రైళ్లలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న యువకుడు అరెస్ట్

రైళ్లలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న యువకుడు అరెస్ట్
  •      వైజాగ్ నుంచి ముంబయికి తరలిస్తున్న యువకుడి అరెస్ట్
  •     20  కిలోల సరుకు స్వాధీనం 

సికింద్రాబాద్, వెలుగు : రైళ్లలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న యువకుడిని సికింద్రాబాద్ స్టేషన్​లో రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే ఇన్​స్పెక్టర్ శ్రీను తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయికి చెందిన ట్రింబక్ ఉబాలే(29) ఫుడ్ డెలివరీ బాయ్​గా పనిచేస్తున్నాడు. జీతం సరిపోకపోవడంతో గంజాయి సప్లయ్ మొదలుపెట్టాడు. వైజాగ్​లో తక్కువ రేటుకు గంజాయిని కొని రైలులో సికింద్రాబాద్ మీదుగా ముంబయికి తరలించి అక్కడ ఎక్కువ రేటుకు అమ్మేవాడు.  ఈ నెల 10న వైజాగ్ లోని ఏజెన్సీ ఏరియాకు వెళ్లి అక్కడ 20 కిలోల గంజాయిని కొన్నాడు. వాటిని 10 ప్యాకెట్లుగా చేసి బ్యాగ్​లో పెట్టుకున్నాడు. వైజాగ్ రైల్వే స్టేషన్​లో ముంబయికి వెళ్లే ఎల్టీటీ ఎక్స్​ప్రెస్ ఎక్కాడు.

మరుసటి రోజు మధ్యాహ్నం రైలు సికింద్రాబాద్ స్టేషన్​కు చేరుకుంది. గంజాయి సప్లయ్ గురించి సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు పదో ప్లాట్​ఫాంలో ఉన్న ఎల్టీటీ ఎక్స్ ప్రెస్ లో తనిఖీలు చేపట్టారు. కోచ్ నం.2లో ఉన్న ట్రింబక్ ఉబాలే బ్యాగ్​ను తనిఖీ చేసి గంజాయిని గుర్తించారు. మొత్తం 10 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని రైల్వే పోలీసులు తెలిపారు. ట్రింబక్​ను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించామన్నారు.

శేరిగూడలో మరొకరు..

 ఇబ్రహీంపట్నం :  ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడ గ్రామంలో గంజాయి అమ్ముతున్న బిహార్​కు చెందిన పంకజ్ కుమార్​ను ఎల్ బీనగర్ ఎస్ వోటీ, ఇబ్రహీంపట్నం పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి 500 గ్రాముల గంజాయిని   స్వాధీనం చేసుకున్నారు.