జింఖానాను పరిశీలించిన సుప్రీంకోర్టు కమిటీ

జింఖానాను పరిశీలించిన సుప్రీంకోర్టు కమిటీ

హైదరాబాద్‌, వెలుగు: తెలంగాణలో గ్రామీణ ప్రతిభను వెలికి తీసేందుకు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నడుం బిగించింది. ఈ మేరకు ఐపీఎస్‌ అధికారి అంజనీ కుమార్‌, మాజీ క్రికెటర్లు వెంకటపతి రాజు, వంకా ప్రతాప్‌తో కూడిన కమిటీ.. గురువారం జింఖానా గ్రౌండ్‌ను పరిశీలించింది. అక్కడి కోచింగ్‌ సదుపాయాలపై ఆరా తీసింది. ఇక నుంచి అన్ని స్థాయిల్లో బాలుర, బాలికల క్రికెట్‌ శిక్షణను పునరుద్ధరించేందుకు కృషి చేయాలని కమిటీ ఆదేశించింది. క్రికెట్‌ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న వంకా ప్రతాప్‌ శిక్షణ క్యాలెండర్‌ను సిద్ధం చేయనున్నారు.

దీపావళి తర్వాత జింఖానాలో జిల్లాల వారిగా కోచింగ్‌ కార్యకలాపాలను ప్రారంభించనున్నారు. ప్లేయర్లకు ఉప్పల్‌ స్టేడియంలో బస ఏర్పాటు చేయనున్నారు. జిల్లాల వారిగా క్రికెట్‌ అసోసియేషన్ల ఏర్పాటుకు కృషి చేయాలని కమిటీ నిర్ణయించింది. ఇవన్నీ హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్​ (హెచ్‌సీఏ)లో భాగంగా ఉండనున్నాయి. ఈ నెల 15న మరోసారి ఉప్పల్‌ స్టేడియంలో ఈ కమిటీ సమావేశం కానుంది.