హుజూరాబాద్ ఫార్ములాపై టీఆర్​ఎస్ వెనకడుగు

హుజూరాబాద్ ఫార్ములాపై టీఆర్​ఎస్ వెనకడుగు
  • గట్టుప్పల్​ మండలం.. నేతన్న బీమాతో మళ్లీ బూమ్​రాంగ్
  • ఏం చేసినా రాజగోపాల్ ఖాతాలో చేరుతుందనే ఆందోళన
  • కొత్త స్కీమ్ లు ప్రకటించొద్దనే నిర్ణయానికి ప్రభుత్వ పెద్దలు
  • రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో  పాటే మునుగోడుకు నిధులు
  • బై ఎలక్షన్ వచ్చిన చోటే స్కీమ్ లు ఇస్తున్నారనే ప్రచారం నుంచి బయటపడే యత్నం


హైదరాబాద్, వెలుగు: బైఎలక్షన్ జరగనున్న మునుగోడు నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్కీమ్ లు, నిధులు ప్రకటించే  పరిస్థితి కనిపించడం లేదు. కొత్త స్కీమ్ ల జోలికి వెళ్లకుండా పాత స్కీమ్ లను పూర్తి స్థాయిలో అమలు చేయడం, అవసరమనుకున్న చోటే అభివృద్ధి పనులను చేయడం మంచిదనే అభిప్రాయానికి ప్రభుత్వ పెద్దలు వచ్చినట్లు తెలుస్తోంది. నిరుడు అక్టోబర్​లో జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఆ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, దళిత బంధు, ఇతర స్కీమ్ ల అమలు కోసం రూ.5 వేల కోట్ల వరకు ఖర్చు చేసినా అధికార పార్టీకి ఆశించిన ఫలితం రాని సంగతి తెలిసిందే. అంతేగాక ఇవన్నీ ఈటల రాజేందర్​ రాజీనామా వల్లే వచ్చాయనే ప్రచారం జరగడంతో టీఆర్ఎస్​ కు లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగింది. దీంతో అభివృద్ధి పేరిట హడావుడి చేసినా, దళిత బంధులాంటి భారీ బడ్జెట్ స్కీమ్ లు అమలు చేసినా ఫాయిదా ఉంటుందో లేదో అని టీఆర్​ఎస్ పెద్దలు పునరాలోచనలో పడినట్లు తెలిసింది. హుజురాబాద్ ఫార్ములా వర్క్ అవుట్ కాకపోవడంతో కొత్త స్ట్రాటజీ అమలు చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.

వేల కోట్లు ఖర్చు చేసినా..

హుజురాబాద్ ఎన్నికల్లో సర్కార్ నిధుల వరద పారిస్తే.. ఆ క్రెడిటంతా ఈటల ఖాతాలో పడిన సంగతి తెలిసిందే. ఈటల రాజీనామా చేయకపోతే తమకు దళిత బంధు, కొత్త పింఛన్లు, వడ్డీ లేని రుణాల వడ్డీ డబ్బులు, కమ్యూనిటీ హాళ్లు, రోడ్లు రాకపోయేవని చాలా చోట్ల ఓటర్లే బాహటంగా ప్రకటించారు. దీంతో అక్కడ వేల కోట్లు ఖర్చు చేసినా ప్రభుత్వానికి అనుకూలత రాకపోగా.. నెగెటివ్ పబ్లిసిటీ ఎక్కువైంది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాను కలవడం, ఆయన బీజేపీలో చేరుతారనే సంకేతాలు అందిన మరుసటి రోజే రాష్ట్ర ప్రభుత్వం గట్టుప్పల్​ను కొత్త మండలంగా ప్రకటించారు. ఎన్నో ఏండ్లుగా డిమాండ్ చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం.. కేవలం రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయబోతున్నారని తెలిసే మండలంగా ప్రకటించారనే చర్చ జనాల్లో ఉంది. అలాగే మునుగోడులో పెద్ద సంఖ్యలో ఉన్న పద్మశాలీల ఓట్ల కోసమే ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న నేతన్న బీమా పథకాన్ని ప్రారంభించారనే చర్చ కూడా జోరందుకుంది. దీంతో గట్టుప్పల మండల ఏర్పాటు, నేతన్న బీమా రాజగోపాల్ రెడ్డి ఖాతాలో పడినట్లయింది. అందుకే మునుగోడులోనూ హజురాబాద్ లాంటి అనుభవమే ఎదురవుతుందనే ఉద్దేశంతో వేల కోట్లు కుమ్మరించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

ఎమ్మెల్యేల రాజీనామాకు జనం పట్టు

బై ఎలక్షన్ వచ్చిన చోటే స్కీమ్ లు ఇస్తున్నారనే బద్నాం నుంచి బయటపడే యత్నం రాష్ట్రంలో కేసీ ఆర్ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చాక 4అసెంబ్లీ స్థానాలకు బై ఎలక్షన్స్ జరిగాయి. నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూర్ నగర్ లో, సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాకలో, నోముల నర్సింహాయ్య మరణంతో నాగార్జున సాగర్ లో, ఈటల రాజేందర్​ రాజీనామాతో హుజూరాబాద్​లో బై ఎలక్షన్స్ వచ్చాయి. ఇందులో 2స్థానాల్లో టీఆర్​ఎస్ గెలవగా, 2స్థానాల్లో బీజేపీ గెలిచింది. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చే ముందు కేసీఆర్​ ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ఈ ఉప ఎన్నికలు జరిగిన నియోజకవర్గాలకు ఎక్కువ నిధులు ఇచ్చారని, కొత్త పింఛన్లు కూడా ఆ నియోజకవర్గాలకు మాత్రమే మంజూరు చేశారనే ప్రచారం ప్రభుత్వంపై ఉంది. దీంతో కేవలం బై ఎలక్షన్ వస్తే తప్ప తమ నియోజకవర్గం అభివృద్ధి కాదని, సంక్షేమ పథకాలు అమలు కావనే ఉద్దేశంతో చాలా చోట్ల ఎమ్మెల్యేల రాజీనామాలకు జనం పట్టుబట్టడం అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఒత్తిడికి గురి చేస్తోంది. దీంతో ఈ ప్రచారం నుంచి బయటపడేందుకు కేసీఆర్ పెండింగ్​లో ఉన్న హామీలను అమ లు చేసేందుకు నిర్ణయించారు. అందులో భాగంగానే 10 లక్షల ఆసరా పింఛన్లను పంద్రాగస్టు సందర్భంగా ఇస్తామని ప్రకటించడం, 7వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటున్నట్లు తెలిసింది.

హుజూరాబాద్ నేర్పిన పాఠం 

స్కీమ్ ల పేరిట డబ్బులు ఆశచూపినా, ఓట్లకు నోట్లు పంచినా గెలవడం అంత ఈజీ కాదని హుజురాబాద్ ఎన్నికలు నేర్పిన పాఠంతో అధికార పార్టీ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఆ ఎన్నికల సందర్భంగా ‘సీఎం ఇంట్లో నుంచి ఇస్తుండా.. మా పైసలు మాకిస్తుండు’ అని ఓటర్ చూపిన చైతన్యం మునుగోడులోనూ రిపీటైతే ఎన్ని‌‌‌‌ కోట్లు పంచినా ఫాయిదా ఉండదని భావిస్తున్నట్లు సమాచారం.‌‌