ఆసియా ఖండంలో షాపింగ్ మాల్స్ కేవలం షాపింగ్ కోసం మాత్రమే కాదు, వినోదానికి కూడా పెద్ద కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఇరాన్ మాల్ దాదాపు 21 మిలియన్ చదరపు అడుగుల వైశాల్యంతో ఆసియాలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్‌గా మొదటి స్థానంలో నిలిచింది. తరువాత మలేషియాలోని ఐఓఐ సిటీ మాల్ రెండవ స్థానంలో ఉండగా... చైనాలోని న్యూ సౌత్ చైనా మాల్, ఇరాన్‌లోని ఇస్ఫహాన్ సిటీ సెంటర్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. టాప్ 10 మాల్స్‌లో మూడు మాల్స్ థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ దాని పరిసర ప్రాంతాలలోనే ఉన్నాయి. ఈ పెద్ద పెద్ద మాల్స్‌లో స్టోర్స్ తో పాటు ఐస్ స్కేటింగ్ రింక్‌లు, ఇండోర్ థీమ్ పార్కులు, హోటళ్లు, మ్యూజియంలు, హైకింగ్ ట్రాక్స్ వంటి ఎన్నో రకాల వసతులు ఉన్నాయి.
1. ఇరాన్ మాల్
టెహ్రాన్ నగరానికి North-West దిశలో ఉన్న ఈ మాల్ ప్రపంచంలోనే అత్యంత పెద్దది. ఇక్కడ షాపింగ్ దుకాణాలతో పాటు స్విమ్మింగ్ పూల్, ఐస్ స్కేటింగ్ రింక్, ఫైవ్ స్టార్ హోటల్, టెన్నిస్ కోర్టు ఉన్నాయి. అంతేకాదు, బిల్డింగ్ పైకప్పు మీద వాకింగ్, సైక్లింగ్ చేసుకునేందుకు ప్రత్యేక మార్గాలు ఉన్నాయి. ఇక్కడికి వస్తే రోజంతా బోర్ కొట్టకుండా గడపవచ్చు. దీని వైశాల్యం 1,950,000 చదరపు మీటర్లు.
2. మలేషియా ఐఓఐ సిటీ మాల్
మలేషియాలోని పుత్రజయ నగరంలో ఉన్న ఈ మాల్ ఆసియాలో రెండవ అతిపెద్దది. 2014లో మొదలైన ఈ మాల్‌ను 2022లో మరింత విస్తరించడంతో దీని సైజ్ డబుల్ అయింది. ఇందులో దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన సుమారు 650 దుకాణాలు ఉన్నాయి. అలాగే ఒలింపిక్ సైజ్ అంత పెద్దవైన రెండు ఐస్ స్కేటింగ్ రింక్‌లు ఇక్కడి ముఖ్య ఆకర్షణ. దీని వైశాల్యం 8,21,000 చదరపు మీటర్లు.
3. న్యూ సౌత్ చైనా మాల్
చైనాలోని డాంగ్‌గువాన్‌లో ఉన్న ఈ మాల్ ఆసియాలో మూడవ స్థానంలో ఉంది. 2005లో ఇది ప్రారంభమైన కొత్తలో చాలా ఏళ్ల పాటు దుకాణాలు ఏవీ రాక ఖాళీగా పడి ఉంది. దాంతో దీనిని "దెయ్యాల మాల్" అని కూడా పిలిచేవారు. 2010 తర్వాత కొత్త యాజమాన్యం వచ్చి దుకాణాలను పెంచినప్పటికీ, ఇప్పటికీ ఈ మాల్‌లోని కొన్ని భాగాలు ఖాళీగానే కనిపిస్తాయి. దీని వైశాల్యం 6,59,612 చదరపు మీటర్లు.
4. ఇస్ఫహాన్ సిటీ సెంటర్
2012లో ప్రారంభమైన ఈ మాల్ ఇరాన్‌లోని ప్రముఖ పర్యాటక నగరమైన ఇస్ఫహాన్ శివార్లలో ఉంది. ఈ పెద్ద కాంప్లెక్స్‌లో షాపింగ్ మాల్‌తో పాటు ఒక మ్యూజియం, రోలర్ కోస్టర్లతో ఇండోర్ థీమ్ పార్క్, ఇంకా ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఉన్నాయి.
