గుండె చెదిరినా.. గుండె కరగట్లే!

గుండె చెదిరినా.. గుండె కరగట్లే!
  • వర్షాలకు వేలాది పాత ఇండ్లు నేలమట్టం 
  • టెంపరరీ పరిహారంతో సరిపెడుతున్న సర్కారు
  • ఓవైపు ఖాళీగా డబుల్ బెడ్రూం ఇండ్లు
  • ఇండ్లు కూలినవారికైనా కేటాయించాలని డిమాండ్

వెలుగు, నెట్వర్క్: భారీ వర్షాలు, వరదలతో ఆగస్టు నుంచి రాష్ట్రవ్యాప్తంగా పెద్దసంఖ్యలో పాత ఇండ్లు కూలిపోయాయి. వివిధ జిల్లాల్లో వేలాది మందికి నిలువ నీడ లేకుండా పోయింది. కటిక పేదరికం కారణంగా కిరాయికి సైతం ఉండలేక పక్కనే గుడిసెలు వేసుకొని, పరదాలు కట్టుకొని బతుకీడుస్తున్నవారెందరో. మరోవైపు అరకొరగా పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను ఖాళీగా పెడుతున్న సర్కారు, కనీసం  ఇండ్లు కూలిన వారికైనా కేటాయించట్లేదు. పాక్షికంగా కూలినవారికి రూ.3,200, పూర్తిగా కూలినవారికి రూ.5,200 ఇచ్చి చేతులు దులుపుకొంటోంది. ఆ మొత్తం కూడా బాధితులకు రెండు నెలలకో, మూడు నెలలకో చేతికి అందుతోంది. కొందరైతే ఆ కొద్దిపాటి పరిహారానికీ నోచుకోవడం లేదు.

జీవోలో ఎక్కువ.. ఇచ్చేది తక్కువ

ఎన్డీఆర్ఎఫ్ రూల్స్​కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 15 జూన్ 2015లో జీవో ఎంఎస్ నంబర్2 జారీ చేసింది. దీని ప్రకారం వర్షాలు, వరదలు లాంటి ప్రకృతి విపత్తుల్లో ఇండ్లు కోల్పోయిన ప్రతి ఫ్యామిలీకి రూ.95,100 చొప్పున చెల్లించాలి.  కానీ కూలింది పక్కా ఇల్లయితేనే ఈ మొత్తం ఇవ్వాలనే కండీషన్ పెట్టారు. ఆగస్టు నుంచి కురుస్తున్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7 వేలకు పైగా ఇండ్లు పాక్షికంగా, సుమారు 700 వరకు పూర్తిగా కూలిపోయాయి. కానీ అవన్నీ మట్టిగూన, రేకుల ఇండ్లు(ప్రభుత్వ లెక్కల ప్రకారం కచ్చా ఇండ్లు) కావడంతో వాటికి రూ.95,100 చొప్పున పరిహారం వర్తించదని ఆఫీసర్లు అంటున్నారు. అసలు ఎక్కడా  జీవో2 ఇంప్లిమెంట్ కావడం లేదని, పూర్తిగా కూలిన ఇండ్లకు రూ.5,200, పాక్షికంగా కూలిన ఇండ్లకు రూ.3,200 చొప్పున మాత్రమే చెల్లిస్తున్నామని చెబుతున్నారు. కడు పేదరికంలో ఉన్న బాధితులకు ఈ పరిహారం ఏమూలకూ సరిపోవడం లేదు. దీంతో చాలామంది పాత ఇండ్ల పక్కనే గుడిసో, రేకులో వేసుకొని ఉంటున్నారు. ఆ అవకాశం కూడా లేనివాళ్లు గుళ్లలో, బళ్లలో తలదాచుకుంటున్నారు. చాలామంది పాక్షికంగా కూలిన ఇండ్లలోనే కూలినవైపు పరదాలు కట్టుకొని బతుకుతున్నారు. ఇలా సగం కూలిన ఇండ్లలో ఉండడం చాలా ప్రమాదకరమని, అది ఎప్పుడైనా కూలి ప్రాణాలు కోల్పోవచ్చని హెచ్చరిస్తున్న ఆఫీసర్లు వాళ్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మాత్రం చేయడం లేదు.

డబుల్ బెడ్రూమ్ ఇండ్లనూ కేటాయించట్లే..

