పాలమూరు మెడికల్ ​కాలేజీలో ఫ్యాకల్టీ లేరు!

పాలమూరు మెడికల్ ​కాలేజీలో ఫ్యాకల్టీ లేరు!

242 డాక్టర్​ పోస్టుల్లో 30 శాతమే రెగ్యులర్​ స్టాఫ్​

మహబూబ్​నగర్, వెలుగు : ప్రత్యేక రాష్ట్రంలో మొట్టమొదట ఏర్పడిన మహబూబ్​నగర్​ గవర్నమెంట్​ మెడికల్​ కాలేజీని కాంట్రాక్ట్​ ఎంప్లాయీస్​తో రాష్ట్ర ప్రభుత్వం నెట్టుకొస్తోంది. శాంక్షన్​ఉన్న పోస్టుల్లో కేవలం 30 శాతం మాత్రమే రెగ్యులర్​ స్టాఫ్​ఉన్నారు. ఐదేండ్లుగా కొత్త రిక్రూట్​మెంట్లు చేపట్టడం లేదు. మహబూబ్​నగర్​గవర్నమెంట్​మెడికల్​ కాలేజీకి 2017లో 242 డాక్టర్​ పోస్టులు, 739 అడ్మినిస్ట్రేటివ్, నర్సింగ్ పోస్టులు శాంక్షన్​ చేశారు. 242 డాక్టర్​పోస్టుల్లో 22 మంది ప్రొఫెసర్లు ఉండాల్సి ఉండగా 16 మంది మాత్రమే ఉన్నారు. అప్తమాలజీలో ఒకరు కాంట్రాక్ట్​ కింద వర్క్​ చేస్తుండగా, ఈఎన్​టీ, హాస్పిటల్ ​అడ్మినిస్ట్రేషన్, ట్రాన్స్​ఫ్యూజన్, ఎమర్జెన్సీ ప్రొఫెసర్ ​పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసోసియేట్​ ప్రొఫెసర్లు 37 మందికి 15 మందే రెగ్యులర్​ ​ఉన్నారు. రేడియాలజీ, డెంటల్​విభాగంలో అసోసియేట్​ ప్రొఫెసర్​పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగతా పోస్టుల్లో కాంట్రాక్ట్​ ఎంప్లాయీస్​ వర్క్​ చేస్తున్నారు. అసిస్టెంట్​ప్రొఫెసర్​పోస్టులు 60 ఉండగా 18 మంది రెగ్యులర్​ కాగా, మిగతా పోస్టుల్లో కాంట్రాక్ట్ ​ఎంప్లాయీస్​ ఉన్నారు. ట్యూటర్లు 51 మందికి 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జూనియర్​ రెసిడెంట్​లో 55 మందికి 40 ఖాళీలు ఉన్నాయి. సివిల్​ అసిస్టెంట్ సర్జన్​ పోస్టులు ఆరు, మెడికల్​ ఆఫీసర్​పోస్టులు ఆరు మొత్తానికి ఖాళీగా ఉన్నాయి. కానీ, మహబూబ్​నగర్​తో పాటు ఏర్పాటైన నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట మెడికల్​ కాలేజీల్లో మాత్రం కేడర్​స్ట్రేంత్​కు అనుగుణంగా 90 శాతం పోస్టులను భర్తీ చేశారు. 

