సుదీర్ఘ నిరీక్షణకు తెర.. ఎట్టకేలకు పంచాయతీరాజ్లో ప్రమోషన్లు

సుదీర్ఘ నిరీక్షణకు తెర.. ఎట్టకేలకు పంచాయతీరాజ్లో ప్రమోషన్లు
  • 27 మందికి జడ్పీ సీఈఓలుగా.. 
  • 55 మందికి డిప్యూటీ సీఈఓలుగా పదోన్నతులు

హైదరాబాద్, వెలుగు: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదోన్నతుల ప్రక్రియకు తెరపడింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ప్రమోషన్ల ఫైల్  కదలడంతో అధికారుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఏళ్ల తరబడి ఒకే హోదాలో పనిచేస్తున్న అధికారులకు పదోన్నతులు లభించాయి.

 ఇందులో భాగంగా డిప్యూటీ సీఈఓలుగా ఉన్న 27 మందికి సీఈఓలుగా, ఎంపీడీఓలుగా ఉన్న 55 మందికి డిప్యూటీ సీఈఓలుగా ప్రభుత్వం ప్రమోషన్లు కల్పించింది. కాగా, తమ చిరకాల కోరిక నెరవేరడంతో పదోన్నతులు పొందిన అధికారులంతా శుక్రవారం ప్రజా భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. 

మంత్రికి పూలబొకేలు ఇచ్చి శాలువాలతో సన్మానించారు. అనంతరం మంత్రికి స్వీట్లు తినిపించి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ప్రమోషన్ల ప్రక్రియను వేగవంతం చేసినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తమది పూర్తిగా ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వమన్నారు. 

కొత్త ఉద్యోగాల భర్తీ మాత్రమే కాకుండా, ఇప్పటికే విధుల్లో ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, వారికి దక్కాల్సిన పదోన్నతులు కల్పించడానికి  ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా, ఖాళీగా ఉన్న 28 ఎంపీడీఓ పోస్టుల నుంచి డిప్యూటీ సీఈఓలుగా, 15 మంది డిప్యూటీ సీఈఓల నుంచి సీఈఓలుగా పదోన్నతులు కల్పించేందుకు ప్రతిపాదనలు రెడీ చేస్తున్నామని మంత్రి హామీ ఇచ్చారు. 

ఎంపీడీఓల నుంచి అటెండర్ల వరకు  ఖాళీగా ఉన్న అన్ని పోస్టుల్లో  దశలవారీగా పదోన్నతులు కల్పిస్తామన్నారు.  మంత్రిని కలిసిన వారిలో టీజీఓ అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాస్ రావు, సీఈఓ, డిప్యూటీ సీఈఓ అసోసియేషన్  ఉపాధ్యక్షుడుకొంపల్లి నర్సింహులు, ఎంపీడీఓ అసోసియేషన్  ప్రతినిధులు, ఇతర సిబ్బంది ఉన్నారు.