సోలార్ ఎనర్జీ.. సంప్రదాయ విద్యుత్ వినియోగానికి ప్రత్యామ్నాయంగా.. సూర్యరశ్మి నుంచి శక్తిని గ్రహించి కరెంటు తయారు చేయడం. ఈ టెక్నాలజీ ఇప్పుడు ఊపందుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీలో భాగంగా సోలర్ విద్యుదుత్పత్తి భారీ ఎత్తున జరుగుతోంది. సోలార్ ప్యానెళ్ల ఉత్పత్తి ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు పోటీ పడి విద్యుదుత్పత్తి చేస్తున్నాయి.
అయితే సోలార్ ఎనర్జీని ఒడిసి పట్టడంలో కొన్ని సవాళ్లు ఉన్న విషయం తెలిసిందే. సూర్యరశ్మి ఉంటేనే విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. రాత్రుల్లో ఎలాగూ ఉండదు. దీనికి తోడు వర్షా కాలంలో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి. వాతావరణం మేఘావృతం అయినప్పుడు కూడా కరెంటు ప్రొడక్షన్ ఆగిపోతుంది. లేదా చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. దీన్ని అధిగమించేందుకు చేసిన ప్రయత్నంలో అద్భుతమైన విజయం సాధించారు సైంటిస్టులు. వర్షంలో కూడా సోలార్ విద్యుత్ తయారు చేసేలా సోలాన్ ప్యానెళ్లను తయారు చేయడం ఈ రంగంలో మరోముందడుగు పడినట్లైంది.
అధిక సామర్థ్యం గల పెరోవ్ స్కైట్ సోలార్ సెల్స్, ట్రైబోఎలక్ట్రిక్ నానోజెనరేటర్ టెక్నాలజీ ద్వారా వర్షం వస్తున్నప్పుడు.. వర్షపు చినుకుల గతిశక్తిని వినియోగించి శక్తిని శోషించుకునేలా సోలార్ పరికరాలను తయారు చేశారు.
ఒక్క చినుకు నుంచి ఎంత కరెంటు..
ఈ పరికరంపై 100 నానో మీటర్ల పలుచనైన ఉపరితలంలో.. ఒక్క వానచుక్క నుంచి 110 వోల్టుల శక్తిని ఒడిసి పట్టుకునే విధంగా ఫోటోవోల్టాయిక్ సర్ఫేస్ ఉంటుంది. దీనిలోకి నీళ్లు వెళ్లకుండా కేవలం వాన చినుకులలోని శక్తిని శోషించుకునేలా తయారు చేశారు. అంటే ఇది వాతావరణంతో సంబంధం లేకుండా.. ఏ పరిస్థితుల్లోనైనా ఎనర్జీని గ్రహించేలా తయారు చేశారు. అంటే ఎండ ఉన్నప్పుడు ఎండనుంచి.. వర్షం వస్తే వాన చినుకుల నుంచి శక్తిని శోషించి.. విద్యుత్ ఉత్పత్తికి తోడ్పడుతుంది.
దీని వలన గ్రిడ్ స్థిరంగా ఉండేందుకు తోడ్పడుతుంది. అంటే చీకట్లో లేదా వర్షం సమయంలో కరెంటు సరఫరా లేకపోవడం కారణంగా.. గ్రిడ్ లో వచ్చే సమస్యలను అధిగమించేందుకు తోడ్పడుతుంది. అంటే నిరంతరాయంగా, అన్ని సీజన్ లలో విద్యుత్ ఉత్పత్తికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది.
వాన చినుకులు ఇద్యుత్ ఎలా ఉత్పత్తి చేస్తాయి..?
సోలార్ విద్యుత్ లో మొదటి నుంచి ఉన్న పద్ధతి.. బాగా ఎండ ఉన్నప్పుడు, నీలి ఆకాశం ఉన్నపుడు మాత్రమే కరెంటు ఉత్పత్తి జరుగుతూఉండేంది. కానీ ప్రస్తుత టెక్నాలజీ ప్రకారం.. హైబ్రిడ్ పద్ధతిలో కరెంటును ఉత్పత్తి చేస్తారు. ట్రైబో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ పద్ధతిలో రాలుతున్న వర్షంపు చినుకుల నుంచి శక్తిని ఒడిసిపట్టి కరెంటు తయారు చేస్తారు. అలా శక్తిని శోషించుకునే ప్రత్యేక వ్యవస్థను తయారు చేశారు.
ప్రతి చుక్క పడినప్పుడు.. ప్యానెల్ పైన విద్యుత్ ఆవేశం పుడుతుంది. ఆ ఆవేశాన్ని ప్రత్యేక పరికరం శోషించుకుంటుంది. సంప్రదాయ బ్యాటరీలపైన ఆధార పడకుండా ఈ టెక్నాలజీ తోడ్పడుతుందని యూరోపియన్ రీసెర్చ్ కౌన్సిల్ (ERC) పేర్కొంది.

