- రాష్ట్రంలో 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు..
- నిజామాబాద్లో అత్యధికంగా 42.4, ఆదిలాబాద్‌లో 42.3 డిగ్రీలు నమోదు
- ఉక్కపోతతో అల్లాడుతున్న జనం.. ఈసారి వర్షాలు తక్కువే: ఐఎండీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 9 గంటలు దాటిందంటే.. అడుగు బయటపెట్టలేని పరిస్థితి ఉన్నది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) లెక్కల ప్రకారం.. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. దీనికి తోడు ఆదిలాబాద్ జిల్లాలో 42.3, మహబూబ్ నగర్ 41.0, ఖమ్మం 40.4 జిల్లాల్లోనూ ఎండలు తీవ్రంగా ఉన్నాయి.
రాబోయే మూడు రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా, పగలంతా ఎండలతో అల్లాడుతున్న జనం, రాత్రి ఉక్కపోతతో సతమతమవుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత ఉష్ణోగ్రతలు రాబోయే మూడు రోజుల్లో క్రమంగా మరో 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందంటూ ఐఎండీ బాంబు పేల్చింది. దీనివల్ల చాలా జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల మార్కు దాటే ప్రమాదం ఉంది. ఈశాన్య బిహార్ నుంచి జార్ఖండ్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కి.మీ ఎత్తులో గాలి విచ్చిత్తి ప్రభావంతో వచ్చే వారం రోజులు వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుందని ఐఎండీ వెల్లడించింది.
పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్..
రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో సోమవారం 41 డిగ్రీ లకుపైనే టెంపరేచర్లు నమోదయ్యాయి. నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, ఖమ్మం, మెదక్, ములుగు, నల్గొండ వంటి జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ గరిష్ట ఉష్ణోగ్రత 40.1 డిగ్రీలుగా నమోదైంది. మరోవైపు.. ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో ఐఎండీ పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది.
నేడు ఆదిలాబాద్, కుమ్రం భీమ్, నిర్మల్, మంచిర్యాల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సూర్యాపేట, నారాయణపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. బుధ, గురువారాల్లో దాదాపు ఉత్తర, దక్షిణ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత 41 నుంచి 44 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
బలపడనున్న ఎల్నినో
వర్షాకాలంలో వానలు తక్కువే పడుతాయని ఐఎండీ అంచనా వేసింది. సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. సోమవారం మాన్సూన్ ఎర్లీ రిపోర్టును ఐఎండీ విడుదల చేసింది. 92 శాతం మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
రాష్ట్రంలో ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల్, సిరిసిల్ల, మంచిర్యాల్, పెద్దపల్లి జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదయ్యే చాన్స్ ఉందని తెలిపింది. అదే సమయంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో సగటు కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. లానినా పరిస్థితులు బలహీన పడుతున్నాయని, వర్షాకాలం నాటికి ఎల్ నినో బలపడుతుందని ఐఎండీ పేర్కొంది.

