స్పేస్ బిజినెస్​లో ఇండియా భేష్

స్పేస్ బిజినెస్​లో ఇండియా భేష్
  • ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక ప్రశంసలు  
  • స్టార్టప్​లకు నిలయం..  స్పేస్ టెక్నాలజీకి కేంద్రం 
  • చైనాకు దీటుగా ఇండియా నిలుస్తుందంటూ కథనం

న్యూయార్క్: అంతరిక్ష రంగంలో ఇండియా అద్భుతమైన విజయాలు సాధిస్తోందని, ప్రధానంగా స్పేస్ బిజినెస్ లో అనూహ్య వేగంతో అడుగులు వేస్తోందని అమెరికాకు చెందిన ప్రఖ్యాత ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక ప్రశంసించింది. కరోనా విపత్తు మొదలైన సమయంలో దేశంలో కేవలం ఐదు స్పేస్ టెక్ స్టార్టప్ లు మాత్రమే ఉన్నాయని.. కానీ మూడేండ్లలోనే వాటి సంఖ్య 140కు పెరగడం ఒక అద్భుతమని పేర్కొంది. ఇండియా ఇప్పుడు స్టార్టప్​లకు నిలయంగా.. స్పేస్ టెక్నాలజీకి కీలక కేంద్రంగా మారుతోందని ‘ప్రపంచ స్పేస్ బిజినెస్ లో ఆశ్చర్యకరమైన పోటీదారు’ అనే శీర్షికతో ఒక ఆర్టికల్​ను ప్రచురించింది. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఇరుదేశాల మధ్య అంతరిక్ష రంగంలో సహకారంపై అనేక ఒప్పందాలు జరగడాన్నీ ప్రస్తావించింది. అమెరికన్ కంపెనీల నుంచి మిలిటరీ గ్రేడ్ టెక్నాలజీని ఇండియన్ కంపెనీలకు ఇచ్చేందుకు బైడెన్ సర్కారు కూడా ఆమోదం తెలిపిందని పేర్కొంది. స్పేస్ టెక్ బిజినెస్​లో చైనాకు దీటుగా ఇండియా నిలుస్తుందని పేర్కొంది. 

అంతరిక్ష రంగంలో బలమైన శక్తి.. 

‘‘1963లో మొదటి రాకెట్​ను సైకిల్​పై ఉంచి తరలించి 199 కిలోమీటర్ల ఎత్తుకు చిన్న పేలోడ్​ను ఇండియా ప్రయోగించింది. స్పేస్ టెక్నాలజీలో అద్భుతాలు సాధించిన అమెరికా, సోవియట్ యూనియన్లను అనుసరిస్తూ వచ్చింది. ఇప్పుడు అంతరిక్ష రంగంలో బలమైన శక్తిగా అవతరించింది” అని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా స్పేస్ బిజినెస్ దెబ్బతిన్నదని, ఆ అవకాశాన్ని ఇండియా అందిపుచ్చుకున్నదని తెలిపింది. బ్రిటన్​కు చెందిన వన్ వెబ్ శాటిలైట్లను రష్యా ప్రయోగించాల్సి ఉండగా, ఆ కాంట్రాక్ట్ ఇస్రోకు దక్కిన విషయాన్ని ప్రస్తావించింది. అలాగే, హైదరాబాద్​కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్, ధ్రువ స్పేస్ అనే స్టార్టప్​లు శాటిలైట్ల తయారీ, ప్రయోగంలో అద్భుతమైన పనితీరును కనపరుస్తున్నాయని ప్రశంసించింది.