గ్రేటర్​లో రాజీవ్ స్వగృహ ఇండ్లకు రేపు లాటరీ

గ్రేటర్​లో రాజీవ్ స్వగృహ ఇండ్లకు రేపు లాటరీ

హైదరాబాద్ , వెలుగు: రాజీవ్ స్వగృహ అపార్ట్ మెంట్ ఫ్లాట్లు, ఇండ్ల అమ్మకానికి సంబంధించి బుధవారం లాటరీ తీయనున్నారు. ఈ మేరకు హెచ్​ఎండీఏ, హౌసింగ్ అధికారులు ఏర్పాట్లు చేశారు. పూర్తి పారదర్శకంగా, కంప్యూటర్ ద్వారా ఫ్లాట్ల లాటరీ జరుగుతుందని అధికారులు చెప్తున్నారు. ఫ్లాట్స్ అలాట్ అయిన వారికి ఎస్ ఎంఎస్ వస్తుందని అంటున్నారు. బండ్లగూడ, పోచారంలో మొత్తం ట్రిపుల్ బెడ్రూం డీలక్స్, ట్రిపుల్ బెడ్రూం, డబుల్ బెడ్రూం, సింగిల్ బెడ్రూం ఫ్లాట్లకు సంబంధించి గత నెల 11న మొదటి దశలో 2,971 ఫ్లాట్లకు, గత నెల 25న రెండో దశలో 1,187 ఫ్లాట్లకు హెచ్​ఎండీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నెల 14న అప్లికేషన్​కు గడువు ముగియగా అధికారులు ఊహించని విధంగా 39,082  అప్లికేషన్లు వచ్చాయి.  

రూ.800 కోట్లు టార్గెట్ 

ఈ అపార్ట్​మెంట్​ ఫ్లాట్ల అమ్మకం ద్వారా రూ. 800 కోట్లు ఆదాయం వస్తుందని హౌసింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు. అప్లికేషన్ల ద్వారానే రూ.3 కోట్ల ఆదాయం వచ్చింది. ఒక్కో చదరపు అడుగుకు రూ.3,000, రూ.2,750 ధర ఖరారు చేశారు. బహిరంగ మార్కెట్​తో పోలిస్తే రాజీవ్ స్వగృహ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. సింగిల్ బెడ్రూం ఫ్లాట్​ రూ.18 లక్షలు, డబుల్ బెడ్రూం ఫ్లాట్​ రూ.35 లక్షలు, ట్రిపుల్ బెడ్రూం  ఫ్లాట్లు రూ.50 లక్షలలోపే వస్తుండటంతో కొనుగోలుదారుల నుంచి భారీ స్పందన వచ్చింది. తక్కువ ధరకు ఫ్లాట్లు అందుబాటులో ఉండటంతో ఫ్లాట్ తమకు వచ్చేలా చొరవ చూపాలని హౌసింగ్ అధికారులపై గత నెల రోజులుగా పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చినట్లు తెలుస్తున్నది. పబ్లిక్ నుంచే కాకుండా అధికారుల ఫ్రెండ్స్ , బంధువులు, మంత్రుల అనుచరులు, ఉద్యోగుల నుంచి ఒత్తిడి వచ్చినట్లు సమాచారం. 

2 నెలల్లోగా 80 శాతం చెల్లించాలె

ఇక ఫ్లాట్ అలాట్ అయిన వాళ్లు పేమెంట్ ఎలా చేయాలో అధికారులు నోటిఫికేషన్​లో స్పష్టంగా పేర్కొన్నారు. ఫ్లాట్ అలాట్ అయిన వ్యక్తి మొత్తం కాస్ట్ లో వారంలోగా 10 శాతం, రెండు నెలల్లోగా మిగతా 80 శాతం,  బ్యాలెన్స్ అమౌంట్ మూడు నెలల్లోగా చెల్లించాలని అధికారులు పేర్కొన్నారు. నెల రోజుల్లోగా ఫుల్ పేమెంట్ చేస్తే 2 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నారు. ఈ నెల 29న ఫ్లాట్ అలాట్ అయిన వాళ్లతో అధికారులు ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు.