్లు నిండిన వారి బ్లడ్‌‌ శాంపిల్స్​ సేకరించినట్టు హెల్త్‌‌ ఆఫీసర్లు ప్రకటించారు. టీమ్స్​కు ట్రైనింగ్​ ఇవ్వకముందే హడావిడిగా సర్వే ప్రారంభించడం, మెటీరియల్‌‌ సప్లయ్‌‌ చేయకపోవడం వల్లే ఆలస్యమవుతోందంటున్నారు. గ్రామాల్లో సర్పంచ్‌‌లు, వార్డు మెంబర్లు, జీపీ ఆఫీసర్లు సహకరించి టేబుల్స్, ఇతర ఇన్ ఫ్రా స్ట్రక్చర్​ అందుబాటులోకి వస్తే స్పీడప్​ చేస్తామని చెబుతున్నారు. 

సిరిసిల్లలో నర్సింగ్​ కాలేజీ​ స్టూడెంట్ల సాయం?

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోనూ ఈ నెల 5న మంత్రి  కేటీఆర్​ హెల్త్​ ప్రొఫైల్​ సర్వే ప్రారంభించారు. 230 టీమ్స్​ను రంగంలోకి దించి 60 రోజుల్లో సర్వే పూర్తిచేస్తామని చెప్పినా ఇప్పటికీ 50 టీమ్స్​ మాత్రమే పనిచేస్తున్నాయి. ఒక్కో టీంలో ఒక ఏఎన్​ఎం, ఇద్దరు ఆశాలు ఉంటారు. సరిపడా స్టాఫ్​ లేకపోవడంతో సిరిసిల్ల నర్సింగ్ కాలేజీ స్టూడెంట్స్​ సాయం తీసుకోవాలని కలెక్టర్​ అనురాగ్​జయంతి భావిస్తున్నారు. జిల్లాలో 18 ఏండ్లు పైబడిన వారు 4.22 లక్షల మంది ఉండగా ఇప్పటివరకు 5వేల మంది బ్లడ్​ శాంపిల్స్​, వివరాలు తీసుకున్నారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, స్టాఫ్​ సహకారం లేకపోవడం, డోర్​లాక్​, కొందరు టెస్టులకు ఒప్పుకోకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయని హెల్త్​స్టాఫ్​ చెబుతున్నారు. ఈ లెక్కన  ఇప్పటికిప్పుడు 200 టీంలను రంగంలోకి దింపినా సర్వే పూర్తికావాలంటే ఏం తక్కువ ఆరు నెలలు పట్టే అవకాశముందంటున్నారు.  

ఇంటింటికీ కాదు.. సబ్‌‌ సెంటర్‌‌ దగ్గరికే..

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇల్లిల్లూ తిరిగి, ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారం సేకరించి ట్యాబ్​లో నమోదు చేయాలి. బ్లడ్​ శాంపిల్స్​ తీసుకొని టెస్టులు చేశాక హెల్త్​ ప్రొఫైల్ ​రూపొందించాలి. కానీ గ్రామ పంచాయతీ, రెవెన్యూ స్టాఫ్‌‌ తమకు ఏమాత్రం సహకరించడం లేదని హెల్త్​ స్టాఫ్​ చెబుతున్నారు. దీంతో సబ్‌‌ సెంటర్ వద్దకే ప్రజలను రప్పించి, వివ రాలు నమోదు చేసుకుని, బ్లడ్‌‌ శాంపిల్స్‌‌ తీసుకుంటున్నామంటున్నారు. శుక్రవారం ములుగు మండలం రాయినిగూడెం పీహెచ్​సీ పరిధిలో డాక్టర్ జ్యోత్స్నఆధ్వర్యంలో రెండు టీమ్స్​ ములుగులోని సఫాయి వాడలో సర్వే చేశారు. ఇల్లిల్లూ తిరిగే పరిస్థితి లేకపోవడంతో ఓ అంగన్​వాడీ సెంటర్​తో పాటు మరో చోట ఏర్పాట్లు చేసి, ఆశావర్కర్ల సాయంతో ప్రజలను అక్కడికే పిలిపించుకొని శాంపిల్స్​సేకరించారు. తర్వాత ఆయా వ్యక్తుల ఇండ్లకు వెళ్లి సర్వే పూర్తయినట్లు  స్టిక్కర్స్ అంటించి వచ్చారు.  

సర్వే జరుగుతోందిలా.. 

మొదట రిజిస్టర్​లో వ్యక్తి పేరు, ఆధార్ నంబర్​, అడ్రస్​, వయస్సు, బరువు, ఇతర అంశాలను ఎంటర్​ చేస్తున్నారు. బీపీ, వెయిట్, హైట్ చెక్ చేస్తున్నారు. తర్వాత వారికి కేటాయించిన క్యూఆర్ కోడ్ స్టిక్కర్ ను శాంపిల్స్ తీసుకునే బాటిల్స్​పై అంటించి మొబైల్ లో వివరాలు ఎంట్రీ చేస్తున్నారు. ఎవరి బ్లడ్ తీశారో వారి ఫొటో తీసి వెబ్​సైట్​లో అప్​లోడ్​ చేస్తున్నారు. ఒక టీం 10 నుంచి 12 ఇండ్లల్లోని వ్యక్తుల శాంపిల్స్​ తీయాలనే టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారు. ఉదయం 7గంటల నుంచి 11 గంటల వరకే వివరాలు, బ్లడ్ శాంపిల్స్​ సేకరణ పూర్తి చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల లోపు సేకరించిన శాంపిల్స్​ను ఎంపిక చేసిన ల్యాబ్‌‌లకు చేరుస్తున్నారు.  

14వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో .. 

పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన ములుగు జిల్లాలో హెల్త్ ప్రొఫైల్ సర్వే నడుస్తోంది. ప్రస్తుతం 30 టీంలు శాంపిల్స్ ​సేకరిస్తున్నాయి. 
ఈనెల 14 నుంచి మిగతా 123 టీంలు కూడా ఈ ప్రోగ్రామ్​లో పాల్గొనేలా చర్యలు తీసుకుంటాం. జీపీ ఆఫీసర్లు, వార్డు సభ్యులు సహకరించాలి. 40 రోజుల్లోగా సర్వే కంప్లీట్​చేయాలని టార్గెట్‌‌ పెట్టుకున్నాం.           

    – డాక్టర్ అల్లెం అప్పయ్య, డీఎంహెచ్వో, ములుగు