ఆమ్దానీ వస్తున్నా..అప్పులు తెస్తున్నా ఖజానాలో పైసా లేదు

ఆమ్దానీ వస్తున్నా..అప్పులు తెస్తున్నా ఖజానాలో పైసా లేదు


హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కారుకు ఆమ్దానీ వస్తున్నా, అప్పుల మీద అప్పులు తెస్తున్నా.. ప్రజల సంక్షేమ పథకాలకు మంజూరు చేయడానికి ఖజానాలో పైసా కూడా ఉంటలేదు. వచ్చే ఆదాయం, తెచ్చే అప్పులు మొత్తం కాంట్రాక్టర్ల పాత బకాయిలు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు కార్లు తదితర వాహనాల కొనుగోలు, అప్పులకు కిస్తీలు, మిత్తీలకే పోతున్నయి. ఆమ్దానీ మంచిగనే ఉన్నా ప్రజా సంక్షేమం కోసం ఖర్చుపెట్టడానికి డబ్బు లేని పరిస్థితి తలెత్తడానికి రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఆధ్వానంగా ఉండడమే ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా లాక్​డౌన్ టైంలోనూ రాష్ట్ర సర్కార్​కు రాబడి మంచిగనే వచ్చింది. మే, జూన్ రెండు నెలలు కలిపి దాదాపు రూ.16 వేల కోట్ల ట్యాక్స్ రెవెన్యూ వసూలైంది. మే నెలలో రూ.5,700 కోట్లు, జూన్​లో రూ.9 వేల కోట్లు వచ్చింది. అయినా సంక్షేమ పథకాలకు ఫండ్స్​ రిలీజ్ కావడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా టైంకు జీతాలు ఇచ్చేందుకు కూడా ఖాజానాలో పైసలకు కటకటే ఉంటోంది. ఇరిగేషన్​ ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు, ఇతర అనవసరపు వెహికల్స్​ ఖర్చులు, మెయింటెనెన్స్​చార్జీలతో పాటు ఇప్పటికే తీసుకున్న అప్పుల కిస్తీలు, వాటి మిత్తీలకే వచ్చే రాబడిలో సగం దాకా పోతోంది. దీంతోనే రాష్ట్ర రాబడి బాగానే ఉన్నప్పటికీ లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు పొందేందుకు ఎదురుచూడాల్సి వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం మూడు నెలల్లో రైతుబంధు, ఆసరా, ఇరిగేషన్ ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు పాత బకాయిల చెల్లింపులు, పల్లె, పట్టణ ప్రగతికి కొంత, ఆరోగ్య శాఖకు కొంత స్టేట్ షేర్ ఫండ్స్ తప్ప వేరే పథకాలకు ఖర్చు చేసింది చాలా తక్కువ.

బాగానే ట్యాక్స్​ వసూళ్లు

కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వం మే నెల 12వ తేదీన లాక్​డౌన్ పెట్టింది. ఉదయం నాలుగు గంటలు సడలింపులు ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులకు మరిన్ని సడలింపులు ఇచ్చింది. జూన్‌‌ 18న లాక్‌‌డౌన్‌‌ పూర్తిగా ఎత్తేసింది. అయితే ఒక్క జీఎస్టీ మాత్రమే రూ.1,500 కోట్లు తగ్గింది. ఇక మే నెలలో రిజిస్ట్రేషన్ల రాబడి తగ్గినా, జూన్ నెలలో అదీ సర్దుబాటు అయిపోయింది. మే నెలలో 28 వేల రిజిస్ట్రేషన్లతో రూ.138 కోట్ల ఇన్‌‌కం వస్తే ఆ తర్వాత అన్‌‌లాక్‌‌తో రిజిస్ట్రేషన్‌‌ ఆఫీసులకు ప్రజలు క్యూ కట్టారు. 93,466 రిజిస్ట్రేషన్ల జరగ్గా, రూ.630 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తంగా ఫస్ట్‌‌ క్వార్టర్‌‌లో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 1,350 కోట్ల రాబడి వచ్చింది. కరోనా ఉన్నా, లాక్‌‌డౌన్‌‌ అమల్లో ఉన్నా లిక్కర్‌‌ సేల్స్‌‌ తగ్గలేదు. లాక్‌‌డౌన్‌‌లో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే వైన్స్ ఓపెన్‌‌ చేశారు. అయినా సేల్స్‌‌పై ప్రభావం పడలేదు. ఈ క్వార్టర్​లో నెలకు రూ.1,000 కోట్ల చొప్పున  దాదాపు రూ. 3 వేల కోట్ల ఆదాయం ఎక్సైజ్ ద్వారానే సమకూరింది. ఇక సేల్స్ ట్యాక్స్ రూ.6,500 కోట్లు వచ్చింది. మే నెలలో రూ.5,700 కోట్ల ట్యాక్స్​ రెవెన్యూ వస్తే, జూన్​లో రూ.9 వేల కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో మొత్తంగా మూడు నెలల్లో ట్యాక్స్​ల ద్వారా వచ్చిన ఆదాయం రూ.23 వేల కోట్లు ఉంది. దీనికి తోడు ప్రభుత్వం ఈ మూడు నెలల్లోనే రూ.17 వేల కోట్ల అప్పులు చేసింది. అలాగే కేంద్రం గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.1300 కోట్లు ఇచ్చింది.