కొత్త కాలేజీలకు వెయ్యి పోస్టులు
భదాద్రి కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, జగిత్యాల, రామగుండం, సంగారెడ్డి, వనపర్తి, నాగర్​కర్నూల్​ జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త మెడికల్​కాలేజీలను మంజూరు చేసింది. ఒక్కో కాలేజీకి వెయ్యి పోస్టులను శాంక్షన్​ చేసింది. సివిల్​సర్జన్, డిప్యూటీ సివిల్​సర్జన్, సీఏఎస్​ పోస్టులను ఒక్కో కాలేజీకి పది చొప్పున శాంక్షన్​చేసింది. ఐదేళ్ల కింద ప్రారంభమైన పాలమూరు మెడికల్​ కాలేజీకి ఈ పోస్టులను ఇంతవరకు మంజూరే చేయలేదు. దీంతో కాలేజీలో పరిపాలనకు సంబంధించి సర్టిఫికెట్లు ఇష్యూ చేయడం, హాస్పిటల్​లోని అన్ని డిపార్ట్​మెంట్లు చూసుకోవడం, హాస్పిటల్​ఇండెంట్ ​చెక్​ చేయడం వంటివి ఎవరూ చేయడం లేదు. ప్రస్తుతం గవర్నమెంట్ ​మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్​ కింద వర్క్​ చేస్తున్న సీనియర్, జూనియర్​ రెసిడెంట్లు, అసిస్టెంట్​ ప్రొఫెసర్లు ప్రతి ఏడాది మారుతున్నారు. ఇతర అవకాశాలు వస్తుండటంతో ఈ ఉద్యోగాలను వదిలేస్తున్నారు. తిరిగి వీరి స్థానంలో కొత్తగా కాంట్రాక్ట్​ ఎంప్లాయీస్​ను నియమించడానికి ఆఫీసర్లు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు వస్తున్నా ఐదారు నెలలకే హైదరాబాద్​కు దగ్గరగా ఉన్న మెడికల్​ కాలేజీల్లో చేరుతున్నారు.

ఫ్యాకల్టీ ఉంటేనే డెవలప్​మెంట్​

మహబూబ్​నగర్​మెడికల్​ కాలేజీలో సేవలను పెంచాలి. ఇందుకు కొత్త మెడికల్ ​కాలేజీలకు ఇచ్చినట్లుగా పాత మెడికల్ ​కాలేజీలకు పోస్టులు మంజూరు చేయాలి. రెగ్యులర్​ బేసిస్​​ కింద అసిస్టెంట్​ ప్రొఫెసర్లను భర్తీ చేయాలి. పూర్తి స్థాయి ఫ్యాకల్టీని నియమించి పీజీ కోర్సులు వచ్చేలా చూడాలి.
- కె. కిరణ్​ప్రకాశ్, అసోసియేట్​ప్రొఫెసర్, జనరల్​సెక్రటరీ, టీటీజీడీఏ

పీజీలు కూడా వస్తలే..
కాలేజీలో 21 డిపార్ట్​మెంట్లు ఉండగా ఎనిమిది విభాగాల్లోనే పీజీ కోర్సులున్నాయి. పీజీల కోసం జాతీయ మెడికల్​కమిషన్​కు ఎమర్జెన్సీ మెడిసిన్​ డిపార్ట్​మెంట్, అందులో క్యాజువాలిటి బెడ్లు 30, మెడికల్​ ఆఫీసర్లు 10 మందిని చూపించాలి. కానీ పాలమూరు మెడికిల్​ కాలేజీలో ఇవేవీ లేవు. మెడికల్​ఆఫీసర్​ పోస్టులు ఆరు శాంక్షన్​ఉన్నా ఒక్కరినీ నియమించలేదు. కేడర్ ​స్ట్రెంత్​లేకపోవడంతో పీజీ కోర్సులు ఇవ్వడం లేదు. ప్రస్తుతం గవర్నమెంట్​ మెడికల్​కాలేజీలోని ప్రీ ప్యారా క్లినికల్​లో ఎనిమిది డిపార్ట్​మెంట్లు ఉండగా, ఏడింటిలో పీజీ కోర్సులు ఉన్నాయి. ఎస్​పీఎం డిపార్ట్​మెంట్​కు సంబంధించి ఇటీవల ఇన్​స్పెక్షన్​ పూర్తయింది. రిజల్ట్​ రావాల్సి ఉంది.  గవర్నమెంట్​ హాస్పిటల్​ కింద ఉన్న క్లినికల్​లో 13 విభాగాలు ఉండగా, అందులో గైనకాలజీ విభాగానికి మాత్రమే ఇటీవల మూడు పీజీ కోర్సులు వచ్చాయి.