ఆర్టికల్ 370 రద్దును సుప్రీంకోర్టులో సవాలు చేయడం తప్పే: సాజద్ ​లోన్

ఆర్టికల్ 370 రద్దును సుప్రీంకోర్టులో సవాలు చేయడం తప్పే: సాజద్ ​లోన్

శ్రీనగర్: ఆర్టికల్  370 రద్దును ప్రతిపక్షాలు సుప్రీంకోర్టులో సవాలు చేయడం తప్పే అని, అలా చేసుండకపోయినా కాశ్మీర్​లో ప్రధాన రాజకీయ పార్టీల పరిస్థితి అధ్వానంగా ఉండేదని పీపుల్స్  కాన్ఫరెన్స్  చీఫ్  సాజద్ ​లోన్  అభిప్రాయపడ్డారు. శనివారం ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దుకు కాశ్మీర్​లో ప్రధాన రాజకీయ పార్టీలు దూరంగా ఉండుంటే, ఆ అంశాన్ని కోర్టులో సవాలు చేసేందుకు ఎవరికైనా కేంద్ర ప్రభుత్వం సహకరించి ఉండేదని ఆయన చెప్పారు. ‘‘ఆ రోజు (2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దుచేయడం) జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈరోజు ఆ అంశం ప్రాధాన్యాన్ని సంతరించుకొంది. 

ఆ విషయం నాకు తెలుసు. జమ్మూకాశ్మీర్  ప్రజల గొంతు పార్లమెంటులో వినపడాలన్నదే నా అభిమతం. ఎందుకంటే 2019 తర్వాత జరిగిన పరిణామాలను గమనిస్తే కాశ్మీర్ ప్రజల తరపున పార్లమెంటులో మాట్లాడడం ఎంత ప్రధానమో తెలుస్తుంది. ఈ లోక్ సభ ఎన్నికల్లో నేను గెలిస్తే, కచ్చితంగా కాశ్మీరీల గొంతును లోక్ సభలో వినిపిస్తా” అని సాజద్  పేర్కొన్నారు. కాగా, ఈ లోక్ సభ ఎన్నికల్లో బారాముల్లా నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. అదే సీటులో కాశ్మీర్  మాజీ సీఎం, నేషనల్  కాన్ఫరెన్స్  (ఎన్ సీ) లీడర్  ఒమర్  అబ్దుల్లా పోటీచేస్తున్నారు.

370ని మళ్లీ తెస్తామంటూ ఎన్​సీ అబద్ధాలు..

కాశ్మీర్​లో తమను గెలిపిస్తే, కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిన ఆర్టికల్ 370ని మళ్లీ తెస్తామని ఎన్ సీ లీడర్లు అబద్ధాలు చెబుతూ ప్రజలను మూర్ఖులను చేసే ప్రయత్నం చేస్తున్నారని సాజద్ లోన్  విమర్శించారు. 370ని ఎలా తెస్తారో వారు చెప్పడంలేదని ఆయన మండిపడ్డారు. ‘‘కాశ్మీర్​లో మూడు సీట్లు ఉన్నాయి. ఆ మూడింట్లో  గెలిచినా ఆర్టికల్ 370ని మళ్లీ ఎలా తేగలరు? లోక్ సభలో పెద్ద మార్పులు చేయాలంటే ఒక పార్టీకి మూడింట రెండొంతుల మెజారిటీ కావాలి. ఇండియా కూటమిలో ఎన్​సీ భాగంగా ఉంది. లోక్ సభలో మూడింట రెండు వంతుల మెజారిటీ వస్తే ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని కూటమి నేతలతో ప్రకటన ఇప్పిస్తే తాను ఎన్నికల బరి నుంచి తప్పుకుంటా” అని సాజద్ చెప్పారు.