5. SM మాల్ ఆఫ్ ఆసియా
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా సమీపంలోని పసాయ్ నగరంలో ఈ మాల్ ఉంది. 2006లో ప్రారంభమైన ఈ మాల్‌కు ప్రతిరోజూ దాదాపు 2 లక్షల మంది వస్తుంటారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే మాల్స్‌లో ఇది ఒకటి. ఇక్కడ ఐమాక్స్ థియేటర్, స్పానిష్ నౌకల చరిత్ర తెలిపే మ్యూజియం, ఐస్ స్కేటింగ్ రింక్ ఉన్నాయి. ఇది సముద్ర తీరానికి ఆనుకుని ఉండటం వల్ల ఇక్కడి వాతావరణం చాలా బాగుంటుంది. దీని వైశాల్యం 5,89,891 చదరపు మీటర్లు.
6. SM టియాంజిన్
చైనాలోని టియాంజిన్ ఎయిర్‌పోర్ట్ ప్రాంతంలో 2016లో దీనిని ప్రారంభించారు. ఇందులో దాదాపు 2,500 దుకాణాలు ఉన్నాయి. ఈ మాల్‌ను చైనా సాంప్రదాయ నమ్మకాల ప్రకారం ఐదు తత్వాల అంటే భూమి, అగ్ని, నీరు, లోహం, చెక్క వంటి పేర్లతో ఐదు ప్రత్యేక బిల్డింగులుగా నిర్మించారు. ఉత్తర చైనాలోనే ఇది ఒక పెద్ద వ్యాపార కేంద్రంగా నిలిచింది. దీని వైశాల్యం 5,65,000 చదరపు మీటర్లు.
7. ది గోల్డెన్ రిసోర్సెస్ మాల్
చైనా రాజధాని బీజింగ్‌లో ఉన్న ఈ మాల్ 6 అంతస్తులతో నిర్మించారు. 2004లో ప్రారంభమైన ఈ బిల్డింగ్ ఎంట్రీ ద్వారం 206 అడుగుల ఎత్తుతో చాలా వెరైటీగా ఉంటుంది. ఇది బీజింగ్ సబ్‌వే (మెట్రో రైలు) వ్యవస్థకు కనెక్ట్ అయ్యి ఉండటం వల్ల గత ఇరవై ఏళ్లుగా ఇక్కడికి వచ్చే జనాల సంఖ్య బాగా పెరుగుతోంది. దీని వైశాల్యం 5,57,419 చదరపు మీటర్లు.
8. సెంట్రల్ వెస్ట్‌గేట్
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ నగరానికి బయట ఉన్న నొంతబురి ప్రాంతంలో 2015లో ఈ మాల్‌ను నిర్మించారు. సిటీకి దూరంగా ఉండే ప్రజల కోసం దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇందులో వందలాది అంతర్జాతీయ బ్రాండ్ల దుకాణాలతో పాటు 200 కంటే ఎక్కువ హోటళ్లు, ఫుడ్ కోర్టులు ఉన్నాయి. దీని వైశాల్యం 5,50,278 చదరపు మీటర్లు.
9. సెంట్రల్ వరల్డ్
బ్యాంకాక్ సిటీ నడిబొడ్డున ఉన్న ఈ మాల్ 1990లోనే 'వరల్డ్ ట్రేడ్ సెంటర్' పేరుతో మొదలైంది. ఆ తర్వాత 2005లో దీని పేరును 'సెంట్రల్ వరల్డ్'గా మార్చారు. ఈ కాంప్లెక్స్‌లో పెద్ద పెద్ద ఆఫీసులు, ఒక లగ్జరీ హోటల్ కూడా ఉంది. ఈ మాల్ ముందున్న ఖాళీ స్థలం నగరంలోనే అతిపెద్ద బహిరంగ వేదిక. ప్రతి ఏడాది ఇక్కడే బ్యాంకాక్ న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుగుతాయి. దీని వైశాల్యం 5,50,000 చదరపు మీటర్లు.
10. ఐకాన్‌సియామ్
బ్యాంకాక్‌లోని ఫెమస్ 'చావో ఫ్రాయా' నది ఒడ్డున 2018లో ఈ మాల్‌ను ప్రారంభించారు. నది పక్కనే ఉండటం వల్ల ఇక్కడి వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. థాయ్‌లాండ్‌లోనే మొట్టమొదటి యాపిల్ స్టోర్ ఇక్కడే ఏర్పాటయింది. నదిలో బోట్ల మీద అమ్మే మార్కెట్ లాగ ఇక్కడ ఒక పెద్ద ఫుడ్ కోర్టును, ఒక మ్యూజియంను నిర్మించారు. దీని వైశాల్యం 5,25,000 చదరపు మీటర్లు.
