
హైదరాబాద్, వెలుగు: తాను లంచం తీసుకోలేదని రూ.20 వేలు చేబదులు తీసుకుంటుంటే పోలీసులు పట్టుకుని అక్రమంగా కేసు పెట్టారంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మాజీ ఏఈ వాదనను హైకోర్టు కొట్టివేసింది. ఏసీబీ కోర్టు ఏడాది శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఈ కేసులో పిటిషనర్ జైలులో గడిపిన కాలాన్ని మినహాయించాలని పోలీసులను ఆదేశించింది. రోడ్డు కాంట్రాక్ట్ బిల్లు చెల్లింపులకు ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం ఆర్‌అండ్‌బీలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సోమ రాఘవేందర్, కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్ 7, సెక్షన్ 13(1)(డీ) ఆర్/డబ్యూ 13(2) ప్రకారం నేరం రుజువైనట్లు పేర్కొన్న ఏసీబీ కోర్టు.. రాఘవేందర్‌కు ఏడాది జైలు శిక్ష విధించింది. 2005 నాటి కేసులో 2009లో వెలువడిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది.