- అనేక చోట్ల 45 నుంచి 48 డిగ్రీల టెంపరేచర్లు
- మహారాష్ట్రలోని విదర్భ కుతకుత
- తెలంగాణలో 20 జిల్లాల్లో 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత
- నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 46.5 డిగ్రీలు.. ఈ సీజన్లోనే రికార్డ్ టెంపరేచర్
- రాష్ట్రంలో మరో మూడు నాలుగు రోజులు ఇదే పరిస్థితి అంటున్న ఐఎండీ
సెంట్రల్ డెస్క్/హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో ఈసారి వేసవి భీకర ప్రతాపం చూపుతోంది. ఉత్తర భారత్ నుంచి మధ్య భారత్ వరకు, విదర్భ నుంచి రాయలసీమ వరకు ఉష్ణోగ్రతలు రోజురోజుకూ రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్రలాంటి పలు రాష్ట్రాలు తీవ్రమైన వడగాడ్పుల గుప్పిట్లో చిక్కుకున్నాయి. యూపీలోని బాందా జిల్లాలో అత్యధికంగా 48.2 డిగ్రీల సెల్సియస్ ల వరకూ టెంపరేచర్ రికార్డ్ అయింది. పొద్దున పది దాటితే ఎవరూ బయటకు రాకపోవడంతో బాందా సిటీ పగలంతా దాదాపు షట్ డౌన్ అయినట్టు కనిపిస్తోంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ 45 నుంచి 48 డిగ్రీలలోపు టెంపరేచర్లు నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆయా ప్రాంతాలకు వరుసగా హీట్‌వేవ్, సివియర్ హీట్‌వేవ్ అలర్ట్‌లను జారీ చేస్తోంది. ఎండల తీవ్రతతో తెలంగాణ కూడా అగ్ని గుండంలా మారింది. మొన్నటిదాకా ఉత్తర తెలంగాణ జిల్లాలకే పరిమితమైన ఎండల సెగ.. ఇప్పుడు రాష్ట్రమంతటికీ పాకింది. బుధవారం 20 జిల్లాలు రెడ్‌జోన్‌లోకి వెళ్లాయి. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో అత్యధికంగా 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
దేశవ్యాప్తంగా గతంతో పోలిస్తే ఈసారి ఎండలు, వేడి తీవ్రత అత్యధికంగా పెరగడానికి ప్రధానంగా ప్రపంచ, స్థానిక పరిస్థితులే కారణమని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. పసిఫిక్ సముద్రంలో ఎల్ నినో ఏర్పడటం, వాతావరణ మార్పులతోపాటు స్థానికంగా ఆయా ప్రాంతాల్లో చెట్ల నరికివేత, పర్యావరణ విధ్వంసం, టౌన్లు కాంక్రీట్ జంగల్స్‌గా మారడంతో వేడి తీవ్రత పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు. ఐఎండీ అంచనాల ప్రకారం ఈసారి హీట్‌వేవ్స్ ప్రభావం ఉత్తర పశ్చిమ భారత్(ఢిల్లీ, రాజస్తాన్, పంజాబ్, హర్యానా), మధ్య భారత్ (మధ్యప్రదేశ్, విదర్భ), తూర్పు భారత్ (ఒడిశా, జార్ఖండ్), దక్షిణ తూర్పు ద్వీపకల్ప ప్రాంతాల(ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని భాగాలు)లో ఎక్కువగా ఉంటోంది.
ఉత్తరప్రదేశ్‌లోని బాందా జిల్లా 48.2 డిగ్రీలతో రాష్ట్రం లోనే అత్యంత వేడి ప్రాంతంగా నిలిచింది. రాష్ట్రంలోని 75 జిల్లాలలో 22 జిల్లాల పరిధిలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటేశాయని వాతావరణ శాఖ తెలిపింది. ఝాన్సీ, ఆగ్రా సిటీల్లో 46.5 డిగ్రీలు, ప్రయాగ్‌రాజ్‌లో 45.8 డిగ్రీలు, లక్నోలో 40.9 డిగ్రీల వేడి నమోదైంది. దక్షిణ ఉత్తరప్రదేశ్‌లో రాబోయే రోజుల్లో వడగాల్పులు మరింత తీవ్రం కానున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పంజాబ్, హర్యానా రాష్ట్రాలలోనూ ఎండలు దంచికొడుతున్నాయి. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో 47.3 డిగ్రీలు, హర్యానాలోని రోహ్‌తక్‌లో 46.9 డిగ్రీలు, నార్నాల్‌లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఢిల్లీలో పొడి గాలులు, మండుటెండల వల్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. థార్ ఎడారి, పాకిస్తాన్ పరిసరాల నుంచి వీస్తున్న గాలుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. తీవ్రమైన వడగాల్పుల మధ్య ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిసర ప్రాంతాలలో గాలి నాణ్యత 'కనిష్ట' (పూర్) స్థాయికి పడిపోవడంతో ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ కమిషన్ ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో మంగళవారం నుంచి 'జీఆర్ఏపీ1' ఆంక్షలను విధించింది. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం అత్యంత వేడిగాలులతో మండిపోతోంది. అమరావతి, వార్ధా, అకోలా, నాగ్‌పూర్, యవత్‌మాల్ వంటి నగరాలు టాప్ హాట్‌స్పాట్స్‌గా మారాయి. అమరావతిలో 46.8 డిగ్రీలు, వార్ధాలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ 45 నుంచి 46 డిగ్రీల టెంపరేచర్లు నమోదవుతున్నాయి.
