13 ఏండ్ల త‌ర్వాత ఈవెంట్స్ మ‌ధ్య‌లో మ‌న జాతీయ గీతం

13 ఏండ్ల త‌ర్వాత ఈవెంట్స్ మ‌ధ్య‌లో మ‌న జాతీయ గీతం

టోక్యో: ఒక యువ కెర‌టం.. యావ‌త్ భార‌తదేశాన్ని గ‌ర్వించేలా చేసింది. తిరుగులేని ఎన్నో రికార్డుల‌ను సాధించి పెట్టింది. ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ (ట్రాక్ అండ్ ఫీల్డ్) చరిత్ర‌లోనే భార‌త్ సాధించిన తొలి బంగారు ప‌త‌కం నీర‌జ్ చోప్రా తెచ్చిపెట్టిందే. శ‌నివారం జ‌రిగిన జావెలిన్ త్రో ఫైన‌ల్ మ్యాచ్‌లో టాప్‌లో నిలిచి గోల్డ్ మెడ‌ల్ సొంతం చేసుకున్న నీర‌జ్ 13 ఏండ్ల త‌ర్వాత మ‌న దేశానికి మ‌రో గౌర‌వాన్ని ద‌క్కేలా చేశాడు. ఏ దేశ‌మైనా ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడ‌ల్ సాధిస్తే.. గ్రౌండ్‌లో జ‌రుగుతున్న అన్ని ఈవెంట్ల‌ను నిలిపేసి ఆ దేశ జాతీయ గీతాన్ని ప్లే చేస్తారు. ఈ గౌర‌వం మ‌నకు ద‌క్కి 13 ఏండ్లు గ‌డిచింది. 2008లో బీజింగ్ ఒలింపిక్స్‌లో అభిన‌వ్ బింద్రా షూటింగ్ విభాగంలో బంగారు ప‌త‌కం గెల‌వ‌డంతో నాడు మ‌న జాతీయ గీతం జ‌న‌గ‌ణ‌మ‌న‌ను ఒలింపిక్ పోడియం ద‌గ్గ‌ర ప్లే చేశారు. మ‌ళ్లీ ఇన్నేళ్ల త‌ర్వాత టోక్యో ఒలింపిక్స్‌లో నీర‌జ్ గోల్డ్ గెల‌వ‌డంతో మ‌రోసారి మ‌న దేశానికి ఈ గౌర‌వం ద‌క్కింది.

కెరీర్‌లో ప‌డిన క‌ష్ట‌మంతా మ‌ర్చిపోయా

ఈ విష‌యంపై యువ అథ్లెట్ నీర‌జ్ చోప్రా ఓ జాతీయ మీడియా చానెల్‌తో మాట్లాడుతూ జాతీయ గీతం ప్లే అవుతున్న‌ప్పుడు తాను భావోద్వేగానికి గుర‌య్యాయ‌ని చెప్పాడు. గోల్డ్ మెడ‌ల్ అందుకుని టాప్ స్టాండ్‌పై తాను నిల్చుని ఉండ‌గా జ‌న‌గ‌ణ‌మ‌న వినిపిస్తుంటే త‌న జ‌ర్నీ అంతా కండ్ల ముందు మెదిలింద‌ని, కెరీర్‌లో ప‌డిన కష్ట‌మంతా ఆ క్ష‌ణంలో మ‌రిచిపోయాన‌ని అన్నాడు. కేవ‌లం క‌న్నీళ్లు మాత్ర‌మే రాలేదు కానీ, చాలా భావోద్వేగానికి లోన‌య్యాన‌ని, మ‌న‌సు ఉక్కిరిబిక్కిరి అయింద‌ని చెప్పాడు.