మనం ఏదైనా ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా ఆరోగ్యం బాగోలేనప్పుడు కొన్ని రకాల ఫుడ్స్ తినాలనుకుంటుంటాం... జ్వరం వచ్చినప్పుడు వేడివేడి కిచిడీ, అలసిపోయినప్పుడు పెరుగు అన్నం లేదా పప్పు అన్నం.. ఇవి కేవలం అలవాట్లు మాత్రమే కాదు. మన శరీరం దానికంతట అదే నయం చేసుకోవడానికి అడిగే 'నేచురల్ మెడిసిన్'. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలను ఇప్పుడు చూద్దాం...
1. కిచిడీ
కిచిడీ చూడటానికి చాలా సాధారణంగా అనిపించవచ్చు, కానీ ఇది శరీరానికి అమితమైన శక్తిని ఇస్తుంది. బియ్యం శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. పప్పు ద్వారా ప్రోటీన్ ఇంకా ఫైబర్ అందుతాయి ఇంకా సులభంగా జీర్ణం అవుతుంది. ఒత్తిడి లేదా అనారోగ్యం వల్ల మన జీర్ణవ్యవస్థ నెమ్మదిస్తుంది. నూనె, మసాలా ఉన్న భోజనం అరగడానికి ఎక్కువ శక్తి కావాలి, కానీ కిచిడీ చాలా తేలికగా అరిగిపోతుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.
2. డార్క్ చాక్లెట్
ఇక్కడ మాట్లాడుకునేది సాధారణ స్వీట్ చాక్లెట్ గురించి కాదు, కోకో (Cocoa) ఎక్కువగా ఉండే డార్క్ చాక్లెట్ గురించి. ఇందులో ఉండే 'ఫ్లేవనాయిడ్లు' రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి ఇంకా ఒత్తిడిని కలిగించే హార్మోన్లను తగ్గిస్తాయి. భోజనం తర్వాత ఒక చిన్న డార్క్ చాక్లెట్ ముక్క తింటే, అది మీ మూడ్ ని మెరుగుపరుస్తుంది.
3. పెరుగు అన్నం
పెరుగు అన్నం తిన్న తర్వాత మనకు కలిగే ఆ తృప్తి వెనుక ఒక పెద్ద సైన్స్ ఉంది. పెరుగులో ఉండే 'ప్రోబయోటిక్స్' మన కడుపులోని సూక్ష్మజీవుల వ్యవస్థను కాపాడతాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, మంచి నిద్రకు కూడా తోడ్పడుతుంది. మన కడుపు ఇంకా మెదడు నిరంతరం మాట్లాడుకుంటూ ఉంటాయి. కడుపు చల్లగా, ప్రశాంతంగా ఉంటే.. మెదడు కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది. అందుకే పెరుగు అన్నం తిన్న తర్వాత మనం అంత రిలాక్స్‌గా ఫీల్ అవుతాం.
అసలు సమస్య ఏంటంటే మనం తినే 'కంఫర్ట్ ఫుడ్' కాదు. సమస్య అంతా అతిగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలతోనే. బయట దొరికే జంక్ ఫుడ్ కంటే, ఇంట్లో వండుకునే ఇలాంటి సంప్రదాయ ఆహారాలు మన శరీరాన్ని లోపల నుండి నయం చేస్తాయి. తక్కువ పరిమాణంలో నాణ్యమైన ఆహారం తీసుకోవడం వల్ల ఆనందంతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది.
