స్టార్టింగ్​లోనే ట్రాక్ తప్పిన ఇండియన్‌‌ రేసింగ్‌‌ లీగ్‌‌

స్టార్టింగ్​లోనే ట్రాక్ తప్పిన ఇండియన్‌‌ రేసింగ్‌‌ లీగ్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: భారీ అంచనాలతో వచ్చిన ఇండియన్‌‌ రేసింగ్‌‌ లీగ్‌‌ (ఐఆర్‌‌ఎల్‌‌) స్టార్టింగ్​లోనే ‘ట్రాక్’ తప్పింది. హైదరాబాద్‌‌ స్ట్రీట్ సర్క్యూట్‌‌పై తొలి రౌండ్‌‌ పోటీలను ఆర్గనైజర్స్‌‌ సక్సెస్‌‌ చేయలేకపోయారు. దేశంలోనే మొదటిదైన స్ట్రీట్‌‌ సర్క్యూట్‌‌పై ప్రధాన రేసుల్లో ఒక్కటి కూడా నిర్వహించలేకపోయారు. శనివారం ఆరు జట్లకు చెందిన రేసర్లంతా ప్రాక్టీస్‌‌తో సరిపెట్టగా.. ఆదివారం క్వాలిఫయింగ్‌‌, స్ర్పింట్​ రేసులు కూడా జరగలేదు.  కొత్త ట్రాక్‌‌పై డ్రైవర్లకు పట్టు దొరక్కపోవడం, ప్రాక్టీస్​ లో మూడు కార్లు ప్రమాదానికి గురయ్యాయి. ట్రాక్‌‌పై 14వ మలుపు వద్ద  చెన్నై టర్బో రైడర్స్, గోవా ఏసెస్‌‌  కార్లు ఢీకొన్నాయి. దాంతో, ఐఆర్‌‌ఎల్‌‌ ప్రధాన రేసులను రద్దు చేయడం మినహా ఆర్గనైజర్స్‌‌కు మరో మార్గం లేకుండా పోయింది. ఈ టర్నింగ్‌‌ వద్ద బ్రేకింగ్‌‌ సమస్య వచ్చిందని రేసర్లు శనివారమే ఫిర్యాదు చేశారు. ట్రాక్‌‌ చాలా కఠినంగా ఉందని, రేసు కష్టమని ముందే చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, రెండో రోజు పరిస్థితి మారుతుందని ఆశించినా ఫలితం లేకపోయింది. ప్రాక్టీస్‌‌ టైమ్‌‌లో పలు కార్లు స్కిడ్​ అవ్వడం కనిపించింది. ప్రమాదంలో ఓ రేసర్‌‌ గాయపడిన వెంటనే లీగ్‌‌ ఆర్గనైజర్‌‌.. రేసింగ్‌‌ ప్రమోషన్స్‌‌ లిమిటెడ్‌‌(ఆర్‌‌పీపీఎల్‌‌), ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ మోటార్‌‌ స్పోర్ట్స్‌‌ క్లబ్‌‌ ఆఫ్‌‌ ఇండియా (ఎఫ్‌‌ఎంఎస్‌‌సీఐ) టెక్నికల్‌‌ అధికారులు.. ఆరు ఫ్రాంచైజీలతో మాట్లాడి పోటీలు రద్దు చేశారు. ఐఆర్‌‌ ఎల్‌‌లో సెకండ్‌‌, థర్డ్‌‌ రౌండ్‌‌ పోటీలు చెన్నైలో జరగనున్నాయి. చివరి రౌండ్‌‌ వచ్చే నెల 10, 11వ తేదీల్లో తిరిగి హైదరాబాద్‌‌లోనే షెడ్యూల్‌‌ చేశారు. ఇక, ఫిబ్రవరి 11వ తేదీన ఇదే ట్రాక్‌‌పై ఫార్ములా–ఇ రేస్​ జరగనుంది.

నోరు మెదపని ఆర్గనైజర్స్‌‌

ఐఆర్‌‌ఎల్‌‌ రేసింగ్‌‌ విషయంలో ఆర్గనైజర్స్‌‌ తీరుపై విమర్శలు వస్తున్నాయి. పోటీలు, ట్రాక్‌‌ విషయంలో  ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఆదివారం కార్ల క్రాష్‌‌కు కారణం ఏమిటి?  ఏ కార్లకు యాక్సిడెంట్‌‌ అయింది?   ఎవరు గాయపడ్డారు?   అనే విషయాలతో పాటు ప్రధాన రౌండ్‌‌ పోటీలను ఎందుకు రద్దు చేశారో కూడా అధికారిక ప్రకటన చేయలేదు. ప్రమాదంలో చెన్నైకి చెందిన ఓ మహిళా రేసర్‌‌కు ఫ్రాక్చర్‌‌ అయిందని,  జూబ్లీ హిల్స్​లోని అపోలో హాస్పిటల్‌‌లో లో చేర్చినట్టు తెలుస్తోంది.

అలరించిన జేకే టైర్‌‌ నేషనల్‌‌ రేసింగ్‌‌

ఐఆర్‌‌ఎల్‌‌ పోటీలు రద్దయినప్పటికీ ఎన్నో ప్రయాసలు పడి ట్రాక్‌‌ వద్దకు వచ్చిన ఫ్యాన్స్‌‌ను జేకే టైర్‌‌ ఎఫ్‌‌ఎంఎస్‌‌సీఐ నేషనల్‌‌ రేసింగ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ మూడో రౌండ్‌‌ రేస్​ అలరించింది. ఈ రేసులో ఫార్ములా-–4 లెవెల్‌‌  కార్లు మెరుపు వేగంతో పరుగులు పెట్టాయి.  ఈ పోటీల్లోనూ ప్రమాదం జరిగినప్పటికీ డ్రైవర్లు భయపడకుండా సాయంత్రం వరకూ అన్ని రేసులు పూర్తి చేశారు.