థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ: సెమీస్లో ఇండియా

 థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ: సెమీస్లో ఇండియా

హోర్సెన్స్‌‌‌‌ (డెన్మార్క్‌‌‌‌): థామస్‌‌‌‌ కప్‌‌‌‌ బ్యాడ్మింటన్‌‌‌‌ టోర్నీలో ఇండియా మెన్స్‌‌‌‌ జట్టు అదరగొట్టింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌‌‌‌ఫైనల్లో ఇండియా 3–0తో చైనీస్‌‌‌‌తైపీపై ఏకపక్ష విజయం సాధించింది. ఫలితంగా సెమీస్‌‌‌‌లోకి ప్రవేశించి మరోసారి పతకాన్ని ఖాయం చేసుకుంది. తొలి సింగిల్స్‌‌‌‌లో లక్ష్యసేన్‌‌‌‌ 18–21, 22–20, 21–17తో వరల్డ్ ఆరో ర్యాంకర్‌‌‌‌ చౌ తియోన్‌‌‌‌ చెన్‌‌‌‌పై  గెలిచాడు. 

గంటా 28 నిమిషాల మ్యాచ్‌‌‌‌లో ఇండియన్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ అద్భుతంగా పోరాడాడు. హోరాహోరీగా సాగిన రెండో గేమ్‌‌‌‌లో లక్ష్య రెండు మ్యాచ్‌‌‌‌ పాయింట్లను కాపాడుకుని పైచేయి సాధించాడు. ఇక డిసైడర్‌‌‌‌లో బలమైన స్మాష్‌‌‌‌లు, ర్యాలీలతో దూసుకుపోయాడు. డబుల్స్‌‌‌‌లో సాత్విక్‌‌‌‌ సాయిరాజ్‌‌‌‌–చిరాగ్‌‌‌‌ షెట్టి 23–21, 19–21, 21–12తో చియు సియాంగ్‌‌‌‌ చిహ్‌‌‌‌–వాంగ్‌‌‌‌ చిలిన్‌‌‌‌పై నెగ్గారు.

 దాంతో ఇండియా ఆధిక్యం 2–0కు పెరిగింది. గంటా 15 నిమిషాల మ్యాచ్‌‌‌‌లో సాత్విక్‌‌‌‌ ర్యాలీలతో అదరగొడితే, చిరాగ్‌‌‌‌ నెట్‌‌‌‌ వద్ద సూపర్‌‌‌‌ డ్రాప్స్‌‌‌‌తో ఆకట్టుకున్నాడు. రెండో సింగిల్స్‌‌‌‌లో ఆయుష్‌‌‌‌ శెట్టి 21–16, 21–17తో వరల్డ్‌‌‌‌ ఎనిమిదో ర్యాంకర్‌‌‌‌, ఆల్‌‌‌‌ ఇంగ్లండ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ లిన్‌‌‌‌ చున్‌‌‌‌యిని చిత్తు చేశాడు.  ఫలితంగా ఇండియా 3–0తో క్లీన్‌‌‌‌స్వీప్‌‌‌‌ చేసింది. 48 నిమిషాల మ్యాచ్‌‌‌‌లో ఆయుష్‌‌‌‌ రక్షణాత్మక ఆటతీరుతో ప్రత్యర్థికి చెక్‌‌‌‌ పెట్టాడు. 2022లో గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ గెలిచిన ఇండియా 1952, 1955, 1979లో బ్రాంజ్‌‌‌‌ను సాధించింది.