
తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే ఉదయం నుండి తమతో సమావేశాలు నిర్వహించారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. 24 మంది సీనియర్ నాయకులు ఠాక్రేను కలిశారని, వారందరితోనూ ఆయన విడివిడిగా మాట్లాడారని చెప్పారు. సుదీర్ఘకాలం పని చేసిన అనుభవం ఠాక్రేకు ఉందన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పని చేయాలో చర్చించామని తెలిపారు. ‘హత్ సే హత్ జోడో’ పైనా చర్చించామని చెప్పారు. రెండు నెలల పాటు బ్లాక్ స్థాయి నుండి పాదయాత్రలు చేయాలని నిర్ణయించామన్నారు. రెండు నెలలపాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలందరూ యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రతి కాంగ్రెస్ నాయకుడు పాదయాత్రలో పాల్గొనాలన్నారు. పార్టీ నేతల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు తొలగిపోయాయని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అందరూ పని చేయాలని చెప్పారు. గురువారం (ఈనెల 12న) కూడా పార్టీ నేతలతో మాణిక్ రావ్ ఠాక్రే సమావేశాలు ఉంటాయన్నారు. ఎగ్జిక్యూటివ్ మీటింగ్, డీసీసీ, అనుబంధ సంఘాలు, అధికార ప్రతినిధులతోనూ ఠాక్రే భేటీ అవుతారని వెల్లడించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రపై చర్చ జరగలేదన్నారు.