హాస్టళ్లు, గురుకులాల్లో మెస్​ చార్జీలు పెంచని సర్కార్​

హాస్టళ్లు, గురుకులాల్లో  మెస్​ చార్జీలు పెంచని సర్కార్​
  • హాస్టళ్లు, గురుకులాల్లో ఏడేండ్లుగా మెస్​ చార్జీలు పెంచని సర్కార్​
  • నాసిరకం సరుకులతో సరిపెడుతున్న కాంట్రాక్టర్లు 
  • ఈ ఏడాది 700 మందికిపైగా ఫుడ్​పాయిజన్
  • ముక్కిపోయిన, పురుగుల బియ్యం
  • అగ్గువకు దొరికే కూరగాయలతో వంటలు
  • వారంలో 2 సార్లే గుడ్డు.. 
  • నామ్కేవాస్తేగా నాన్​వెజ్​
  • చాలాచోట్ల వంటవాళ్లు, హెల్పర్లకు నాలుగు నెలలుగా జీతాల్లేవ్​
  • హాస్టళ్లలో ఎటుచూసినా అపరిశుభ్రవాతావరణం

నెట్​వర్క్​, వెలుగు: .హాస్టళ్లు, గురుకులాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం సరైన భోజనం అందించడం లేదు అక్కడి పరిస్థితులను పట్టించుకోవడం లేదు. ఏడేండ్లుగా మెస్​ చార్జీలు పెంచడం లేదు. రూ. 30 పెడ్తే బయట ప్లేట్​ఇడ్లీ కూడా రావట్లేదు. కానీ సర్కారు మాత్రం ఆ ముప్పై రూపాయల్లోనే ఒక్కో స్టూడెంట్​కు రోజుకు మూడుపూటలా క్వాలిటీ ఫుడ్​ పెట్టాలంటున్నది. ఆ రేట్లు గిట్టుబాటుకాక, బిల్లులు కూడా సకాలంలో అందక కాంట్రాక్టర్లు అగ్గువకు దొరికే సరుకులు, కూరగాయలు సప్లయ్​ చేస్తున్నారు. ఇది చాలదన్నట్లు సివిల్​ సప్లయ్​ ద్వారా ముక్కిన, పురుగులు పట్టిన బియ్యమే వస్తున్నాయి. ఎక్కడ చూసినా సరిపడా హెల్పర్స్​ లేకపోవడంతో బియ్యం, కూరగాయలను క్లీన్​చేసే పరిస్థితి ఉండటంలేదు.     

దీనికితోడు ఇటీవలి వానలకు నీరు నిలిచి హాస్టళ్ల పరిసరాలన్నీ అపరిశుభ్రంగా తయారయ్యాయి. భగీరథ నీళ్లు కూడా రంగుమారి, ఇటు తాగేందుకు, అటు వండేందుకు పనికిరావట్లేదు. సమస్యలపై వరుసగా స్టూడెంట్లు ఆందోళనలు చేస్తున్నా.. ఫుడ్​ పాయిజన్​తో ఆసుపత్రులపాలవుతున్నా.. ప్రభుత్వం కనీసం ఉన్నతస్థాయి సమీక్ష కూడా చేపట్టడం లేదు. మెస్​ చార్జీలను పెంచాలని, క్వాలిటీ, క్వాంటిటీ ఫుడ్​ అందించాలని స్టూడెంట్​ యూనియన్లు డిమాండ్​ చేస్తున్నాయి. 