బాందా షట్ డౌన్.. రాత్రివేళల్లో పొలం పనులు
నిరంతరాయంగా నమోదవుతున్న రికార్డు ఉష్ణోగ్రతలు బాందా జిల్లాను దేశంలోనే అత్యంత తీవ్రమైన వేడి ప్రాంతాల సరసన నిలబెట్టాయి. ఇంతకుముందు రాజస్థాన్‌లోని చురు, జైసల్మేర్ ప్రాంతాల్లో అత్యధికంగా వేడి నమోదవుతుండేది. ఎండల తీవ్రతతో ప్రతిరోజూ ఉదయం 10 గంటలకే బాందా నగరం పూర్తిగా మూతబడుతోంది. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా బాందా మొత్తం షట్ డౌన్ అయినట్టు కనిపిస్తోంది. చివరకు సాయంత్రం పొద్దుగూకిన తర్వాత గానీ జనం రోడ్లపైకి రావడంలేదు. బాందాలో ఏప్రిల్ 27న 47.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ రోజు దేశంలోనే ఇది అత్యధికం.1951 తర్వాత ఇక్కడ నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత కూడా ఇదే. మంగళవారం బాందాలో మళ్లీ 48.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై దేశంలోనే అత్యంత వేడి ప్రాంతంగా కొత్త రికార్డు సృష్టించింది. ఇక పగటిపూట ఎండలో పనిచేయడం అసాధ్యం కావడంతో, రైతులు రాత్రి వేళల్లో ఎల్‌ఈడీ లైట్ల వెలుతురులో పొలం పనులు చేస్తున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 మధ్య పనిచేయడానికి నిరాకరిస్తూ, కార్మికులు తమ రోజువారీ వేతనాల్లో 40 శాతం వరకు నష్టపోవడానికి కూడా సిద్ధపడుతున్నారని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.
ఉత్తర, మధ్య భారత్‌లో ఎండలు..
దక్షిణాదిన వర్షాలు
ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల్లో బుధవారం తీవ్రమైన ఎండలు, వడగాడ్పులు కొన సాగాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాలలో రాత్రి వేళల్లో కూడా వేడి వాతావరణం ఉం టుందని హెచ్చరిస్తూ ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించిం ది. రాబోయే రెండు రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, నైరుతి బీహార్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కోస్తా ఆంధ్రా, యానాం, మరఠ్వాడా, ఒడిశా ప్రాంతాలలో వడగాల్పుల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని లిపింది. మరోవైపు అండమాన్ నికోబార్ దీవులు, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, కేరళ, మాహే, లక్షద్వీప్ ప్రాంతాలలో గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, గంగా నదీ పరివాహక పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా ప్రాంతాలలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ప్రపంచ వాతావరణం, స్థానిక సమస్యలు..
దేశంలో వేడి తీవ్రంగా పెరగడానికి ప్రపంచ వాతావర ణ మార్పులతోపాటు స్థానిక సమస్యలూ కారణమవు తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే, పసిఫిక్ మహాసముద్రంలో 'ఎల్ నినో' పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మే నుంచి జులై మధ్య ఇది మరింత బలపడే అవకాశం ఉంది. దీనివల్ల భారత ఉపఖండంలో తేమ తగ్గి, ముందస్తు వేసవి తాపం పెరుగుతుంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల వర్షపాతం సాధారణం కంటే తక్కువగా (92 శాతం మాత్రమే) నమోదవుతుందని ఐఎండీ అంచనా వేయడానికి ఎల్ నినోనే ప్రధాన కారణం. స్థానిక కారణాల విషయానికి వస్తే.. సుదీర్ఘ పొడి వాతావరణం, మేఘాలు లేకపోవడం వల్ల ఎండలు ముదురుతున్నాయి. నగరాల్లో కాంక్రీట్ భవనాలు, వాహనాలు, ఏసీలు, పరిశ్రమల వల్ల వేడి ఎక్కువగా ఉంటోంది. గ్రామీణ ప్రాంతాలలో అడవుల మంటలు, చెట్లు లేని ఖాళీ భూములు వేడిని పెంచుతున్నాయి.
