నేతన్న బీమా పథకంపై సర్కార్ సప్పడుజేస్తలేదు

నేతన్న బీమా పథకంపై సర్కార్ సప్పడుజేస్తలేదు

హైదరాబాద్, వెలుగు: నేత కార్మికుల కోసం తీసుకొస్తామని చెప్పిన నేతన్న బీమా పథకంపై సర్కార్ సప్పడుజేస్తలేదు. రైతు బంధు లెక్క నేతన్నలకు కూడా ఇస్తామని బడ్జెట్‌‌లో ప్రతిపాదించిన సర్కారు ఇప్పటి దాకా ఎలాంటి కార్యచరణ ప్రారంభించలేదు. గతంలోనూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఈ బీమా అమలు చేస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత పట్టించుకోలేదు. బీమా పథకంపై సర్కార్​ఇంకా ఆలస్యం చేయకుండా త్వరగా తీసుకురావాలని నేతన్నలు కోరుతున్నారు.

కుటుంబానికి రూ.5 లక్షలు

రైతులకు రైతు బీమా తరహాలోనే నేత కార్మికులకు రూ.5 లక్షల బీమా కల్పిస్తామని ప్రభుత్వం ఈ సారి బడ్జెట్‌‌లో ప్రతిపా-దించింది. రైతు బీమా పథకం కింద గుంట భూమి ఉన్న రైతు మరణించినా, బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందుతున్నది. ప్రమాదం, ఆత్మహత్య సహా ఏ కారణాల వల్ల చనిపోయినా డెత్‌‌ సర్టిఫికెట్‌‌ ఆధారంగా పరిహారం ఇస్తున్నది. ఈ బీమా పథకానికి రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం కూడా చెల్లిస్తున్నది. అదే తరహాలో నేత కార్మికులకు బీమా పథకాన్ని తీసుకొస్తామని చెప్పింది. చేనేత కార్మికులు మరణిస్తే ఈ స్కీం కింద వారి కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం అందుతుంది. ప్రస్తుతం బడ్జెట్‌‌లో ఈ పథకానికి ప్రీమియం కింద రూ. 50లక్షలను సర్కారు కేటాయించింది.

మాటలకే పరిమితం అవుతోంది

రాష్ట్రంలో సుమారు లక్ష కార్మిక కుటుంబాలున్నాయి. నేతన్నలకు బీమా స్కీం తీసుకొస్తామని బడ్జెట్‌‌లో ప్రతిపాదించి రెండు నెలలు కావస్తున్నా ఎలాంటి పురోగతి లేదు. 2022–23లో ప్రారంభిస్తామని చెప్పినా అందుకు అవసరమైన విధివిధానాలు ఖరారు చేయలేదు. 2021లో జులైలో సిరిసిల్లలో జరిగిన కార్యక్రమంలో రూ.5 లక్షల ఉచిత బీమా పథకాన్ని రెండుమూడు నెలల్లో తీసుకువస్తామని కేసీఆర్‌‌ హామీ ఇచ్చారు. ఆ తర్వాత అదే ఏడాది ఆగస్టులో కూడా కేటీఆర్‌‌ ప్రకటించారు. సందర్భం వచ్చినప్పుడల్లా మంత్రులు కూడా చెబుతున్నారు. ఇది మాటలకే పరిమిమవుతోంది తప్ప కార్యరూపం దాల్చడంలేదని నేత కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి.

గైడ్​లైన్స్​ ఏవీ?

ఉమ్మడి రాష్ట్రంలో రైతుల తర్వాత ఎక్కువగా చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరిగేవి. అప్పట్లో ప్రభుత్వ, కార్మికుల భాగస్వామ్యంతో రూ.లక్ష బీమా పథకం అమలయ్యేది. బీమా ప్రీమియం చెల్లింపులు సమస్యగా మారిందని 2013లో దీనిని రద్దు చేశారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత చేనేత కార్మికులు ఎవరైనా చనిపోతే ఎలాంటి సాయం అందడంలేదు. అయితే ఈ బీమా పథకం ఎలా వర్తింపజేయాలనేదానిపై గైడ్​లైన్స్ రూపొందించాల్సి ఉంది. అందరికీ వర్తిస్తుందా..? కొందరికే అమలు చేస్తారా..? ఏ ప్రాతిపదికన ఇస్తారు..? అనేది తేలాల్సి ఉంది.

జల్ది అమలు చేయాలె

నేతన్నల బీమా పథకం కోసం ఎన్నో ఏండ్లుగా పోరాడుతున్నం. 2021లోనే సీఎం కేసీఆర్‌‌, మంత్రులు ఈ పథకం ప్రకటించారు. ఇటీవల బడ్జెట్‌‌లో ప్రతిపాదించినా ఇప్పటి దాకా ఎలాంటి వర్క్ స్టార్ట్‌‌ చేయలేదు. వీలైనంత త్వరగా విధి విధానాలను ప్రకటించాలి. వయసుతో నిమిత్తం లేకుండా.. చేనేత వృత్తిలో కొనసాగుతున్న కార్మికులందరికీ ఈ పథకం వర్తింపజేయాలి.
- దాసు సురేశ్, నేతన్నల ఐక్య కార్యచరణ కమిటీ, చైర్మన్‌‌

స్కీం తెస్తే బాధితులకు ఆసరా ఐతది

రైతు బీమా లెక్క నేతన్నలకు బీమా పథకం తెస్తమని ఊరించుడు తప్ప అమలు చేయడంలేదు. నిత్యం పదుల సంఖ్యలో నేత కార్మికులు చనిపోతున్నారు. ఇంటి పెద్ద లేకపోవడంతో కుటుంబాలు వీధిన పడుతున్నయి. ఈ స్కీం వస్తే వారికి ఉపయోగంపడుతుంది. కానీ ముందుకు పడటంలేదు. ప్రభుత్వం వెంటనే స్కీం తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలి.
- కొంగరి సందీప్‌‌, 
నేత కార్మికుడు, గట్టుప్పల