హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్ అహంకారాన్ని దించుతారు

హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్ అహంకారాన్ని దించుతారు
  • హుజూరాబాద్ బీజేపీ ఎన్నికల ఇంచార్జ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి

వరంగల్ అర్బన్ జిల్లా: హుజురాబాద్ ఉప ఎన్నికలు  ప్రజల ఆత్మగౌరవానికి - కేసీఆర్ అహంకారానికి మధ్య పోరుగా మారుతుందని.. ప్రజలు కేసీఆర్ అహంకారాన్ని దించుతారని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కమలాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో భారతీయ జనతా పార్టీ మాజీ ఎం.పి.జితేందర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ మాటలన్నీ బూటకపు మాటలేనని విమర్వించారు. ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, నిరంతరం ఉద్యమం కోసం పోరాడినటువంటి ఉద్యమకారులందరినీ కేసీఆర్ తన స్వలాభం కోసం అనవసర కారణాలతో బయటకు పంపారని ఆరోపించారు. తాను కూడా అదేకోవకు చెందిన వాడినేనని ఆయన పేర్కొన్నారు. దాదాపు 20 మంది ఉద్యమ కారులను పార్టీ నుండి బయటకు పంపాడు కేసీఆర్ అని ఆయన ఆరోపించారు.

ఈటెల రాజేందర్ ఎక్కడ తన కొడుకు పదవికి అడ్డుగా ఉంటాడో అని బూటకపు భూకబ్జా ఆరోపణలు మోపి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడని విమర్శించారు. అసలు అసైన్డ్ భూములు ఎక్కడ కబ్జా జరిగిందో కేసీఆర్ చూపించాలని ఆయన ప్రశ్నించారు. ఎవరైనా బీద ప్రజలు గాని, ఒక మంత్రి గాని అప్లికేషన్ ఇస్తే కేసీఆర్ తీసుకుంటాడా..? కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు ఎవరికి అందుతున్నాయని ఆయన నిలదీశారు. ఎలక్షన్లు ఎక్కడుంటే సంక్షేమ పథకాలు అక్కడ అందుతాయని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం నాలుగు లక్షల 25 వేల కోట్లు రూపాయల  అప్పుల్లో ఉందని, కేవలం కాలేశ్వర్ ప్రాజెక్టు కోసమే  లక్ష కోట్లు ఖర్చు చేశారని.. ఆయన ఆరోపించారు. మూడు లక్షల 25 వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు అని చెప్పి ప్రజల మీద  అప్పుల భారం మోపి ప్రలోభాలకు గురి చేస్తూ మభ్యపెడుతున్నారని జితేందర్ రెడ్డి విమర్శించారు.