రాత్రి వేళల్లో సెగలు.. పెరుగుతున్న ముప్పు
వేసవి తీవ్రత అనగానే సాధారణంగా అందరికీ గుర్తొచ్చేది మండుటెండలు, మధ్యాహ్నపు ఉష్ణోగ్రతలు మాత్రమే. కానీ, నిజమైన ఆరోగ్య ముప్పు సూర్యాస్తమయం తర్వాతే మొదలవుతోందని నిపుణులు ఇప్పుడు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. పగటిపూట ఎండతో పోలిస్తే, రాత్రి వేళల్లో పెరిగే ఈ వేడి వల్ల మానవ శరీరం కోలుకోవడానికి అసలు సమయమే దొరకడం లేదు. రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడం, గాలిలో తేమ శాతం ఎక్కువ కావడం, నగరాల్లో కాంక్రీట్ కట్టడాల వల్ల గుండె జబ్బులు, డీహైడ్రేషన్, నిద్రలేమి, ప్రాణనష్టం వంటి ముప్పులు నిశ్శబ్దంగా పెరుగుతున్నాయని వైద్యులు, వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు. గతంలో రాత్రి వేళల్లో వాతావరణం చల్లబడటం వల్ల పగటిపూట ఎండకు గురైన మానవ శరీరం తన ఉష్ణోగ్రతను సమతూకంలోకి తెచ్చుకునేది. కానీ, ప్రస్తుత వడగాడ్పుల వల్ల, ముఖ్యంగా నగరాలలో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయిలోనే ఉంటున్నాయి. ఈ నిరంతర వేడి శరీరంపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోంది. పగలు, రాత్రి తేడా లేకుండా సుదీర్ఘ కాలం పాటు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల గుండె, శ్వాసకోశ, కిడ్నీ, మధుమేహం వంటి వ్యాధులు మరింత తీవ్రమవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. మరోవైపు తీవ్ర ఎండలతో దేశంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. మంగళవారం దేశ పీక్ పవర్ డిమాండ్ 260.5 గిగావాట్లకు చేరి ఆల్‌టైమ్ రికార్డ్ నమోదు చేసింది.
నిపుణుల హెచ్చరికలు ఇవే..
ఇకపై హీట్‌వేవ్‌లు అప్పుడప్పుడూ వచ్చే పరిస్థితులు కావని, భవిష్యత్తులో ఇవి మరింత ఎక్కువ కాలం, మరింత తీవ్రంగా వచ్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. పట్టణ ప్రణాళిక, చెట్ల పెంపకం, హీట్ యాక్షన్ ప్లాన్స్‌పై ప్రభుత్వాలు వెంటనే దృష్టి పెట్టాలని, లేకపోతే మున్ముందు మరింత తీవ్ర వేడి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.
మరో మూడ్రోజులు వేడి తీవ్రం
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రెండు మూడు రోజుల వరకు కూడా ఉష్ణోగ్రతల తీవ్రత ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అత్యవసరమైతే తప్ప ఇల్ల నుండి బయటకు వెళ్లొద్దంటూ వాతా వరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉష్ణోగ్రతల తీవ్రతతో పాటు వేడిగాలి తీవ్రత ఉంటుందని ఎవరూ కూడా ఇళ్ల నుంచి బయటకు వెళ్లవద్దని, నీరు, మజ్జిగ, కొబ్బరినీరు ఎక్కువగా తాగాలం టూ తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుండి సెల్ ఫోన్ల ద్వారా జనాలందరికీ సాధా రణ మెసేజ్‌లు అందుతున్నాయి.
