టెట్ ఫలితాల విడుదలలో గందరగోళం..అర్ధరాత్రి వెబ్‌‌సైట్‌‌లో ప్రత్యక్షం.. కాసేపటికే మాయం

టెట్ ఫలితాల విడుదలలో గందరగోళం..అర్ధరాత్రి వెబ్‌‌సైట్‌‌లో ప్రత్యక్షం..  కాసేపటికే మాయం
  • అప్పటికే రిజల్ట్స్‌‌ చూసుకున్న వేలాది మంది అభ్యర్థులు 
  • కేవలం ‘ట్రయల్ రన్’ నిర్వహించామంటున్న ఆఫీసర్లు 
  • టీఎస్ ఆన్‌‌లైన్‌‌పై విద్యా శాఖ సీరియస్.. క్రిమినల్ కేసులు పెట్టాలని నిర్ణయం 
  • ఫలితాల రిలీజ్‌‌ టైమ్‌‌లో టెట్ కన్వీనర్‌‌‌‌కు ఎలక్షన్ డ్యూటీ వేయడంపై విమర్శలు 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఫలితాల వ్యవహారం గందరగోళంగా మారింది. ఫలితాల కోసం లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తుంటే.. అధికారుల నిర్లక్ష్యం, సమన్వయ లోపం వారిని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. సోమ వారం అర్ధరాత్రి టెట్ వెబ్‌సైట్‌లో ఫలితాలు ప్రత్యక్ష మయ్యాయి. దీంతో అభ్యర్థులు తమ మార్కులు చూసుకున్నారు. అయితే,  చూస్తుండగానే వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ లింక్ బ్లాక్ అయింది. అసలు ఫలితాలు వచ్చాయా.. లేదా? తాము చూసింది నిజమో, అబద్ధమో తెలియక అభ్యర్థులు అయోమయానికి గురయ్యారు. 

అధికారుల పర్మిషన్ లేకుండానే..

టెట్ అధికారులకు సమాచారం లేకుండానే ఫలితాలు వెబ్‌సైట్‌లోకి రావడంపై విద్యా శాఖ ఉన్నతాధికారులు కూడా అయోమయానికి గురయ్యారు. దీనిపై టెక్ని కల్ సపోర్ట్ అందిస్తున్న ‘టీఎస్ ఆన్‌లైన్’నిర్వాహకులను ప్రశ్నించగా.. తాము కేవలం ‘ట్రయల్ రన్’నిర్వహించామని చెప్పారు. ఆ సమయంలో పొరపాటున లింక్ లైవ్‌లోకి వచ్చిందని వారు సమాధానమిచ్చినట్లు చెప్తున్నారు. విద్యాశాఖ అనుమతి లేకుండా అర్ధరాత్రి వేళ ఫలితాలను వెబ్‌సైట్‌లో ఎలా పెడ్తారని అధికారులు ప్రశ్నిస్తున్నారు. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన ఫలితాల విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

క్రిమినల్ కేసుకు రంగం సిద్ధం..

అభ్యర్థులను గందరగోళానికి గురిచేసిన టీఎస్ ఆన్‌లైన్ సంస్థ తీరుపై విద్యాశాఖ సీరియస్‌ అయింది. వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని నిర్ణయించింది. వారి నుంచి వివరణ కోరుతూ టీఎస్ ఆన్‌లైన్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్టు టెట్ కన్వీనర్​ జి.రమేశ్​ వెల్లడించా రు. మరోవైపు, ఫలితాల వెల్లడి సమయంలో కీలక బాధ్యతల్లో ఉన్న అధికారి అందుబాటులో లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్, టెట్ కన్వీనర్‌గా ఉన్న జి.రమేశ్‌ను నల్గొండ జిల్లా ఎన్నికల అబ్జర్వర్‌గా పంపించారు. రిజల్ట్స్ ప్రాసెసింగ్ జరిగే అత్యంత కీలకమైన సమయంలో బాధ్యత గల అధికారిని వేరే డ్యూటీకి పంపించడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.