రాష్ట్రవ్యాప్తంగా 326 గురుకులాలు, 400కు పైగా కేజీబీవీలు, 669 ఎస్సీ, 419 బీసీ ప్రీమెట్రిక్‌‌‌‌ హాస్టళ్లు, 204 ఎస్సీ, 278 బీసీ పోస్ట్‌‌‌‌ మెట్రిక్‌‌‌‌ హాస్టళ్లు, 136 ఎస్టీ హాస్టళ్లలో కలిపి సుమారు 3.6 లక్షలమంది స్టూడెంట్లు ఉన్నారు. వీళ్లకు ఉదయం బ్రేక్​ఫాస్ట్​, మధ్యాహ్నం లంచ్​, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నర్​ అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం సర్కారు 3 నుంచి 7వ తరగతి చదివే స్టూడెంట్లకు రూ. 950... 8, 9, 10 తరగతులకు రూ.1,100..  ఇంటర్​, డిగ్రీ విద్యార్థులకు  రూ.1,500 చెల్లిస్తోంది. అంటే తరగతులను బట్టి ఒక్కో స్టూడెంట్​కు రోజుకు రూ.30 నుంచి రూ.50 మాత్రమే ఇస్తున్నారు. ఇందులోంచే గ్యాస్​కు  రూ.5 పోతే ఒక్కో స్టూడెంట్​కు ఇచ్చేది రూ.25 నుంచి రూ.45 మాత్రమే. తెలంగాణ వచ్చిన కొత్తలో 2015లో ఈ  మెస్‌‌‌‌ చార్జీలను ఖరారు చేశారు. ఆ తర్వాత ఏడేండ్లుగా ఈ చార్జీలను సవరించలేదు. రెండేండ్లలో నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగాయి. 2015లో రూ. 60లోపే ఉన్న లీటర్​ వంట నూనె ధర  ప్రస్తుతం రూ.155కి చేరింది.  నాడు కిలో రూ.60 ఉన్న కందిపప్పు ఇప్పుడు రూ.95 ఉంది. అప్పట్లో గుడ్డు రూ.3 ఉంటే, ఇప్పుడు రూ. 5 దాటింది. రేట్లు పెరుగుతున్నా , ప్రభుత్వం మెస్​చార్జీలు పెంచకపోవడంతో ఫుడ్​లో క్వాలిటీ, క్వాంటిటీ తగ్గుతున్నది. 

కాంట్రాక్టర్లకు నెలల తరబడి బిల్లులు రావట్లే

ప్రతి అకడమిక్​ ఇయర్​ ప్రారంభానికి ముందు అడిషనల్​ కలెక్టర్​ ఆధ్వర్యంలో జిల్లాల్లో టెండర్లు నిర్వహిస్తారు. అప్పటి మార్కెట్​ రేట్లకు కనీసం 10 శాతం లెస్​కు టెండర్లు అప్పగిస్తారు. కాంట్రాక్టర్లు పోటీ పడి 20 శాతం వరకూ లెస్​ కు వేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు నాసిరకం సరుకులు, కూరగాయలు​ సప్లయ్​ చేస్తున్నారు. మరోవైపు కాంట్రాక్టర్లకు నెలల తరబడి బిల్లులు పెండింగ్ పెడ్తున్నారు. దీంతో కాంట్రాక్టర్లు దో నంబర్​ మాల్​ సప్లయ్​ చేసినా ఆఫీసర్లు ఏమీ అనలేని పరిస్థితి ఉంటోంది. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలోని గురుకుల పాఠశాలకు కిరాణ సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్​కు ఏడాదిగా రూ.10 లక్షల బిల్లులు పెండింగ్​లో ఉన్నాయి. ఇప్పటివరకు బిల్లులు రాకపోవడంతో అప్పులపాలవుతున్నానని అతడు చెప్పాడు. సిద్దిపేట డివిజన్​లోని 2 బీసీ హాస్టళ్లకు గుడ్లు, చికెన్, మటన్ సరఫరా చేసే కాంట్రాక్టర్​కు మే నుంచి బిల్లులు రాలేదు.  ఒక్కో హాస్టల్​కు రూ.70 వేల చొప్పున నెలకు లక్షా 40 వేల చొప్పున పెండింగ్​ ఉన్నాయని ఆ కాంట్రాక్టర్​ తెలిపాడు. 

సరిపడా వంటవాళ్లు, హెల్పర్లు లేక.. 

