యాక్టింగ్ తప్ప యాక్షన్ లేదు.. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంపై సిట్ పేరుతో కాలయాపన: రాంచందర్ రావు

యాక్టింగ్ తప్ప యాక్షన్ లేదు.. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంపై సిట్ పేరుతో కాలయాపన: రాంచందర్ రావు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ‘క్విడ్ ప్రో కో’ పద్ధతిలో పనిచేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. ప్రభుత్వం మారినా దోపిడీ మారలేదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలనే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు. బీఆర్ఎస్ హయాంలో చక్రం తిప్పిన కాంట్రాక్టర్లే కాంగ్రెస్ హయాంలోనూ సేఫ్​గా ఉన్నారని, వారిని కాపాడడమే ఈ ప్రభుత్వాల ఉద్దేశమని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఒక్క స్కామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైనా నిజమైన విచారణ జరగలేదన్నారు. 

12ఏండ్ల సర్కారు నిర్ణయాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం యాక్టింగ్ చేస్తోందే తప్ప, యాక్షన్ తీసుకోవడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. నోటీసులిచ్చి హడావుడి చేయడం, పబ్లిసిటీ చేసుకోవడమే తప్ప.. అసలు దోషులను అరెస్ట్ చేసే దమ్ము ప్రభుత్వానికి లేదన్నారు. నైని కోల్ బ్లాక్, లిక్కర్ పాలసీల విషయంలోనూ బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే కాంగ్రెస్ నడుస్తోందని, స్వయంగా మంత్రులే పాత పాలసీని కొనసాగిస్తున్నామని ఒప్పుకుంటున్నారని గుర్తు చేశారు.

జైలుకు పంపుతామని చెప్పి.. కాపాడుతున్నరు

‘‘ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఏమన్నారు? అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే కేసీఆర్ కుటుంబాన్ని చర్లపల్లి జైలుకు పంపుతామని, అక్కడే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని ప్రగల్భాలు పలికారు. మరి ఇప్పుడు రెండేళ్లయింది.. ఆ ఫ్యామిలీలో ఒక్కరైనా జైలుకు వెళ్లారా? మరి జైలులో ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు కట్టిస్తావ్’’ అని రాంచందర్ రావు ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణను కేవలం కొన్ని బ్యారేజీలకే పరిమితం చేయడం సరికాదన్నారు. 

మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పండి

రాష్ట్రంలో బీజేపీ బలపడుతుంటే ఓర్వలేక బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు విషం చిమ్ముతున్నాయని రాంచందర్ రావు అన్నారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో వెయ్యికి పైగా సర్పంచ్ స్థానాలు, పదివేల వార్డు మెంబర్లను గెలుచుకుని బీజేపీ సత్తా చాటిందన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అవినీతి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పి, బీజేపీని గెలిపించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.