తెలంగాణ డెయిరీకి ఢోకా లేదు

తెలంగాణ డెయిరీకి ఢోకా లేదు

వెలుగు, బిజినెస్ బ్యూరోలాక్‌‌డౌన్‌‌ వల్ల పాలు, ఇతర డెయిరీ ప్రొడక్ట్స్‌‌ అమ్మకాలు తాత్కాలికంగా పడిపోయినప్పటికీ, తెలంగాణ డెయిరీ ఇండస్ట్రీకి ఢోకా లేదని ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ తెలంగాణ చాంబర్స్‌‌ అండ్‌‌ కామర్స్‌‌ ఇండస్ట్రీ (ఎఫ్‌‌టీసీసీఐ) వైస్‌‌–ప్రెసిడెంట్‌‌ భాస్కర్‌‌ రెడ్డి అన్నారు. డెయిరీ పరిశ్రమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు. లాక్‌‌డౌన్‌‌ తరువాత అతిత్వరలోనే డెయిరీ ఇండస్ట్రీ గాడినపడుతుందని ‘వెలుగు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు.

లాక్‌‌డౌన్‌‌ వల్ల డెయిరీ ఇండస్ట్రీకి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి ?

లాక్‌‌డౌన్‌‌ మొదలయ్యాక మొదటి మూడు రోజులు మాత్రం బాగా ఇబ్బందిపడ్డాం. పాల వ్యాన్లు సిటీకి రాలేకపోయాయి. దీంతో పోలీసుల సాయం కోరగా, వాళ్లు తగిన సహకారం అందించారు. అప్పటి నుంచి సప్లైకి ఎలాంటి ఆటంకాలూ రానివ్వలేదు. పాలు అత్యవసరం కాబట్టి రవాణా సాఫీగా జరుగుతోంది. ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కరించడానికి వీలుగా ఒక వాట్సాప్‌‌ గ్రూపును ఏర్పాటు చేసుకున్నాం. మొదట్లో లేబర్‌‌ కొరత వల్ల ప్రొడక్షన్‌‌కు సమస్యలు వచ్చాయి. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. పాల సేకరణ యథావిధిగా జరుగుతోంది.

అమ్మకాలు ఎలా ఉన్నాయి ?

హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాల్స్‌‌ నడవడం లేదు కాబట్టి సహజంగానే పాలు, పెరుగు అమ్మకాలు 25–30 శాతం తగ్గాయి. చాలా ఆఫీసులు కూడా మూతపడ్డాయి కాబట్టి బల్క్‌‌ సేల్స్‌‌ పడిపోయాయి.  బస్సులు, రైళ్లు లేవు కాబట్టి ‘ఆన్‌‌ ది గో కన్సంప్షన్‌‌’ తగ్గింది. చాలా మంది ఇండ్లలోనే ఉంటున్నారు కాబట్టి హోమ్‌‌ కన్సంప్షన్‌‌ పెరిగింది. అయితే పన్నీర్‌‌, నెయ్యి, ఫ్లేవర్డ్‌‌ మిల్క్‌‌కు డిమాండ్‌‌ చాలా తగ్గింది. అమ్మకాలు సాధారణ స్థితికి రావడానికి కొంత టైం పట్టవచ్చు.

లాక్‌‌డౌన్ తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయి ?

ఈ విషయమై కచ్చితమైన అంచనాకు రావడం కష్టం. ఎందుకంటే లాక్‌‌డౌన్‌‌ ఇంకెంతకాలం ఉంటుందో స్పష్టంగా తెలియదు. లాక్‌‌డౌన్‌‌ ఎత్తివేస్తేనే సినిమా హాల్స్‌‌, రెస్టారెంట్లు తెరుచుకుంటాయి. ఇక ముందు సోషల్‌‌ డిస్టెన్సింగ్‌‌ వంటి రూల్స్‌‌ ఎలా ఉంటాయో తెలియదు. డెయిరీ ప్రొడక్టులకు మాత్రం డిమాండ్‌‌ త్వరగానే పెరుగుతుంది. అన్ని ఇండస్ట్రీల కంటే మొట్టమొదట డెయిరీనే కోలుకుంటుంది.

కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీ గురించి ఏమంటారు ?

మంత్రి నిర్మలా సీతారామన్‌‌ ప్రకటించిన స్టిములస్‌‌ ప్యాకేజీ బాగుంది. అగ్రి ఇండస్ట్రీకి మంచి ప్రోత్సాహకాలు ఇచ్చారు. పాడి రైతులకు తక్కువ వడ్డీకి లోన్లు ఇస్తామని చెప్పారు. సహకార సంఘాల వడ్డీని ఆలస్యంగా చెల్లించడానికి అనుమతి ఇచ్చారు. డెయిరీతోపాటు ఇతర అగ్రి సెక్టార్లకు కావాల్సిన ప్రోత్సాహకాలు ఇచ్చారు.  ప్రభుత్వ ప్రోత్సాహం వల్లే డెయిరీ ఇండస్ట్రీలోకి ఇది వరకే చాలా ఇన్వెస్ట్‌‌మెంట్స్‌‌ వచ్చాయి.

తెలంగాణలో అమ్మకాలు ఎలా ఉన్నాయి ?

తెలంగాణలో రోజుకు ప్రభుత్వ, ప్రైవేటు డెయిరీలు రోజుకు 12 లక్షల లీటర్లు, మిల్క్‌‌ వెండర్స్‌‌ దాదాపు ఆరు లక్షల లీటర్ల పాలు అమ్ముతున్నారు.  అన్నీ కలిపితే రోజుకు 22 లక్షల లీటర్లు మార్కెటింగ్‌‌ అవుతున్నాయి.  అయితే మన దగ్గర పాల వాడకం తక్కువగానే ఉంది. పాలు సంపూర్ణ ఆహారం కాబట్టి జనం మరిన్ని పాలను వాడాలి. అమూల్‌‌ వంటివి గుజరాత్‌‌ వంటి రాష్ట్రాల పాలను తెచ్చి అమ్మడం వల్ల మన తెలంగాణ రైతులకు నష్టం కలుగుతున్నది. అమూల్‌‌, మదర్‌‌ డెయిరీ, నందిని డెయిరీల పాల ధరలు తక్కువ ఉన్నాయి. అక్కడి రాష్ట్రాల్లో పాల ఉత్పత్తి బాగుండటమే దీనికి కారణం. మన దగ్గర మిల్క్‌‌ ప్రొడక్షన్‌‌ మరింత పెరగాలి. తెలంగాణలో సహకార సంఘాలు మరింత బలోపేతం కావాలి.

పాలు ధరల పెరుగుదలకు కారణం ఏంటి ?..

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పాల ఉత్పత్తి 12 శాతం తగ్గింది. పాల సేకరణ ధరలు రూ. 7,8 మేర పెరిగాయి. రవాణాకు చాలా ఖర్చు చేయాల్సి వస్తోంది.  ప్రస్తుతం లీటరు  గేదె పాలకు రూ.38 వరకు, ఆవు పాలకు రూ.24 వరకు రైతులకు ఇస్తున్నారు. పాలలో కొవ్వును బట్టి ధరలు మారుతుంటాయి. అన్ని రాష్ట్రాలలో పాల ధరలు పెరిగాయి. కర్ణాటక మాదిరి పాల ఉత్పత్తి భారీగా ఉంటే ధరలు తగ్గుతాయి. ప్రొక్యూర్‌‌మెంట్ పెరగడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

 

స్మార్ట్‌‌ఫోన్‌‌ సేల్స్‌ ఆన్ లైన్ లోదూసుకెళ్తున్నాయ్‌