గురుకులాలు, హాస్టళ్లలో స్టూడెంట్ల సంఖ్యకు అనుగుణంగా వంటవాళ్లు, హెల్పర్లు లేరు. నిజానికి సగటున 100 మంది స్టూడెంట్లకు ఒక హెడ్​ కుక్​, ఇద్దరు హెల్పర్లు ఉండాలి.  కానీ చాలాచోట్ల లేరు. స్టూడెంట్ల సంఖ్య 300 ఉన్న చోట కూడా ఒక్క కుక్​, ఇద్దరు హెల్పర్లతోనే నెట్టుకొస్తున్నారు. గతంలో కుక్​లు పర్మినెంట్​పోస్టులు కాగా, ప్రస్తుతం తాత్కాలిక పద్ధతిలో తీసుకుంటున్నారు. ఆయా చోట్ల ఉన్న డిమాండ్​ను బట్టి వీళ్లకు రూ.6 వేల నుంచి రూ.12 వేల దాకా ఇస్తున్నారు. ఈ అరకొర జీతాలను కూడా రెగ్యులర్​గా ఇవ్వకపోవడంతో సఫర్​అవుతున్నారు.మంచిర్యాల కేజీబీవీ స్కూల్​లో 365 మంది స్టూడెంట్లు ఉన్నారు. గతంలో హైస్కూల్ గా ఉన్నప్పుడు నలుగురు వంట మనుషులు ఉండేవారు. ఇంటర్ అప్ గ్రేడ్ చేసినప్పటికీ అదనంగా వంట వాళ్లను నియమించలేదు. ఆరుగురు వర్కర్లు చేయాల్సిన పనిని నలుగురితోనే చేయిస్తున్నారు. దీంతో వంట చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల మహబూబాబాద్​ జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో 30 మంది స్టూడెంట్స్​ అస్వస్థతకు గురయ్యారు.  ఆఫీసర్లు వెళ్లి విచారిస్తే,   పాలకూర వండే సమయంలో అందులో ఎర్రలు, గడ్డి మొక్కలను తొలగించకుండా  నిర్లక్ష్యంగా  కట్ చేసి వేసినట్లు గుర్తించారు. 

తనిఖీలు సున్నా.. 

గవర్నమెంట్ ​స్కూళ్లు, రెసిడెన్షియల్, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో రోజూ ఫుడ్​ క్వాలిటీని చెక్​ చేయడానికి  ప్రిన్సిపల్​తో పాటు ఒక టీచర్​ ఇన్​చార్జ్​గా ఉంటారు. స్కూల్స్, హాస్టల్స్ మెస్ లను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు  ర్యాండమ్​గా తనిఖీ చేసి శాంపిల్స్ తీసుకోవాల్సి ఉన్నా  స్టాఫ్ కొరత వల్ల  జరగడం లేదు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో  ఫుడ్‍ కల్తీని కంట్రోల్‍ చేయడానికి  కేవలం నలుగురు గెజిటెడ్‍ ఫుడ్​ ఇన్​స్పెక్టర్లు  ఉన్నారు. స్టాఫ్​ కూడా సరిపడా లేక తనిఖీలు చేయడం లేదు. ఫుడ్ ఇన్‌‌‌‌స్పెక్టర్లు లేక మొదటి నుంచి తహసీల్దార్లకే ఫుడ్​ క్వాలిటీ చెక్​ చేసే బాధ్యతలు అప్పగించారు. అడపాదడపా కలెక్టర్లు తనిఖీలు చేసేవారు. కానీ ధరణి అమలులోకి వచ్చాక కలెక్టర్లు, తహసీల్దార్లు రెవెన్యూ పనుల్లోనే బిజీగా మారి తనిఖీలను పూర్తిగా మరచిపోయారు. 

అన్ని చోట్లా అటకెక్కిన మెనూ..

