- కొన్ని జిల్లాల్లో అన్నోన్ పర్సన్, మిగులు భూమి, 999 పేరు మీద ల్యాండ్స్
- భూ రికార్డుల ప్రక్షాళనలో కూడా తేలని ‘శ్రీ’ భూముల చిక్కులు
- ఆ భూములు తమవంటూ ఏండ్లుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న రైతులు
- తమ దగ్గర ఆప్షన్ లేదని, సర్కారే పరిష్కారం చూపాలంటున్న ఆఫీసర్లు
పేరు శ్రీ... ఆయన పేరు మీద రాష్ట్రంలో సుమారు మూడు లక్షల ఎకరాల భూమి ఉంది. కొన్నేళ్లుగా ఈ భూములకు ‘శ్రీ’నే ఓనర్‌గా ఉంటున్నట్టు రికార్డుల్లో ఉంది. భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లోనూ ఇదే పేరు కంటిన్యూ అవుతోంది. ఇంత పెద్ద భూస్వామి ఎలా ఉంటాడో? ఎక్కడుంటాడో? ఏం చేస్తుంటాడో..ఇటు ప్రభుత్వానికి, అటు రెవెన్యూ అధికారులకు తెలియదు.
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 3 లక్షల ఎకరాల వరకు భూమి శ్రీ పేరు మీద రికార్డుల్లో ఉంది. కేసీఆర్ సర్కారు తాజాగా తీసుకొచ్చిన భూ రికార్డుల ప్రక్షాళనలోనూ శ్రీ భూముల చిక్కులు తేలలేదు. యాజమాన్య హక్కుల విషయంలో క్లారిటీ లేని భూములను శ్రీ పేరుతోనో లేకుంటే అన్నోన్ పర్సన్, మిగులు భూమి, 999 పేరు మీదనో నమోదు చేస్తున్నారు. ఆ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులు మాత్రం ఆ ల్యాండ్స్ తమవని.. తమ పేర్లు ఎక్కించాలని ఏండ్లుగా రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.అధికారులేమో తమ దగ్గర ఆ ఆప్షన్ లేదని, ప్రభుత్వమే పరిష్కారం చూపాలని దాటవేస్తున్నారు.
ఓనరెవరో క్లారిటీ లేకుంటే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2011లో రాష్ట్రవ్యాప్తంగా భూ రికార్డుల కంప్యూటరైజేషన్ ప్రారంభమైంది. వెబ్ ల్యాండ్, మా భూమి పేరిట పోర్టల్స్‌ను రెవెన్యూ శాఖ నిర్వహించేది. అయితే భూ రికార్డుల కంప్యూటరైజేషన్ క్రమంలో ప్రతి పట్టాదారుకూ ఓ ఖాతా నంబర్ ఇచ్చారు. గ్రామాల్లో కొన్ని సర్వే నంబర్లకు సంబంధించిన భూములకు ఓనరెవరో తెలియకపోతే రెవెన్యూ అధికారులు ఆ భూములకు కూడా ఖాతా నంబర్ ఇచ్చారు. వీటినే నోషనల్ ఖాతాలు అనేవారు. ఒక సర్వే నంబర్‌లో ఉన్న భూమి అసలు వారసులెవరో కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు లేదా పార్ట్‌నర్ల మధ్య వివాదం తేలనప్పుడు లేదా కొందరు పట్టాదారులు సర్వే నంబర్ తమది కాదని పొరపాటున తన పాస్‌బుక్‌లో వచ్చిందని స్వచ్ఛందంగా ప్రభుత్వానికి సరెండర్ చేసినప్పుడు ఆ భూములను నోషనల్ ఖాతాలో వేశారు. ఇలా ఆ భూములకు నంబర్ ఇవ్వడంతో పాటు పట్టాదారు పేరు ‘శ్రీ’గా నమోదు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో పట్టాదారు పేరు మిగులు భూమి అని, మరికొన్ని జిల్లాల్లో అన్ నోన్ పర్సన్ అని, 999గా ఎంట్రీ చేశారు. 2017లో చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన టైమ్‌లో ‘కాస్తు’లో ఉన్న వారికి కొందరు తహసీల్దార్లు తమ విచక్షణాధికారంతో పట్టాదారు పాస్‌బుక్స్ ఇచ్చారు. అయినా ఇంకా సుమారు 3 లక్షల ఎకరాల భూములు శ్రీ, అన్ నోన్ పర్సన్, మిగులు భూములు, 999 పేరు మీదుగా వస్తున్నాయి.
ఒక్క ఊర్లోనే 60 ఎకరాలు
మహబూబాబాద్ మండలంలోని పర్వతగిరి గ్రామంలో 11/ఏ/2, 12/4, 13/1/2, 15/బీ/5/1 లాంటి మొత్తం 79 సర్వే నంబర్లు 11111 అనే ఒకే ఖాతా నంబర్‌లో చూపిస్తున్నాయి. ఈ నంబర్లను చెక్ చేస్తే ల్యాండ్ ఓనర్ పేరు శ్రీ, తండ్రి పేరు శ్రీ, సోషల్ స్టేటస్ జనరల్‌గా కనిపిస్తోంది. ఈ ఊర్లోని 60 ఎకరాల భూమి శ్రీ పేరు మీదనే ఉంది. కాస్తులో, పాత పహాణీల్లో వేరే రైతుల పేర్ల కనిపిస్తున్నా ధరణి పోర్టల్‌లో మాత్రం వాళ్ల పేర్లు లేవు.
శ్రీ పేరుతో నా భూమి 1.37 ఎకరాలుంది
మహబూబాబాద్ మండలం పర్వతగిరి గ్రామంలో మా తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన భూమి సర్వే నంబర్ 144/సీ/1/1/1లో 1.37 ఎకరాలుంది. భూ రికార్డుల ప్రక్షాళన జరిగినప్పుడు ఆ భూమి నా పేరుతో ఎక్కలేదు. ధరణి పోర్టల్‌లో చూస్తే ‘శ్రీ’ పేరుతో ఉంది. ఇంకో సర్వే నంబర్144/బీలో ఎకరం 14 గుంటలుంటే 14 గుంటలే పట్టాదారు పాస్ బుక్‌లో నమోదైంది. ఈ సమస్యలపై తహసీల్దార్‌ను అడిగితే తమ చేతుల్లో ఏం లేదన్నారు. ధరణి గ్రీవెన్స్‌కు ఈ మధ్య అప్లికేషన్ పెట్టినం.
- ఎర్రంరెడ్డి సంపత్‌రెడ్డి, పర్వతగిరి
