ఎయిర్ ప్రొటీన్.. ఈ పదం ఎప్పుడైనా విన్నారా? గాలి నుంచి మాంసం తయారుచేసే కంపెనీ పేరు అది. గాలి నుంచి మాంసం ఏంటనేగా డౌట్. ఇది చదివేయండి.
మాంసంలో ఇప్పుడు కొత్తరకాలు పుట్టుకొచ్చాయి. జంతువులను చంపకుండా మాంసాన్ని తయారుచేసే ‘ప్లాంట్ బేస్డ్ మీట్’ అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మొక్కలను కూడా తుంచకుండా గాలి నుంచి ప్రొటీన్ తయారుచేసే పద్ధతిని కనిపెట్టారు.
గాలిలో ఉండే తేమ, మైక్రో బాక్టీరియాను ఉపయోగించి కార్బన్ డయాక్సైడ్‌ను అమైనో యాసిడ్స్‌గా మారుస్తారు. దాన్నుంచి ప్రొటీన్స్‌తో నిండిన మాంసం తయారు చేస్తారు.కాలిఫోర్నియాలోని ఎయిర్ ప్రొటీన్ కంపెనీ గాలి నుంచి మాంసాన్ని తయారుచేస్తోంది. “మనం గాలి పీలుస్తున్నాం. కానీ, గాలిలో మారువేషంలో దాగి ఉన్న ప్రొటీన్స్‌ను అలాగే వదిలేస్తున్నాం. వాటిని సరిగ్గా వాడుకుంటే ఫుడ్‌కు కొదవే ఉండదు” అని ఎయిర్ ప్రొటీన్ సీఈవో లిసా డైసన్ అంటోంది. స్పేస్‌లోకి వెళ్లే ఆస్ట్రోనాట్లు వాళ్ల ఫుడ్ వాళ్లే తయారుచేసుకోవడం కుదురుతుందా అనే విషయంపై 1960లో నాసా ఒక రీసెర్చ్ చేసింది. దాన్నుంచి ఇన్‌స్పైర్ అయ్యి ఈ పద్ధతిని కనిపెట్టామని లిసా చెప్తోంది.
