కాశ్మీర్ పండిట్స్ వేదనకు చిత్రరూపం

కాశ్మీర్ పండిట్స్ వేదనకు చిత్రరూపం

కాశ్మీర్ విషాదానికి లోతైన మూలాలు ఉన్నాయి. దశాబ్దాల తరబడి అంతులేని హింస, వేర్పాటువాదం,పాకిస్థాన్ నిధులతో కూడిన ఉగ్రవాద సంస్థల చొరబాటు, ప్రజల్లో చెలరేగుతున్న అసంతృప్తి మూలాల్ని వెలుగులోకి తీసుకురావడం కోసం పలు రచనలు, పాత్రికేయ కసరత్తులు,  అన్వేషణలు జరుగుతూ వస్తున్నాయి. 
అలాగే సినిమాలు కూడా. 2020లో విధు వినోద్ చోప్రా రూపొందించిన ‘షికారా’ చిత్రంలో కాశ్మీరీ పండిట్ల వలస గురించి చివరిసారిగా వెలుగులోకి వచ్చింది. వివేక్ రంజన్ అగ్నిహోత్రి తాజా చిత్రం ‘ద కాశ్మీర్ ఫైల్స్’ ఆ కథనాన్ని విస్తరించింది. ఆ విషాదకర సంఘటనను లోతుగా చూపించింది.1990వ దశకంలో కాశ్మీరీ పండిట్లు భారీ సంఖ్యలో కాశ్మీర్ లోయ నుండి వలస వచ్చి, నేటికీ స్వస్థలానికి వెళ్లలేక, శరణార్థులుగా నివసిస్తున్న హృదయ విదారక చరిత్రకు ఈ చిత్రం సాక్షిగా నిలిచింది. నిజం చెప్పాలంటే ఇది వలస వెళ్లడం కాదు.. జాతిహత్య. వేలాదిమంది కాశ్మీరీ హిందువుల్ని ఊచకోత కోశారు. మహిళలపై అత్యాచారం చేశారు. పిల్లలను సైతం కాల్చి చంపారు. ఇస్లామిస్టులు, పాకిస్థాన్ ప్రాయోజిత ఉగ్రవాదుల కారణంగా బలవంతంగా కాశ్మీర్ లోయను వదిలిపెట్టిన లక్షలాది మంది కాశ్మీరీ హిందువుల వ్యథకు చిత్ర రూపమిది. కాశ్మీర్‌లో గొప్ప కళ, సంస్కృతి, సంగీతం, ఆహారం ఉన్నాయి. కానీ ఇస్లాంవాదులు వాటిని పూర్తిగా నాశనం చేశారు.నాటి పరిస్థితులన్నింటినీ ఈ సినిమా కళ్లకు కట్టింది. పండిట్ పుష్కర్‌‌నాథ్ శ్రీనగర్‌‌ నుండి బహిష్కరణకు గురైన ఉపాధ్యాయుడు. ముప్ఫై సంవత్సరాల తరువాత అతని మనవడు కృష్ణ.. పుష్కర్‌‌నాథ్ చితాభస్మాన్ని తీసుకుని శ్రీనగర్‌కి తిరిగొస్తాడు. తన తాతకు అత్యంత సన్నిహిత మిత్రుల సాయంతో ఎన్నో బాధాపూరిమైన విషయాల గురించి,  తన తాత తనను రక్షించడానికి ప్రయత్నించిన భయంకరమైన పరిస్థితుల గురించి తెలుసుకుంటాడు. ఆ సన్నివేశాలు చాలా అద్భుతంగా తీశారు. కాశ్మీరీ పండిట్స్లో నెలకొన్న ఆగ్రహావేశాలు, ఆవేదనలకు కారణమైన పలు సంఘటనలను హృద్యంగా చిత్రీకరించారు. ఒక ఉగ్రవాది తన భర్త రక్తాన్ని తాగమని భార్యను బలవంతం చేయడం, ప్రాణాలతో ఉండగానే ఓ స్త్రీని సగానికి నరికివేయడం వంటి సంఘటనలు చూస్తే ఒళ్లు గగుర్పొడవడం ఖాయం.  ప్రతి భారతీయుడినీ కదిలించే ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయాలనుకున్నారు కానీ ఒమిక్రాన్ కారణంగా సాధ్యం కాలేదు. ఎట్టకేలకు మార్చ్ 11న రిలీజ్ చేశారు. తేజ్ నారాయణ్ అగర్వాల్, అభిషేక్ అగర్వాల్, పల్లవీ జోషి,  వివేక్ అగ్నిహోత్రి నిర్మించిన ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవీ జోషి తదితరులు నటించారు.