సింగూర్ ప్రాజెక్ట్​ను పర్యాటక కేంద్రంగా మారుస్తా : దామోదర రాజనర్సింహ

సింగూర్ ప్రాజెక్ట్​ను పర్యాటక కేంద్రంగా మారుస్తా : దామోదర రాజనర్సింహ

పుల్కల్, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లా అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన సింగూర్ ను  పర్యాటక కేంద్రంగా మారుస్తానని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ​ అన్నారు. శనివారం ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్ తో కలిసి ఉమ్మడి పుల్కల్ మండలంలోని బస్వాపూర్, సరాఫ్ పల్లి  శివార్లలో గల ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో కార్యకర్తల  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆందోల్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని ఇంకా చేయవలసి ఉందన్నారు.

సింగూర్ కాల్వలకు సీసీ లైనింగ్ ఏర్పాటు కోసం రూ.190 కోట్లు మంజూరు చేశామని త్వరలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. అందోల్ మండలం సంగుపేట సమీపంలో తెలంగాణలో ఎక్కడా లేని విధంగా 30 ఎకరాల్లో సైన్స్ సెంటర్, పక్కనే రూ.55 కోట్లతో నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేస్తామన్నారు. వట్ పల్లి మండల కేంద్రంలో రూ.12 కోట్లతో హాస్పిటల్​తెచ్చిన ఘనత తనదేనన్నారు. ఆందోల్ మండలంలోని అజ్జమర్రి గ్రామ శివారులో, పుల్కల్ మండల కేంద్రం శివారులో మంజీరా నదిపై బ్రిడ్జ్ నిర్మించి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో పుల్కల్, చౌటకూర్​ మండల కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గారెడ్డి, నత్తి  ధశరత్, ఉపాధ్యక్షుడు అంజయ్య, రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు. 


పుల్కల్: పుల్కల్ మండల పరిధిలోని పెద్దారెడ్డిపేట గ్రామంలో గల తుల్జాభవానీ ఆలయంలో శనివారం శివపార్వతుల కల్యాణం ఘనంగా జరిగింది. ఆలయ నిర్వహకురాలు నర్తమాంభ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవానికి మంత్రి దామోదర రాజనర్సింహ హాజరయ్యారు.  ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ మంత్రిని ఘనంగా సన్మానించారు.