వరంగల్ జిల్లాలో ఒకరు, సిద్దిపేట జిల్లాలో మరొకరు సూసైడ్

వరంగల్ జిల్లాలో ఒకరు, సిద్దిపేట జిల్లాలో మరొకరు సూసైడ్

నెక్కొండ/తొగుట, వెలుగు: అప్పులబాధ తాళలేక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్​జిల్లాలో ఒక రు పురుగులమందు తాగి, సిద్దిపేట జిల్లాలో మరొకరు ఉరివేసుకుని చనిపోయారు. వరంగల్​జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురం పరిధిలోని గంగాదేవి తండాకు చెందిన జాటోతు లచ్చిరాం(45) .. అదే తండాకు చెందిన జాటోతు చక్రు వద్ద కొన్ని నెలల క్రితం పంటపెట్టుబడి కోసం రూ.3 లక్షలు అప్పు తీసుకున్నాడు. కొన్ని నెలలుగా చక్రు కుటుంబసభ్యులు లచ్చిరాంను డబ్బులివ్వాలని అడుగుతున్నారు. శనివారం సాయంత్రం చక్రు భార్య జామ్లా ఇంటికి వచ్చి తిట్టి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన లచ్చిరాం తన పొలంలోని బావి వద్ద పురుగుల మందు తాగి అత్మహత్య చేసుకున్నాడు. 

రాత్రయినా లచ్చిరాం ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు బావిద్దకు వెళ్లి చూసేసరికి చనిపోయి కనిపించాడు. లచ్చిరాం ఆత్మహత్యకు చక్రు కుటుంబసభ్యులే కారణమని వారి ఇంటిముందు డెడ్​బాడీతో ఆందోళన చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సర్దిచెప్పారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం ఎక్కల్ గ్రామానికి చెందిన తొర్రి యాదగిరి(38) కూడా అప్పుల బాధతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. యాదగిరి తనకున్న ఎకరన్నర భూమిలో వరి, మక్క వేశాడు. ఇటీవల కూతురి పెండ్లి కోసం కూడా అప్పు చేయాల్సి వచ్చింది. మొత్తం రూ.10 లక్షల వరకు అప్పు కావడంతో తీర్చలేనని ఆందోళన చెందాడు. శనివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకున్నాడు.