త్వరలో డిగ్రీ పరీక్షల్లో మార్పులు

త్వరలో డిగ్రీ పరీక్షల్లో మార్పులు

హైదరాబాద్, వెలుగు: ఉన్నత విద్య పరీక్షా విధానంలో గుణాత్మక మార్పులు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పరీక్షా విధానం, ఎవాల్యువేషన్​లో క్షేత్రస్థాయి పరిశీలనకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్​బీ)తో ఉన్నత విద్యా మండలి, కళాశాల విద్యాశాఖ అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. శుక్రవారం ఐఎస్ బీలో జరిగిన కార్యక్రమంలో కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఐఎస్​బీ డీన్ మదన్ వెల్లుట్ల ఎంఓయూపై సంతకాలు చేశారు. ఇప్పుడున్న పరీక్షల విధానంలో తీసుకురావాల్సి మార్పులపై వెయ్యి డిగ్రీ కాలేజీల్లో ఐఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ అధ్యయనం చేసి, ఆరు నెలల్లో నివేదిక ఇవ్వనుంది. విద్యార్థి నైపుణ్యాన్ని అంచనా వేయడానికి అవసరమైన పరీక్షలు ఎలా ఉండాలనేది క్షేత్రస్థాయి అధ్యయనం ద్వారా నిర్ణయించనున్నారు. సెమిస్టర్ పరీక్షలు, ఇంటర్నల్ ఎగ్జామ్స్ సహా కాలేజీ విద్యలో జరిగే పరీక్షల విధానాలను పరిశీలించి, సరికొత్త  ఫ్రేమ్ వర్క్​తో కొన్ని సిఫారసులు చేయాలని ఒప్పందంలో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి మాట్లాడుతూ.. విద్యార్థి నైపుణ్యాన్ని పరీక్షించేందుకు నిర్వహించే పరీక్ష విధానం భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అతనికి గుర్తింపు నిచ్చేదిగా,ఉపాధికి బాటలు వేసే విధంగా ఉండాలన్నదే ఈ ఎంఓయూ లక్ష్యమని అన్నారు. విద్యార్థుల్లో లోతైన ఆలోచన విధానాన్ని, సమస్యలు పరిష్కరించే సామర్థాన్ని అంచనా వేయాలని భావిస్తున్నామని, ప్రస్తుతం ఉన్న పరీక్ష విధానంలో వారి జ్ఞాపకశక్తిని మాత్రమే అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఐఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ దీనిపై సమగ్రంగా అధ్యయనం చేసి, సరైన మూల్యాంకన విధానం, బోధన ప్రణాళిక తీరు, టీచింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెథడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తీసుకురావాల్సిన మార్పులను సూచిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.