కోమటిరెడ్డి సోదరుల ఆగడాలు ఆపాలి.. దళిత, బహుజనుల జోలికొస్తే ఊరుకోం

కోమటిరెడ్డి సోదరుల ఆగడాలు ఆపాలి.. దళిత, బహుజనుల జోలికొస్తే ఊరుకోం
  • బహుజన సేన వ్యవస్థాపక అధ్యక్షుడు కదిరే కృష్ణ 

పంజాగుట్ట, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు రాజగోపాల్‌‌రెడ్డి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, వారి ఆగడాలు ఆపకపోతే దళిత, బహుజనుల పోరాటం తప్పదని బహుజన సేన వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్​ కదిరే కృష్ణ హెచ్చరించారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌‌క్లబ్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌‌ను అవమానిస్తున్నారని, ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీసీ, ఎస్సీ నాయకులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 

పార్టీ పదవుల పంపకంలో ఏకపక్ష ధోరణి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. గతంలో సర్పంచ్‌‌గా పోటీ చేసిన ఓ యాదవ యువకుడిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటనను గుర్తు చేశారు. దళిత, బహుజనులు అభివృద్ధి చెందడాన్ని కోమటిరెడ్డి సోదరులు జీర్ణించుకోలేక దాడులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. 

రిజర్వ్ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. వారి తీరుపై కాంగ్రెస్ హైకమాండ్​కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. దళిత, బహుజనుల జోలికి వస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో కైలాస్ నేత, వాసుకే యాదవ్, చల్లా రాములు ముదిరాజ్, శోభ తదితరులు పాల్గొన్నారు.