దేశంలో కరెంటు కష్టాలు రానివ్వం...డిమాండ్‌‌‌‌‌‌‌‌ కు తగ్గట్టుగా సరఫరాకు సిద్ధం: కేంద్ర విద్యుత్ శాఖ

దేశంలో కరెంటు కష్టాలు రానివ్వం...డిమాండ్‌‌‌‌‌‌‌‌ కు తగ్గట్టుగా సరఫరాకు సిద్ధం: కేంద్ర విద్యుత్ శాఖ
  • ఈ నెలలో 265 గిగావాట్లకు పెరిగిన డిమాండ్
  • జూన్​లో 271, జులైలో 283కి పెరగొచ్చు 

న్యూఢిల్లీ: ఈ వేసవిలో దేశంలో విద్యుత్ డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 25న 256 గిగావాట్లుగా నమోదైన పీక్ డిమాండ్, మే 20 నాటికి 265 గిగావాట్లకు పెరిగింది. జూన్‌‌‌‌‌‌‌‌లో 271, జూలైలో 283 గిగావాట్లకు చేరవచ్చని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘానికి వెల్లడించింది. ఈ నేపథ్యంలో వేసవి కాలంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ పూర్తి సామర్థ్యంతో నిరంతరాయంగా పని చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ఏ విద్యుత్ కేంద్రానికీ మెయింటెనెన్స్ షట్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌కు అనుమతి ఇవ్వడం లేదు. దీంతో 15,000 మెగావాట్ల అదనపు విద్యుత్ అందుబాటులోకి వస్తుందని అధికారులు చెప్పారు. బొగ్గు నిల్వలు ప్రస్తుతం 18 రోజులకు సరిపడా మాత్రమే ఉన్నాయని, అయితే సాధారణంగా 30 రోజులకు సరిపడా నిల్వలు ఉండాలి కానీ, తక్కువగా ఉన్నాయని తెలిపారు. అయినా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని వివరించారు.

నైజీరియా నుంచి గ్యాస్..

పునరుత్పాదక వనరుల వినియోగంలో వ్యూహాత్మక మార్పులు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. పగటిపూట సౌరవిద్యుత్ ఉత్పత్తి పెరగనుంది కనుక జల విద్యుత్‌‌‌‌‌‌‌‌ను పగలు నిల్వ చేసి, రాత్రివేళ వాడుకుంటారు. జూన్ నుంచి విండ్ జనరేషన్ మెరుగుపడే అవకాశం ఉందని అంచనా. ఉత్తరప్రదేశ్ అదనపు లోడ్ షేరింగ్ సహాయం కోరగా, అందించేందుకు హామీ ఇచ్చారు. 

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ హార్మూజ్‌‌‌‌‌‌‌‌ జలసంధిని మూసివేయడంతో గ్యాస్ సరఫరాకు అంతరాయం కలగడంతోపాటు, ధరలూ పెరిగాయి. ఇది ఆందోళనలను పెంచుతున్న నేపథ్యంలో.. నైజీరియా నుంచి ప్రత్యామ్నాయంగా గ్యాస్ సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నారు. రికార్డు విద్యుత్​డిమాండ్‌‌‌‌‌‌‌‌ను తట్టుకొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు విద్యుత్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.