కేసీఆర్ కాంట్రాక్ట్ లెక్చరర్లని పట్టించుకోవడం లేదు

కేసీఆర్ కాంట్రాక్ట్ లెక్చరర్లని పట్టించుకోవడం లేదు

హైదరాబాద్: తెలంగాణ వస్తే కాంట్రాక్ట్ అనే పదమే ఉండదన్నారు.. గుర్తులేదా..? అని కాంట్రాక్ట్ లెక్చరర్లు ప్రశ్నించారు. అధికారం చేపట్టిన తర్వాత కాంట్రాక్టు లెక్చరర్ల గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ యూనివర్సిటి టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ యూనివర్సిటి టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పరుశురామ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ధర్మతేజ తోపాటు అన్ని యూనివర్సిటీల  కాంట్రాక్ట్ లెక్చరర్ అసోసియేషన్ సభ్యులు, లెక్చరర్లు పాల్గొన్నారు. 
 ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటి టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పరుశురామ్ మాట్లాడుతూ తెలంగాణ వస్తే కాంట్రాక్ట్ అనే పదం ఉండదన్న సీఎం కేసీఅర్ కాంట్రాక్ట్ లెక్చరర్లను పూర్తిగా విస్మరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు... అసిస్టెంట్ ప్రొఫెసర్లని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే జూనియర్... డిగ్రీ... పాలిటెక్నిక్ కాలేజీల్లో కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వం ప్రకియ ప్రారంభించినట్లు సమాచారం ఉందన్నారు. సంవత్సరాల తరబడి యూనివర్సిటిల్లో బోధన చేస్తూ వర్సిటీల అభివృద్ధి కోసం కాంట్రాక్ట్ లెక్చరర్లు పని చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. జీవో నెంబర్ 16 ప్రకారం ప్రభుత్వం వర్సిటీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లని  రెగ్యురలైజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.