ఇండియా కూటమిలో ఐక్యత లేదు : కిషన్​రెడ్డి

ఇండియా కూటమిలో ఐక్యత లేదు :   కిషన్​రెడ్డి

ముషీరాబాద్, వెలుగు: ఐక్యత లేని ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. మూడు నెలలకో ప్రధాని మారుతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ కు కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు. గురువారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో కిషన్ రెడ్డి జీప్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కూడా కాలేదని, అప్పుడే బ్లాక్ మెయిలింగ్ మెదలు పెట్టిందని మండిపడ్డారు. కాంగ్రెస్​నేతలు రియల్టర్లు, బిల్డర్లు, కాంట్రాక్టర్లను బెదిరించి ప్రైవేట్​ట్యాక్స్​వసూలు వసూలు చేసి రాహుల్ గాంధీకి పంపిస్తున్నారని ఇదేనా కాంగ్రెస్ తీసుకొచ్చిన మార్పు అని ప్రశ్నించారు. స్థిరమైన కేంద్ర ప్రభుత్వం, సమర్థ నాయకత్వం నరేంద్ర మోదీతోనే సాధ్యమని, దేశమంతా ఇదే విశ్వసిస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని మెజార్టీ ఎంపీ స్థానాలను  బీజేపీ గెలవబోతుందన్నారు. సికింద్రాబాద్ నుంచి తనను మరోసారి ఎంపీ చేయాలని కోరారు. ఆయన వెంట నాయకులు రమేష్ రామ్, పావని వినయ్ కుమార్, రచనశ్రీ, రత్న సాయిచంద్, ఆనంద్ తదితరులు ఉన్నారు.