రాష్ట్రంలో అర్బన్ నక్సల్స్ ఎవరూ లేరు: డీజీపీ శివధర్ రెడ్డి

రాష్ట్రంలో అర్బన్ నక్సల్స్ ఎవరూ లేరు: డీజీపీ శివధర్ రెడ్డి
  • గణపతి ఎప్పుడు లొంగిపోయేది ఆయనే చెప్పాలి
  • రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రాణ రక్షణకే ‘అరైవ్​ -అలైవ్’ ప్రోగ్రామ్​

గోదావరిఖని/ఆసిఫాబాద్/బెల్లంపల్లి రూరల్/, వెలుగు: రాష్ట్రంలో అర్బన్​ నక్సలైట్లు ఎవరూ లేరని, అలాంటి వారు తన దృష్టికి రాలేదని డీజీపీ శివధర్​రెడ్డి తెలిపారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఐబీ కాలనీలో రూ.12.29 కోట్లతో నిర్మించిన పోలీస్​ క్వార్టర్ల కాంప్లెక్స్​ను డీజీపీ ప్రారంభించారు. అనంతరం పోలీస్​ ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్  జిల్లా రెబ్బెన పాత పోలీస్ స్టేషన్‌‌లో ఏర్పాటు చేసిన లైబ్రరీని ప్రారంభించారు. ఆసిఫాబాద్​లో భరోసా సెంటర్  బిల్డింగ్​కు భూమిపూజ చేశారు. పోలీస్  శిక్షణ కేంద్రం, మూవింగ్  టార్గెట్  ఫైరింగ్  రేంజ్, చెక్‌‌పోస్ట్  వద్ద ఏర్పాటు చేసిన హెల్మెట్  చౌక్ ను ప్రారంభించారు. కెరమెరి మండలం జోడేఘాట్ ను సందర్శించి కుమ్రంభీం విగ్రహం, సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కుమ్రంభీం మ్యూజియంను సందర్శించారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో కొత్తగా నిర్మించిన పోలీస్ స్టేషన్  బిల్డింగ్​ను ఎమ్మెల్యే గడ్డం వినోద్, కలెక్టర్​ కుమార్​ దీపక్​తో కలిసి ప్రారంభించారు. తాండూర్​ మండలం బోయపల్లిలో నిర్వహించిన మాసాడి రామయ్య స్మారక క్రికెట్​ పోటీల ముగింపు కార్యక్రమానికి హాజరై బహుమతులు అందజేశారు. బెల్లంపల్లిలో జరిగిన ఆటో డ్రైవర్ల అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అర్బన్​ నక్సలైట్లు లేరని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఐదుగురు మవోయిస్టులే ఉన్నారని, గతంలో మావోయిస్టు ముప్పు ఉన్న నేతలకు కేటాయించిన గన్‌‌మెన్‌‌లను దశలవారీగా తొలగిస్తామని చెప్పారు. మావోయిస్ట్​ అగ్రనేత ముప్పాల లక్ష్మణ్​రావు ఆలియాస్​ గణపతి ఎప్పుడు ఎప్పుడు లొంగిపోతాడో తెలియదని, ఆ విషయం గణపతే చెప్పాలని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, మరణాలను తగ్గించేందుకు 99 రోజుల ప్రజా పాలనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ‘అరైవ్​ -అలైవ్’ ప్రోగ్రామ్  చేపట్టామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో 18 నుంచి 40 ఏండ్ల వారే ఎక్కువగా చనిపోతున్నారని, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతి ఏడాది 7,500 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడం బాధాకరమన్నారు. మారుమూల ప్రాంతాల్లో నాణ్యమైన పోలీసింగ్  అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

సాంకేతికతను వినియోగిస్తూ కేసుల విచారణను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. 26 ఏండ్ల కింద బెల్లంపల్లి ప్రాంతంలో అడిషనల్​ ఎస్పీగా పని చేశానని గుర్తు చేసుకున్నారు. డీజీపీ వెంట మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, రామగుండం సీపీ అంబర్​ కిషోర్​ ఝా, కరీంనగర్​ సీపీ​గౌస్​ ఆలం, టీజీపీఐసీఎస్​ చైర్మన్​ ఆర్  గురునాథ్​రెడ్డి, సిరిసిల్ల ఎస్పీ మహేశ్​ బి గీతే, జగిత్యాల ఎస్పీ​పి అశోక్​కుమార్, పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి, మంచిర్యాల డీసీపీ భాస్కర్, 13వ బెటాలియన్​ కమాండెంట్​ వెంకట్రాములు, ఆసిఫాబాద్  ఏఎస్పీ చిత్తరంజన్ పాల్గొన్నారు.