పథకాలకు పైసలియ్యలే.. 

రాష్ట్ర సొంత రాబడి, సెంట్రల్ గ్రాంట్ ఇన్ ఎయిడ్, అప్పులు కలుపుకుంటే మూడు నెలల్లో రూ. 41 వేల కోట్ల పైనే ప్రభుత్వానికి వచ్చాయి. అయితే ఇందులో నుంచి రైతుబంధు, ఆసరా, ఆరోగ్య శాఖకు స్టేట్ షేర్ కింద కరోనాలో భాగంగా కొంత ఇవ్వడమే తప్ప ఇతర వెల్ఫేర్ స్కీమ్స్​కు ఫండ్స్ ఇవ్వలేదు. ఇరిగేషన్ ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు పాత బకాయిలు, హుజూరాబాద్​కు, కిస్తీలు, మిత్తీలకే వేల కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటికీ కల్యాణ లక్ష్మి, స్కాలర్​షిప్స్​, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ స్కీంలకు పైసలియ్యలేదు. కొత్తగా డబుల్ బెడ్రూం ఇండ్లకూ ఒక్క పైసా ఇవ్వలేదు. జాగా ఉన్నోళ్లకు రూ.5 లక్షలు ఇస్తామన్న ప్రస్తావన కూడా లేదు. మొత్తం రూ.40 వేల కోట్లలో రైతుబంధు రూ.7,300 కోట్లు, ఆసరాకు నెలకు యావరేజీగా రూ.750 కోట్ల చొప్పున ఇచ్చారు. ఇక జీతభత్యాలు, పెన్షన్​లకు సగటున నెలకు రూ.3,500 వేల కోట్లు ఇస్తున్నరు. 

కిస్తీలు, మిత్తీలకే రూ.10 వేల కోట్లు 

రాష్ట్ర ప్రభుత్వం ఆరేండ్లలో చేసిన అప్పులు, వాటి కిస్తీలు, మిత్తీలకే ఈ మూడు నెలల్లో రూ.10 వేల కోట్లు కట్టింది. అప్పులు, వాటి మిత్తీలకే ప్రతి నెలా సగటున రూ. 3 వేల కోట్లు పోతున్నయి. ఇక ఖజానాలో మిగిలిన మొత్తాన్ని కాంట్రక్టర్లకు పాత బకాయిలు, హుజూరాబాద్​కు, ఇరిగేషన్​ప్రాజెక్టులకు ఇచ్చిండ్రు. అడిషనల్ కలెక్టర్లకు కొత్త వెహికల్స్, ఇతర అనవసర ఖర్చులు కూడా వీటికి తోడయ్యాయి. దీంతో ప్రతినెలా ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు కూడా సర్కార్​ తంటాలు పడాల్సి వస్తోంది. 

సర్కార్ తీరు మారాలే..

ముందు నుంచి కూడా అప్పులు, ఆర్థిక నిర్వహణపై సర్కార్ అవగాహన లేకుండా ఉంది. అందుకే ఇప్పుడు జీతాలు ఇచ్చేందుకు కూడా ఇబ్బందులు వస్తున్నాయి. అప్పులు, వడ్డీలకు వేల కోట్లు కడుతున్నారు. అప్పు కట్టేందుకు అప్పు చేసే పరిస్థితులు ఉన్నాయి. కరోనా పేరుతో ఇంకా అప్పులు పెంచుకుంటున్నారు. ఇంత చేస్తున్నా ప్రభుత్వ పథకాలకు ఏమైనా ఇస్తున్నారా అంటే అదీ లేదు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి. 
- దొంతి నర్సింహారెడ్డి, ఎక్స్ పర్ట్

చర్యలు తీస్కోవాలె... 

ఇంటర్ బోర్డు ఇప్పటివరకు ఒక్క ప్రైవేట్ కాలేజీకీ గుర్తింపు ఇవ్వకున్నా, అన్ని కాలేజీలు అడ్మిషన్లు తీసుకున్నాయి. కొన్ని ఆన్​లైన్ క్లాసులు కొనసాగిస్తుండగా, కొన్ని ఫిజికల్ క్లాసులు కూడా తీసుకుంటున్నాయి. అయినా బోర్డు అధికారులు ఆయా కాలేజీలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రూల్స్ పాటించని కాలేజీలపై చర్యలు తీసుకోవాలి. 
- మధుసూదన్​రెడ్డి, 
ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్