రాష్ట్రం అగ్ని గుండం
మండుతున్న ఎండలతో రాష్ట్రం అగ్ని గుండమైంది. ఈ సీజన్లో సూర్యుడు తన ప్రతాపాన్ని పీక్స్‌కు తీసుకెళ్లాడు. మొన్నటి దాకా ఉత్తర తెలంగాణ జిల్లాలకే పరిమితమై న ఎండల సెగ.. ఇప్పుడు రాష్ట్రమంతటికీ పాకింది. బుధవారం 20 జిల్లాలు రెడ్‌జోన్‌లోకి వెళ్లాయి. ఆయా జిల్లాల్లో ఈ సీజన్లోనే హయ్యెస్ట్ గా 46 డిగ్రీలకుపైనే టెంపరేచర్లు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో అత్యధికంగా 46.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. హనుమకొండ జిల్లా పెద్దపెం డ్యాల్, కరీంనగర్ జిల్లా వెదురుగట్టు, పెద్దపల్లి జిల్లా ఓదెలలో 46.4 డిగ్రీల చొప్పున నమోద య్యాయి. జగిత్యాల జిల్లా రాయికల్, జనగా మ జిల్లా వడ్లకొండ, ఖమ్మంజిల్లా గౌరారం, కుమ్రంభీం జిల్లా ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా దేవులవాడ, నిజామాబాద్ జిల్లా బాల్కొం డల్లో 46.3 డిగ్రీల మేర టెంపరేచర్లు రికార్డ య్యాయి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్, భద్రాద్రి జిల్లా ఈ బయ్యారం, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, సిద్దిపేట జిల్లా సముద్రాల, సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులలో 46.2 డిగ్రీలు, ములుగు జిల్లా ఏటూరునాగారం, రాజన్నసిరిసిల్ల జిల్లా మార్థానపేటలలో 46.1, నల్గొండ జిల్లా అయిటిపాముల, వరంగల్ జిల్లా మేడపల్లిల్లో 46 డిగ్రీలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో 45.8 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లా బీబీపేట, యాదాద్రి జిల్లా జలాల్పూర్లలో 44.8 డిగ్రీల చొప్పున రికార్డయ్యాయి. హైదరాబాద్ సిటీలోని అనేక సర్కిళ్ల పరిధిలలో 42 డిగ్రీలకుపైగా పగటి టెంపరేచర్లు రికార్డయ్యాయి. ఇక రాష్ట్రంలో 45 డిగ్రీలు దాటిన అన్ని జిల్లాల్లోనూ హీట్వేవ్స్ప్రభావం చూపాయి. 82 మండలాల్లో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంది. జనగామ, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో వడగాడ్పులు అత్యంత తీవ్రంగా ఉన్నాయి.
ఎందుకింత వేడి..?
- క్లైమేట్ చేంజ్ ప్రభావం: భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుతుండటం వల్ల హీట్‌వేవ్‌లు మరింత తీవ్రంగా మారుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వేడిగాలులు సాధారణమై పోతున్నాయని హెచ్చరిస్తున్నారు.
- ఎల్‌నినో ఎఫెక్ట్: పసిఫిక్ సముద్రంలో ఎల్‌నినో పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయి. భారత్‌లో ఈ ప్రభావం వేసవి తీవ్రతను పెంచుతోందని నిపుణులు చెబుతున్నారు.
- వర్షాల కొరత: ప్రీ-మాన్సూన్ వర్షాలు తక్కువగా పడటం వల్ల భూమి చల్లబడే అవకాశం తగ్గిపోయింది. పొడి గాలులు, తక్కువ తేమ ఈ తీవ్ర వేడికి కారణమవుతున్నాయి.
- అర్బనైజేషన్ ప్రభావం: కాంక్రీట్ భవనాలు, వాహనాలు పెరగడం, చెట్లు తగ్గిపోతుండటం నగరాల్లో ‘హీట్ ఐలాండ్ ఎఫెక్ట్’ను పెంచుతున్నాయి. దీంతో రాత్రివేళ కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటున్నాయి.
- పర్యావరణ విధ్వంసం: ఒకప్పుడు వాతావరణాన్ని సమతూకంలో ఉంచిన సహజ వనరులన్నీ నశించిపోవడమే వేడి తీవ్రతకు కారణం. అక్రమ మైనింగ్, నదుల్లో ఇసుక దోపిడీ ప్రభావితం చేస్తున్నాయి.
- చెట్ల నరికివేత: అడవులు, చెట్ల నరికివేత వల్ల కూడా వాతావరణం వేడెక్కుతోంది. ప్రధానంగా, నగరాలు, పట్టణాల్లో పచ్చదనం తగ్గిపోవడం వల్లే వేడి తీవ్రత పెరుగుతోందని చెప్తున్నారు.