ప్రభుత్వం మెస్ ​చార్జీలు పెంచకపోవడం, బయట రేట్లు మండుతుండడంతో  కాంట్రాక్టర్లను ఏమీ అనలేకపోతున్న ఆఫీసర్లు  మెనూలో కోతలు పెడ్తున్నారు. 10 కిలోల పప్పు వండాల్సిన చోట 5 కిలోలతోనే సరిపెడుతున్నారు. చాలాచోట్ల సాంబారు, చారుతో సర్దుబాటు చేస్తున్నారు. నెలలో రెండుసార్లు చికెన్​, రెండుసార్లు మటన్​ వడ్డించాలి. కానీ, నాన్​వెజ్​బంద్​ పెడ్తున్నారు. ప్రతి విద్యార్థికి100 గ్రాములకు గాను 50 నుంచి 60 గ్రాములు మాత్రమే చికెన్​ ఇస్తున్నారు.  5 రోజులు ఎగ్స్​ పెట్టాల్సి ఉండగా.. రెండు, మూడ్రోజులు తప్పిస్తున్నారు. డెయిలీ సీజనల్​ ప్రూట్స్​ ఇవ్వాల్సి ఉండగా, కొన్నిచోట్ల 5 రోజులు, అవి కూడా కేవలం అరటి పండ్లతో సరిపెడ్తున్నారు. పెరుగుకు బదులు మజ్జిగ పోస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే  నాసిరకం సరుకులు, పాడైన కూరగాయల వల్ల ఫుడ్​ క్వాలిటీగా ఉండట్లేదని స్టూడెంట్స్​ చెప్తున్నారు. దీనికితోడు ఇటీవలి వర్షాలకు గురుకులాలు, హాస్టళ్ల చుట్టూ  వరదనీరు చేరడం, అపరిశుభ్రమైన కిచెన్లతో ఫుడ్ ​పాయిజనింగ్ ఘటనలు​పెరుగుతున్నాయి. ప్రభుత్వం పంపిస్తున్న బియ్యం కూడా అత్యంత నాసిరకంగా ఉంటున్నాయి. ముక్కిన, పురుగుల బియ్యం వస్తుండడం, వాటిని చెరిగేందుకు తగినంత మంది హెల్పర్లు లేకపోవడంతో అలాగే వండేస్తున్నారు. దీంతో అన్నం ముద్దలు ముద్దలుగా మారడం, పురుగులు కనిపించడంతో స్టూడెంట్స్​ తినలేకపోతున్నారు. ఆసిఫాబాద్​ జిల్లా  సిర్పూర్ టీ మండల కేంద్రంలో ఆశ్రమ పాఠశాలను ‘వెలుగు’ సందర్శించగా, గిరిజన కో ఆపరేటివ్ ​కార్పొరేషన్​ (జీసీసీ) ద్వారా సప్లై అయిన బియ్యం ముక్కిపోయి, అందులో లక్క పురుగులు , తెల్ల పురుగులు కనిపించాయి. ఎంత చెరిగినా పురుగులు పోవడం లేదని అక్కడి కామాటిలు అన్నారు.  జైనూర్ మండలం  మార్లవవాయి ఆశ్రమ హాస్టల్ లో పప్పు లేకపోవడంతో కేవలం కారం, ఉప్పుతో చేసిన కిచిడీ ఏ మాత్రం రుచిగా లేదని, ముద్ద మింగలేకపోయామని స్టూడెంట్స్​వాపోయారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు 700 మందికిపైగా స్టూడెంట్లు ఫుడ్​పాయిజన్​కు గురై హాస్పిటల్స్​ పాలయ్యారు. 

మే నుంచి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి 

మే నెల నుంచి గురుకుల పాఠశాలకు కిరాణం సామాగ్రి సప్లయ్​ చేశాం. ఇప్పటికీ బిల్లులు రాలేదు. ఒక్కో హాస్టల్ నుంచి రూ. 2 లక్షల వరకు పెండింగ్​లో ఉంది. సామాన్లు ఉద్దెరకు ఇవ్వాలంటే ఎవరూ ఇస్తలేరు.  ప్రతి నెలా బిల్లులు ఇచ్చేలా సర్కారు చర్యలు తీసుకోవాలి.   
- జె. రవీందర్, కిరాణం సామగ్రి సప్లయర్, కరీంనగర్