హైదరాబాద్ మినహా మిగిలిన జిల్లాల్లో లక్షా 84 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను శాంక్షన్ చేసిన రాష్ట్ర సర్కారు, ఇప్పటివరకు సుమారు 40 వేల ఇండ్లను మాత్రమే పూర్తిచేసింది. ఒకటి, రెండుచోట్ల తప్ప ఎక్కడా, ఎవరికి కేటాయించకపోవడంతో ఖాళీగా ఉంటున్నాయి. కనీసం ఇండ్లు కూలిన కుటుంబాలకైనా కేటాయించాలనే డిమాండ్ ఉన్నా పట్టించుకోవడం లేదు. పాడుబడ్డ ఇండ్లు వర్షాలకు కూలిపోవడంతో ఒక్క ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలోనే 12 మంది ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వ పెద్దల్లో చలనం కనిపించడం లేదు. మిగిలిన జిల్లాలతో పోలిస్తే సంగారెడ్డి జిల్లాలో నష్టం ఎక్కువగా ఉంది. భారీ వర్షాలు, వరదల వల్ల ఆగస్టు నుంచి ఇప్పటివరకు 1,650 ఇండ్లు కూలిపోయాయి. నిరాశ్రయులకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. బాధితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తామని మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చినా నెరవేరలేదు. పుల్కల్ మండలం సింగూరులో 5 కుటుంబాలు, లక్ష్మీసాగర్ తండాలో 8 కుటుంబాలు ఇండ్లు కూలి నిరాశ్రయులయ్యారు. అక్కడ 150 డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తయినా వారికి కేటాయించేందుకు ఆఫీసర్లకు చేతులు రావడం లేదు. ములుగు జిల్లా మంగపేట మండలంలో సుమారు150 ఇండ్లు కూలిపోయాయి. నష్టపరిహారం కోసం ఆధారాలతో అప్లై చేసుకున్న వారిలో పాక్షికంగా దెబ్బతిన్న ఇంటికి రూ.3,200, పూర్తిగా కూలిపోయిన ఇంటికి రూ. 5,200 నష్టపరిహారం బాధితుల బ్యాంక్ ఖాతాలలో రెవెన్యూ ఆఫీసర్లు జమ చేశారు. ఈ మండలంలో 100కుపైగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తి అయినప్పటికీ ఒక్కరికి కూడా అధికారికంగా కేటాయించలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. పూర్తిగా ఇండ్లు కోల్పోయినవారికి పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలనే డిమాండ్ వినిపిస్తోంది.

బిడ్డను మింగిన గుడిసెలో  ఉండలేం

నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం బాలన్ పల్లికి చెందిన మమత, భీమయ్య  తమ ఆరేళ్ల కూతురు పూజితతో కలిసి గుడిసెలో పడుకున్నరు. సెప్టెంబర్ 15న రాత్రి కురిసిన భారీ వర్షానికి గుడిసె మట్టి గోడ కూలి పూజిత చనిపోయింది. తమ పేదరికమే తమ కూతురిని బలి తీసుకుందని భీమయ్య దంపతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆఫీసర్లు వచ్చి చూశారు.  రూ.2,500 ఇచ్చి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.  తమ బిడ్డను మింగిన ఈ గుడిసెలో తాము ఉండలేకపోతున్నామని కంటతడి పెడుతున్నారు.

ఇల్లు కూలినా.. సాయం అందలే

పక్కన ఫోటోలో కనిపిస్తున్న జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభంపల్లికి చెందిన మహిళ పేరు గుగ్గిళ్ల  ప్రమీల. భర్త అనారోగ్యంతో చాలాకాలం కింద చనిపోయిండు. కూలికిపోతే తప్ప పూట గడవని ఈమెకు ముగ్గురు ఆడపిల్లలు. ఊరంతా కలిసి సాయం చేయడంతో పెద్దబిడ్డ పెండ్లి చేసింది. మిగిలిన ఇద్దరు బిడ్డలతో  కలోగంజో తాగుతూ బతుకుతున్న ఆమెను అకాలవర్షం కోలుకోలేని దెబ్బ తీసింది. మెన్నటి వానలకు ఉన్న ఒక్క ఇల్లూ కూలిపోయింది. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదు. గూడు చెదిరిన తమకు ఆర్థికసాయం అందజేసి, డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతోంది.

ముగ్గురి పానాలు పోయినయ్

వానకు మా పాత ఇల్లు బాగ నానింది. అందరం ఇంటి బయటనే పండుకున్నం.కరెంట్ రాగానే ఇద్దరు పిల్లలు ఫ్యాన్ కోసం ఇంట్లకు పోయిండ్రు. తెల్లార్తుండంగానే మిద్దె కూలి నా భార్య శరణమ్మ, బిడ్డలు వైశాలి, భవాని ప్రాణాలు పోయినయ్. తెల్లారితే నా పెద్దబిడ్డ ఫంక్షన్ ఉండే. అది చేస్కొకుండానే దేవుడు తీస్కబోయిండు. రెండు నెలలైతున్నా సర్కారు సాయం చేయలే . కొందరు లీడర్ల చేసిన సాయంతో  రేకులతో షెడ్ ఏస్కోని మా అమ్మతో కలిసి ఉంటున్న.  ప్రభుత్వం ఇల్లు కట్టి ఇయ్యాలె.

– జొన్నల మల్లప్ప, పగిడ్యాల గ్రామం, గండీడ్ మండలం, మహబూబ్ నగర్ జిల్లా