V6 News

మా రహస్య ఆయుధంతో అమెరికాకు గుండెపోటు ఖాయం.. ఇరాన్ వార్నింగ్

మా రహస్య ఆయుధంతో అమెరికాకు గుండెపోటు ఖాయం.. ఇరాన్ వార్నింగ్

పశ్చిమ ఆసియాలో యుద్ధ  వాతావరణం మరింత వేడెక్కుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ బలగాలపై ఒక రహస్య ఆయుధాన్ని ప్రయోగిస్తామంటూ ఇరాన్ సంచలన హెచ్చరిక చేసింది. ఆ ఆయుధం పేరు వింటేనే శత్రువులు వణికిపోతారని.. అది వారికి గుండెపోటు తెప్పించడం ఖాయమని ఇరాన్ నావికాదళం హెచ్చరించింది.

హర్ముజ్ జలసంధి వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఈ ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది. అమెరికా విధిస్తున్న ఆర్థిక దిగ్బంధనాన్ని ఎత్తివేస్తేనే  హర్ముజ్ జలసంధిని తెరుస్తామన్న ఇరాన్ ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జలసంధి సమీపంలో అమెరికా నావికా దిగ్బంధనాన్ని కొనసాగించాలని ట్రంప్ నిర్ణయించడంతో ఇరాన్ విరుచుకుపడుతోంది.

ఇరాన్ నావికాదళ కమాండర్ రియర్ అడ్మిరల్ షహ్రామ్ ఇరానీ శత్రువులకు నేరుగా సవాల్ విసిరారు. శత్రువులు తీవ్రంగా భయపడే ఆ ఆయుధం వారి పక్కనే ఉంది.. దానిని ప్రయోగించినప్పుడు వారికి గుండెపోటు రాదని ఆశిస్తున్నాను అంటూ  సెటైర్ వేశారు. 

 అమెరికా విమాన వాహక నౌక  అబ్రహం లింకన్'పై ఇరాన్ దళాలు కనీసం ఏడు క్షిపణి దాడులు నిర్వహించాయని ఆయన  తెలిపారు. ఈ దాడుల వల్ల ఆ నౌక నుంచి విమానాలను ప్రయోగించడం కూడా అమెరికాకు సాధ్యపడలేదని, ప్రస్తుతం అమెరికా వ్యూహాలు సైనిక అకాడమీల్లో హాస్యాస్పదంగా మారాయని ఆయన విమర్శించారు.

అమెరికా దురాక్రమణకు త్వరలోనే తగిన బుద్ధి చెబుతామని ఇరాన్ హెచ్చరిస్తున్న నేపథ్యంలో..  అమెరికా ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.