దళితుల బోనాలను గుడిలోకి తేనివ్వలే... సిద్దిపేట జిల్లాలో ఘటన

దళితుల బోనాలను గుడిలోకి తేనివ్వలే... సిద్దిపేట జిల్లాలో ఘటన
  • ఆలయానికి దూరంగా బోనాలు సమర్పించి వెళ్లిన దళితులు
  • సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం అనంతసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఘటన

సిద్దిపేట, వెలుగు : బోనాలతో వచ్చిన దళితులను ఆలయ ప్రవేశం చేయకుండా అడ్డుకోవడంతో.. వారు గుడికి దూరంగా బోనాలు సమర్పించి వెళ్లారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం అనంతసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రామంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... అనంతసాగర్ గ్రామంలో రెండు రోజుల క్రితం పోచమ్మ, పెద్దమ్మ, దుర్గమ్మ పండుగలు నిర్వహించారు.

ఈ క్రమంలో బుధవారం రాత్రి దళితులు బోనాలు తీసుకొని దుర్గమ్మ ఆలయం వద్దకు వచ్చారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత గుడిలోకి రావొద్దని కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. గ్రామంలో జరిగే పండుగలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటున్నా దళితులమనే కారణతో తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించడంతో ఇరు వర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.

కొందరు గ్రామ పెద్దలు కుల వివక్ష చూపుతూ దళిత కుటుంబాలకు చెందిన వారిని అడ్డుకున్నారని ఆరోపించారు. తర్వాత దళితులంతా ఆలయానికి కొద్ది దూరంలో బోనాలను సమర్పించి వెళ్లిపోయారు. కుల వివక్ష చూపుతూ దళితులు ఆలయంలోకి రాకుండా అడ్డుకున్న ఘటనపై గ్రామానికి చెందిన దబ్బెట నితీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురువారం జగదేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గ్రామానికి చెందిన  నలుగురు వ్యక్తులు దళితులను అడ్డుకున్నారని, వారికి మరికొందరు మద్దతిచ్చారని వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. దళితులను బోనాలతో ఆలయంలోకి అనుమతించకపోవడం రాజ్యాంగ, మానవహక్కుల ఉల్లంఘనేనని, దీనిపై కఠినచర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.